Highway to Swades: మనలోనే సూపర్‌శక్తి

4 Dec, 2022 04:01 IST|Sakshi
భైరవి జానీ

భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు భైరవి జానీ. లాజిస్టిక్‌ సప్లై చైన్‌ వ్యవస్థాపకురాలైన భైరవి జానీ దేశం అంతటా పద్ధెనిమిది వేల కిలోమీటర్లకు పైగ పర్యటించి, తన అనుభవాలతోపాటు, ఎంతోమంది అభిప్రాయాలను పొందుపరిచి, ‘హైవే టు స్వదేశ్‌’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన భైరవి జానీ మనదేశంలోనే సూపర్‌ శక్తి ఉందంటూ తన పర్యటన విశేషాలను, అనుభవాలను పంచుకున్నారు.

‘‘భారతదేశపు నాగరికతపై దృష్టి సారించినప్పుడు మనవారిలో ఉన్న సూపర్‌ పవర్స్‌ ఏంటో అర్దమైంది. నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రాన్‌ అఫ్‌ కచ్‌ వరకు, దక్కన్‌ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలన్నీ 51 రోజుల పాటు 18,181 కిలోమీటర్లు ప్రయాణించాను. వీటితోపాటు రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా చేసిన వివిధ ప్రయాణాలలో పరిశీలనల విశ్లేషణ కూడా ఇందుకు దోహదపడింది.

► స్వయంగా తెలుసుకుని...
2014లో ఒక రోజు రోడ్‌ ట్రిప్‌లో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్దిపై సమగ్ర పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే నా వ్యాపార పనులతో పాటు రోడ్‌ ట్రిప్స్‌ కూడా ప్లాన్‌ చేసుకునేదాన్ని. అన్ని చోట్లా ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. చాలా భిన్నమైన పరిస్థితులు, అతి సాధారణ విషయాలు కూడా స్వయంగా చూసి తెలుసుకున్నాను. అలాగే, పెద్ద యెత్తున వ్యాపారాలు చేస్తున్న వారినీ కలిశాను. హిమాలయాల్లో ఉన్న భిన్న కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నాను. వారి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులన్నింటిపైన ఒక అవగాహన తెచ్చుకున్నాను. కోవిడ్‌ లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాను.  

హైదరాబాద్‌ విషయాలనూ ఇందులో పొందుపరిచాను. ఇక్కడి వంటకాలు, దుస్తులు, భాష,. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, పండగలు, వ్యాపారం.. ప్రతిదీ సమ్మేళన సంస్కృతిగా ఉంటుంది. పాత నగరం నుంచి ఇప్పుడు ఆధునిక మహానగరంగా టెక్నాలజీ హబ్‌గా మారింది. ఇదంతా ప్రజల విజ్ఞానశక్తి, వ్యాపార శక్తిని సూచిస్తుంది. ‘హైవే టు స్వదేశ్‌’ అనేది భారతదేశంలోని పన్నెండు సూపర్‌ పవర్‌లకు అద్భుతమైన ప్రతిబింబం అని చెప్పవచ్చు.

► సమయపాలన
చాలా మంది ‘మీరు 20 వేర్వేరు కంపెనీలలో బోర్డు మెంబర్‌గా ఉండి, ట్రావెలర్‌గా, రచయితగా సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ పని పూర్తిచేయనిదే నాకు నిద్ర పట్టదు. నేను తిరిగిన నేల, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకుంటున్నప్పుడు జరిగింది అదే. టైమ్‌ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయం ఉంటుంది. రాజు అయినా కూలీ అయినా మనకు ఉండేది 24 గంటలు మాత్రమే. అందుకనే సమయాన్ని పనులవారీగా విభజించుకొని, ప్లాన్‌ చేసుకుంటాను. ముందుగా ఏ పని ముఖ్యమో దానిపైనే దృష్టి పెడతాను. ప్రతి విషయంలో ముందే ప్లానింగ్‌తో ఉంటాను. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తాను. కుటుంబం, వ్యాపారం, రచనలు .. ఇలా టైమ్‌ని విభజించుకుంటాను.

► రోడ్‌ ట్రిప్స్‌..
మన దేశం చాలా అందమైనది. ఎంతో విజ్ఞానం ఇక్కడ ప్రజల మధ్య, సంస్కృతుల్లో భాగంగా ఉంది. ప్రతిచోటా ఆసక్తికరమైన కథనాలెన్నో. ఈ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కంపెనీ, ఏదో ఒకదానిపైన ఆధారపడకుండా ప్రజలు తమ మధ్య ఉన్న సూపర్‌ పవర్స్‌పై నమ్మకంతో ముందడుగు వేయాలి. మనకి మనమే ఒక అద్భుతమైనవారిగా విశ్వసిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌లో పాల్గొనాలి. జనంతో మాట్లాడాలి. దేశం అభివృద్ధికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి, అందులో మనకున్న కలల సాధనకు కృషి చేయాలి’ అని వివరించారు భైరవి జానీ.

1896లో స్థాపించిన ఎస్‌.సి.ఏ. గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు దశాబ్ద కాలం నుంచి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తోంది భైరవి. ఈ క్రమంలో అనేక వెంచర్లను ప్రారంభించడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ముంబై వాసి అయిన భైరవి జానీ యుఎస్‌ఎలో చదివి, అక్కడే వ్యాపారలావాదేవీలు కొనసాగించి 2001లో తన స్వంత వెంచర్‌ను ప్రారంభించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ, విదేశాల్లో బిజినెస్‌ ఉమన్‌గా తన సత్తా చాటుతున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణిగానూ ఆమెకు పేరుంది. హిమాలయాల్లో ఉన్న వివిధ కమ్యూనిటీ ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు