హోప్‌ అంటే హిమజ: 4 వేల మంది పైగా పిల్లలకు చదువు

10 Feb, 2021 11:03 IST|Sakshi

తాను పడిన కష్టం మరెవరూ పడకూడదని ఆలోచించే వారు అరుదుగా కనిపిస్తారు. సరిగ్గా ఇటువంటి అరుదైన వారి కోవకే చెందుతారు హైదరాబాద్‌కు చెందిన హిమజారెడ్డి. విద్య ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని బలంగా నమ్మే హిమజ .. చదువుకోలేని పరిస్థితిలో ఉన్న అట్టడుగు, అణగారిన వర్గాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ‘హోప్‌ ఫర్‌ లైఫ్‌’ అనే ఎన్జీవోని స్థాపించి ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగువేల మందికి పైగా పిల్లలకు చదువు చెబుతున్నారు. ‘‘విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు... జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకు చదువే సమాధానం చెబుతుంది. అయితే అందరూ బోలెడంత డబ్బు వెచ్చించి చదువుకోవడం కష్టం.

అందుకే ఎవరైతే చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో ఈ ఎన్జీవోను స్థాపించా’’నని హిమజ  చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు వేలమంది పిల్లలకు ఉచిత విద్యాబోధన చేశామని ఆమె పేర్కొన్నారు. చిన్నతనంలో అనాథాశ్రమంలో పెరిగిన తనకు విద్య విలువ బాగా తెలుసునని, అందుకే పిల్లలకు విద్య ఎంత ముఖ్యమో గ్రహించానన్నారు. ‘‘తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మూడేళ్ల వయసు నుంచే నేను అనాథాశ్రమంలో అనాథగా పెరిగాను. అణగారిన వర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, అనాథ పిల్లలకు విద్య ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూశాను. అందుకే నాలాగా ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఎన్జీవోని స్థాపించానని ఆమె చెప్పారు. 

ముగ్గురి నుంచి 4 వేలకు పైగా
హిమజ  డిగ్రీ చదివేటప్పుడు ముగ్గురు అమ్మాయిలను దత్తత తీసుకుంది. అలా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు నాలుగువేల పైకి చేరింది. తన డిగ్రీ పూర్తయిన తరువాత ముగ్గురు టీమ్‌ మెంబర్స్‌తో కలిసి 2015లో ‘హోప్‌ ఫర్‌ లైఫ్‌’ అనే ఎన్జీవోని స్థాపించారు. 2017లో ఈ సంస్థ అధికారికంగా రిజిస్టరైంది. ప్రస్తుతం ఈ సంస్థ పిల్లలకు చదువు చెప్పడమేగాక దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని అనేక సమస్యలపై పనిచేస్తున్నారు. పిల్లలకు విద్యతోపాటు ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా హెల్త్‌ క్యాంప్‌లు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇవేగాక రుతుక్రమ సమయంలో అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.

చదవండిట్విన్‌ సిస్టర్స్‌ కొత్త ఆలోచన: ‘నెక్సెస్‌ పవర్‌’

మరిన్ని వార్తలు