Wall Planters: అనుభూతుల గోడ.. మెట్ల మార్గంలో లతలు.. ఇంకా

14 Apr, 2022 13:42 IST|Sakshi

ఈ కాలంలో ప్రతి ప్రయత్నమూ చల్లదనం కోసమే ఉంటుంది. అందుకే సాయంకాలాలు కాసేపు చల్లని గాలిని ఆస్వాదించడానికి ఇంటి ముందున్న మొక్కల మధ్య కాసేపు తిరగాలనుకుంటాం. కానీ, అపార్ట్‌మెంట్ల సంస్కృతి వచ్చాక పచ్చదనం ఏ పార్కుల్లోనో వెతుక్కోక తప్పడం లేదు. అలాంటి వారి కోసం వాల్‌ ప్లాంటర్స్‌ సరైన ఎంపిక అవుతోంది.

మొక్కలతో గోడను అలంకరించడానికి మీరు నిపుణులే అయి ఉండాల్సిన అవసరం లేదు. గాలి నుంచి∙కాలుష్య కారకాలను ఫిల్టర్‌ చేయడం ద్వారా ఇంటి గోడలు విడుదల చేసే వేడి కూడా తగ్గుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికే కాదు మనలో ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఆఫీసులలో వాల్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగుల ఉత్పాదకత, ఏకాగ్రాత 47 శాతం పెరిగిందని అంతర్జాతీయ అధ్యయనాలూ స్పష్టం చేస్తున్నాయి. అంటే, ఏ విధంగా చూసినా ఇండోర్‌ లేదా ఔట్‌డోర్‌లో మొక్కల పెంపకం తప్పనిసరే కాదు, ఇంటి అలంకరణలో ప్రధాన ఆకర్షణ కూడా. 

అనుభూతుల గోడ: ఇంటి లివింగ్‌ రూమ్‌లోకి అడుగుపెడుతూనే సాధారణంగా మన దృష్టి ఎదురుగా కనిపించే గోడపై పడుతుంది. అప్పుడు ఆ గోడ మన భావాలను ప్రతిబింబించేలా ఉండాలి. అందుకు నాలుగు వాల్‌ ఇండోర్‌ ప్లాంట్‌ బాక్స్‌లను ఒకదానికొకటి సరైన స్పేస్‌తో అమర్చి చూస్తే, ఆ తేడా స్పష్టంగా మీకే తెలుస్తుంది. 

కలర్‌ మ్యాచ్‌: వేసవి కాలం ఇంటి లోపలి గోడల రంగులు లేతవే ఎంచుకుంటారు. ఈ రంగుకు మ్యాచ్‌ అయ్యే ప్లాంటర్స్‌నే ఎంచుకోవాలి. అప్పుడు పచ్చదనం పూర్తి కాంట్రాస్ట్‌తో చూపులను ఆహ్లాదపరుస్తుంది. 

గ్రీన్‌ హౌస్‌: అప్పటికప్పుడు ఇంటి వాల్స్‌ అన్నీ గ్రీన్‌ థీమ్‌తో అమరాలంటే కొన్ని రోజుల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. నర్సరీ కుండీలలో పెంచిన వివిధ మొక్కలను నచ్చిన ప్లాంటర్‌లోకి నేరుగా మార్చుకోవచ్చు. అది ఎంత ఎక్కువ మొత్తంలో ఉన్నవైనా ఎంచుకోవచ్చు. 

వెలుతురు మొక్కలు: డైనింగ్‌ ఏరియాలో ప్లాంట్‌ వాల్‌ కావాలని కోరుకుంటే ఆ ప్రాంతంలో వెలుతురు తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు మొక్కలతో పాటు లైటింగ్‌ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ఈ లైట్ల ఏర్పాటుతో మొక్కలకు అధిక వేడి తగిలి వాడిపోవచ్చు. అందుకని, మొక్కల ఎదుగుదలకు అడ్డంకులేమీ ఏర్పడకుండా లైటింగ్‌ను చూసుకోవడం ముఖ్యం. 

మెట్ల మార్గంలో లతలు: ఇంటిలోపల లేదా బయట మెట్ల మార్గం ఉంటే ఆ వాల్‌ని అలాగే ప్లెయిన్‌గా వదిలేయకుండా ఎకో ఫ్రెండ్లీ థీమ్‌తో మొక్కలను ఏర్పాటుచేసుకోవచ్చు. ఇందుకు వెదురు, కలప, రీసైక్లింగ్‌ ప్లాంటర్స్‌తో మెట్ల వాల్‌ను అందంగా అలంకరించవచ్చు.  

మరిన్ని వార్తలు