జపాన్‌లో కూడా కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం..!

29 Oct, 2023 09:10 IST|Sakshi

రకరకాల జాతరలలో కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం మన దేశంలో ఉంది. ఇలా నిప్పుల మీద నడిచే ఆచారం జపాన్‌లోనూ ఉంది. జపాన్‌ ప్రజలు జరుపుకొనే ‘హక్కాయిసాన్‌’ పండుగ రోజున ఆరుబయట ఏర్పాటు చేసే అగ్నిగుండాల్లోని నిప్పుల మీద ఉత్తకాళ్లతో నడిచే ఆచారం ఉంది. ఈ పండుగను ఏటా వసంత రుతువులో ఒకసారి, శరదృతువులో మరోసారి జరుపుకొంటారు. మినామియువోనుమా నగరం శివార్లలో హక్కాయి కొండ దిగువన ఒసాకీ డ్యామ్‌ వద్దనున్న ‘హక్కాయిసాన్‌ సన్‌’ ఆలయం ఎదుట అగ్నిగుండాలను ఏర్పాటు చేసి, ఈ వేడుకను జరుపుకొంటారు.

ఈసారి శరదృతువులో నిప్పుల మీద నడిచే పండుగను అక్టోబర్‌ 20న జరుపుకొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రార్థనలతో మొదలయ్యే ఈ కార్యక్రమంలో మొదటగా ఆలయ పూజారి అగ్నిగుండం మీదుగా 88 అడుగులు నడిచి, ఆలయంలోకి చేరుకుంటారు. ఆయన తర్వాత మిగిలిన జనాలు కూడా ఆయననే అనుసరిస్తూ నిప్పుల మీదుగా 88 అడుగులు నడిచి ఆలయంలోకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆహార సంబరాలు కూడా జరుపుకొంటారు. నూడుల్స్‌తో తయారు చేసే ‘సోబా’, గోధుమపిండి ఆక్టోపస్‌లతో తయారు చేసే ‘టకోయాకీ’ వంటి సంప్రదాయ వంటకాలను ఆరగిస్తారు. నిప్పుల మీద నడవడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయని, కోరికలు ఈడేరుతాయని ఇక్కడి జనాలు నమ్ముతారు. 

(చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం!)

మరిన్ని వార్తలు