స్పృహ: పర్యావరణ రక్షాబంధన్‌

9 Aug, 2022 00:25 IST|Sakshi

ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అని గట్టిగా అనుకోవచ్చు. అయితే ముంజేతి రాఖీకి అద్దం అక్కర లేకపోవచ్చుగానీ... అర్థం మాత్రం ఉంటుంది. బంధాల గురించి రాఖీ
ఎన్నో మాటలు చెప్పకనే చెబుతుంది. ఇప్పుడది పర్యావరణహిత వచనాలు కూడా అందంగా చెబుతోంది. ‘మమ్మల్ని చల్లగా చూడు తల్లీ’ అంటూ చెట్లకు రాఖీ కట్టే ఆచారం ఉంది.

‘అయితే మనం చల్లగా ఉండాలంటే చెట్టు చల్లగా ఉండాలి. పర్యావరణం బాగుండాలి’ అంటున్నారు హిమాచల్‌ప్రదేశ్‌కు  చెందిన మహిళలు.  పైన్‌ చెట్ల పత్రాలతో ఎకో–ఫ్రెండ్లీ రాఖీలు తయారుచేస్తూ పర్యావరణహిత సందేశాన్ని ఊరూరు తీసుకువెళుతున్నారు....

పైన్‌ చెట్ల నుంచి నేల రాలిన పత్రాల వలన ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నకు ఉపయోగపడే సమాధానం ఒకప్పుడు ఒక్కటి కూడా వినిపించేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. బోలెడు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిఫామ్స్‌ ప్రయోగాత్మకంగా 22 మంది మహిళలకు పైన్‌ పత్రాలతో రాఖీల తయారీ నేర్పించింది. ఆ తరువాత సిమ్లా, సోలన్‌ జిల్లాలో 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒక కోణం అయితే, పర్యావరణానికి మేలు జరగడం మరో కోణం.

ఎండిపోయిన పైన్‌ పత్రాల వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గింది.
‘గతంలో పైన్‌ పత్రాలపై దృష్టి ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవి మాకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ ప్రయోజన కార్యక్రమాల్లో భాగం అయ్యేలా చేస్తున్నాయి’ అంటుంది ప్రియదర్శిని కుమారి.

రకరకాల మొక్కల విత్తనాలు కూర్చి ఈ రాఖీలను తయారు చేయడం ప్రత్యేకతగా నిలుస్తుంది.
‘హిమాచల్‌ప్రదేశ్‌ గ్రామీణప్రాంతాల్లో చిన్నస్థాయిలో అయినా ఉపాధి దొరకడం కష్టం అయ్యేది. ఈ రాఖీల తయారీ వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలను జనాలలో ప్రచారం చేయగలుగుతున్నాం’ అంటుంది 42 సంవత్సరాల హేమావతి.
ట్రైనర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన హేమావతి నెలకు ముప్పై వేలకు  పైగా సంపాదిస్తుంది.

‘పర్యావరణ స్పృహ పెరిగిన తరువాత ఎకో–ఫ్రెండ్లీ రాఖీలకు డిమాండ్‌ పెరిగింది. రెగ్యులర్‌ రాఖీల కంటే భిన్నంగా ఉండడం కూడా వీటి డిమాండ్‌కు మరో కారణం’ అంటుంది నేహా.
ఊరూరూ తిరిగి ఎకో–ఫ్రెండ్లీ రాఖీలను అమ్మడమే కాదు పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలను ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకు వెళుతున్నారు.
‘ఈ సంవత్సరం నా సోదరులకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులకు కూడా వీటి ప్రత్యేకతను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది కాలేజి స్టూడెంట్‌ శ్వేత.

దిల్లీకి చెందిన తోరాని బ్రాండ్‌ రాఖీలు కూడా పర్యావరణ స్పృహతో తయారుచేయబడుతున్నాయి. పాత దుస్తులు, బట్టలతో తయారుచేసిన పాతబ్యాగులు... మొదలైన వాటిని ఉపయోగించి అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

మంగళూరు(కర్నాటక)లోని ‘పేపర్‌సీడ్‌ కో’ అనే సామాజిక సంస్థ రకరకాల మొక్కల విత్తనాలను కూర్చి పర్యావరణహిత రాఖీలను తయారు చేస్తుంది. పండగ తరువాత చేతికి ఉన్న రాఖీలోని విత్తనాలు భూమిలోకి వెళ్లి పచ్చటి భవిష్యత్‌ను ఇస్తాయి. ఈ రాఖీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ‘పేపర్‌సీడ్‌ విలేజి’ కోసం కేటాయిస్తున్నారు. ఇది మహిళలకు పర్యావరణహిత బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ.
ఎకో–ఫ్రెండ్లీ రాఖీల గురించి సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు