మతాలు వేరైనా.. మమతలు ఒక్కటే

22 May, 2021 01:09 IST|Sakshi
డాక్టర్‌ రేఖాకృష్ణ

చివరి ఘడియల్లో చాలాచోట్ల ఇప్పుడు ఆసుపత్రి సిబ్బందే అయినవారు అవుతున్నారు. ఆఖరి చూపులూ వారివే అవుతున్నాయి. పాలక్కాడ్‌ లోని ఒక ఆసుపత్రిలో తాజాగా ఒక ముస్లిం మహిళ చివరి క్షణాలలో ఆ ఆసుపత్రి డాక్టర్‌.. రేఖ మాత్రమే ఆమె చెంతన ఉన్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆ మహిళ చెవిలో ‘షహాద’ కూడా వినిపించారు! హిందూ మహిళ అయివుండీ షహాద చెప్పిన డాక్టర్‌ రేఖ ‘సంస్కారానికి’ ముస్లిం సమాజం అంతా హర్షిస్తోంది.

డాక్టర్‌ రేఖాకృష్ణకు తనిక చేయగలిగిందేమీ లేదని అర్థమైంది! ఐసీయులో ఉన్న ఒక కోవిడ్‌ పేషెంట్‌ చివరి ఉఛ్వాస నిశ్వాసాలను ఆ క్షణంలో ఆమె చూస్తూ ఉన్నారు. పాలక్కాడ్‌లోని పఠంబి లో ‘సేవన హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌’లో ఆమె వైద్యురాలు. మే 17 ఆ రోజు. డాక్టర్‌ రేఖ కళ్లెదుట మరణశయ్యపై ఉన్నది ఒక ముస్లిం మహిళ. అప్పటికి కొద్దిసేపటికి క్రితమే వెంటిలేటర్‌ను తొలగించారు. కుటుంబ సభ్యులకు కబురు కూడా వెళ్లింది. పోయే ప్రాణం ఎందుకోసమో ఆగి ఉన్నట్లుగా అనిపించింది డాక్టర్‌ రేఖకు ఆమెను సమీపాన్నుంచి చూస్తున్నప్పుడు! ఆమె మనసులో ఏదో స్ఫురించింది.

వెంటనే ఆ పేషెంట్‌ చెవిలో మెల్లిగా.. ‘లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్‌ రసూలుల్లాహ్‌..’ అని ‘షహాద’ పఠించారు. అల్లా ఒక్కడే దేవుడు, మహమ్మదు అతడిచే అవతరించబడిన ప్రవక్త’ అనే విశ్వాస వచనమే షహాద. సంప్రదాయం ప్రకారం ఆ మతస్తులు చేయవలసిన ప్రార్థన షహాద. కుటుంబ సభ్యులు వచ్చేలోపు డాక్టర్‌ రేఖ తనే ఆ ప్రార్థన వచనాలను ఆఖరి మాటలుగా ఆ మహిళకు వినిపించారు. అప్పటికి రెండు వారాలుగా కోవిడ్‌ న్యుమోనియాతో చికిత్స పొందుతున్నారు ఆవిడ. అన్నీ రోజులూ ఆమె తరఫువాళ్లు ఆమెను చూడ్డానికి వీల్లేకపోయింది. ఆఖరికి.. చివరి చూపును కూడా! వారికి ఆ లోటు తెలియకుండా, పేషెంట్‌ మనసును గ్రహించినట్లుగా డాక్టర్‌ రేఖ ఒక ముస్లింలా ఆ ప్రార్థన వచనాలను పలికారు.
∙∙
హిందూ మహిళ అయుండీ షహాదను పఠించినందుకు ముస్లిములంతా డాక్టర్‌ రేఖపై దీవెన లు కురిపిస్తున్నారు. ‘‘ముందుగా అనుకున్నదేమీ కాదు. నాకెందుకో అలా చేయాలని అనిపించింది. బహుశా నేను దుబాయ్‌లో కొన్నాళ్లు పని చేసి వచ్చినందువల్ల, అక్కడి వారితో కలిసిమెలిసి ఉన్నందు వల్ల, వాళ్లు నా పట్ల చూపిన గౌరవ మర్యాదలకు కృతజ్ఞతగా నేనిలా చేసి ఉంటాను’’ అంటున్నారు డాక్టర్‌ రేఖ. ఆమెకు అరబిక్‌ వచ్చు. ‘‘అందుకే ఉచ్చారణ దోషాలు లేకుండా షహాద ను జపించగలిగాను’’ అంటారు.

అయితే ఈ విషయం బయటికి రావడంలో డాక్టర్‌ రేఖ ప్రమేయం ఏమాత్రం లేదు. సాటి వైద్యుడి ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న ముస్లిం ప్రొఫెసర్‌ ఒకరు ఫేస్‌బుక్‌లో డాక్టర్‌ రేఖ చొరవ ను కొనియాడుతూ పెట్టిన పోస్ట్‌ చదివిన వారు అభినందనలు తెలియజేస్తుంటే ఆమె స్పందించవలసి వచ్చింది. అబ్దుల్‌ హమీద్‌ ఫైజీ అంబలక్కడవు అనే సున్నీ స్కాలర్‌ అయితే డాక్టర్‌ రేఖ చేసిన పని పట్ల అమితమైన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మతం పేరుతో మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్న తరుణంలో పర మత సహనానికి ఆమె ఒక ఆదర్శంగా నిలిచారు’’అని అభివాదాలు తెలియజేశారు.

ఇటీవలే మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఇలాంటి ‘సంస్కారవంతమైన’ ఘటనే జరిగింది. అయితే ఆ ఘటనలో.. ఆయేషా అనే ముస్లిం మహిళ.. అయినవారెవరూ దగ్గర లేకపోవడంతో ఒక హిందూ పురుషుడికి మత సంప్రదాయాల ప్రకారం తనే అంత్యక్రియలు జరిపించి అందరి మన్ననలు పొందారు.                    

‘‘దీన్నొక మత విషయంగా నేను చూడలేదు.. మనిషికి మనిషి సాయం అన్నట్లుగానే భావించాను’’  
– డాక్టర్‌ రేఖాకృష్ణ

మరిన్ని వార్తలు