హోలీ ఎలా ప్రారంభమైందో తెలుసా?

28 Mar, 2021 10:48 IST|Sakshi

స్వర్గలోకం కళకళలాడుతోంది. ముఖ్యంగా ఇంద్ర సభ కోలాహలంగా ఉంది. ఇంద్రుడు, శచీ దేవి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు... అందరూ హడావుడి పడుతున్నారు. ఇంద్రుడు మాత్రం అందరి హడావుడిని సంబరంగా చూస్తున్నాడు. వినోదంగా చూస్తున్నాడు. విలాసంగా చూస్తున్నాడు. ఆహ్లాదంగా చూస్తున్నాడు. ఇంద్రుడిని పలకరించటానికి ఎవ్వరికీ ధైర్యం చాలట్లేదు. శచీదేవి వచ్చి, ‘ప్రభూ! మిమ్మల్ని పలకరించటానికి అందరూ భయపడుతున్నారు. అందరూ సంబరాలు చేసుకుందామని ఉబలాటపడుతూ, హడావుడి పడుతూంటే, మీరేమిటి, నిశ్చింతగా మీ సింహాసనం మీద కదలకుండా కూర్చున్నారు.

అక్కడ నుంచి లేస్తే, ఎవరైనా ఎత్తుకుపోతారని భయమా’ అంది కొంచెం హేళనగా. ఇంద్రుడు నో కామెంట్‌. పెదవి విప్పలేదు. ముఖంలో ఏ భావమూ కనపడనివ్వలేదు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు వచ్చి, ‘ప్రభూ! ఈ రోజు అందరూ ఇంత సంతోషంగా సంబరాలు జరుపుకోవాలనుకుంటుంటే, మీరు మా మధ్యలోకి రాకుండా, ఏకాంతంగా మీ సింహాసనం మీద కదలకుండా కూర్చోవటం భావ్యంగా లేదు. లేచి రండి’ అంటూ ఇంద్రుడిని గోముగా ఆహ్వానించారు. ఇంద్రుడు నో కామెంట్, నో రెస్పాన్స్‌. ‘ఐరావతంలా కూర్చునిపోయారేంటి’ అంది మళ్లీ శచీదేవి.

అక్కడే ఉన్న ఐరావతానికి కోపం వచ్చి, గట్టిగా ఘీంకరించింది. వెంటనే సద్దుకుని, ‘ఏమిటీ ఉచ్చైశ్రవంలానైనా కదలటంలేదు’ అంది. అంతే! అశ్వరాజానికి కోపం వచ్చి సకిలించింది. ‘అమ్మో! ఎవర్ని ఏమన్నా కోపం తెచ్చుకుంటున్నారు.. అనుకుంది శచీదేవి. ఇంద్రుడిలో ఏ చలనమూ లేదు. ‘ఆ కల్పవృక్షమే నయం. ఎవరు ఏది కోరితే అది ఇస్తుంది, మీరూ ఉన్నారు ఎందుకు, కనీసం కంటితో కూడా మాట్లాడట్లేదు’ అంది శచీదేవి. కల్పవృక్షం సంతోషంతో తన తనువును ఊగిసలాడించింది. శచీదేవికే సమాధానం చెప్పనివాడు, మన మాటకు ఏం విలువ ఇస్తాడు, ఇంద్రసభకు ఎవరొచ్చినా మనం నాట్యం చేయాలి, మనకు ఆరోగ్యం బాగోలేకపోయినా తప్పనిసరిగా నర్తించాలి. పెదవుల మీదకు నవ్వు పులుముకోవాలి. ఈయనగారు మాత్రం నోరు విప్పకుండా మనల్ని అగౌరవపరుస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు... అనుకుంటూ నలుగురూ చిన్నబుచ్చుకుని, వెనుకకు మరలుతూ, ఇంద్రుడిని తూలనాడుకున్నారు.

వారు అటు మరలగానే, కిన్నెరకింపురుషులు ‘ప్రభూ! మీరు మౌనం విడవాలి, మీ సింహాసనాన్నీ విడవాలి. ఇక్కడే ఇలా బెల్లంకొట్టిన రాయిలా కదలకుండా కూర్చుంటే, మా గతేంటి. ప్రభువులు వచ్చి ప్రారంభించకపోతే ఏ కార్యక్రమాన్నీ ప్రజలు జరుపుకోలేరు కదా. ఈరోజు పండుగ కదా. అదీరంగుల పండుగ కదా. ఏడాదికోసారి వచ్చే పండుగ కు కూడా మీరు రాకుండా ఉంటే ఎలా అంటున్నారు... అంటూ సుమధుర స్వరంతో ఏకబిగిన తూలనాడుతూనే ఉన్నారు. వినిపించుకోలేదు ఇంద్రుడు. చివరగా గంధర్వులు వచ్చి, ‘ప్రభూ, మీ మౌనానికి, మీ స్తబ్దతకు కారణం తెలుసుకోవచ్చా. మీరు లేచి రాకపోతే ఎలా ప్రభూ, లేవండి రండి, పండుగను ప్రారంభించండి’ అన్నారు బతిమలాడే ధోరణిలో.

నెమ్మదిగా పెదవుల పట్లు సడలిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, కుడి చేతిని కుడిపక్కకు పంపి శరాలు అందుకుని, ఎడమచేత్తో విల్లు అందుకుని, బాణం సంధించి ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఆకాశంలో పెద్ద ఇంద్రధనుస్సు ప్రత్యక్షమై, తెల్లటి ఆకాశమంతా సప్తవర్ణాలతో కన్నులపండువుగా అయ్యింది. అంతే! స్వర్గమంతా హోలీ సంరంభం ప్రారంభమైంది. శచీదేవి, కిన్నెరకింపురుషులు, గంధర్వులు అందరూ ఆ రంగులలో తడిసిముద్దయిపోయారు. ఇందుకేనా ఇంద్రుడు ఇంతవరకు కదలకుండా కూర్చున్నాడు.

ఇంద్రధనుస్సు సంధించి హోలీ పండుగను ప్రారంభించాడు. ఎంతైనాకలోకాధిపతి, ఇంద్రపదవీ ధారులు.. అంటూ అందరూ కేరింతలు కొట్టారు. ఇంద్రుడు దర్పంగా ఎక్కుపెట్టిన బాణాన్ని తిరిగి తన చేతిలోకి తీసుకుని, రెండు మూడుసార్లు అదేవిధంగా సంధించి, అందరూ రంగులతో ఆడుకుంటుంటే విలాసంగా వీక్షిస్తూ ఆనందించాడు.
సృజన రచన: వైజయంతి పురాణపండ 

మరిన్ని వార్తలు