తేనెతో గుండెపోటు నివారణ సాధ్యమా?

4 Mar, 2021 14:00 IST|Sakshi

రకరకాల తీపిపదార్థాల్లో తీపిని అందించే పదార్థాలను గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌ అని పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే. అలాగే తేనెలో తీపిని ఇచ్చే పదార్థాన్ని ‘ట్రెహలోజ్‌’ అంటారు. కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్‌ చేస్తూ నిర్వించిన పరిశోధనలు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయేమోననే అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయట. తేనెలోని టెహ్రలోజ్‌ ఇంజెక్ట్‌ చేసిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ‘ప్లాక్‌’ చేరలేదట.

పైగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. అయితే ఈ ట్రెహలోజ్‌ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లోనూ లేదా ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్‌ చేసిన మూషికాలలో ఈ విధమైన తగ్గుదల కనిపించలేదు. ప్రస్తుతం కనుగొన్న విషయం భవిష్యత్తులో అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్‌ అనే ఒక రకం ఇమ్యూన్‌ కణాలు చేస్తుంటాయి. వాటిని పుట్టించేందుకు అవసరమైన టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ప్రోటీన్‌ ఉత్పాదనకు ట్రెహలోజ్‌ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

దాంతో గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలోజ్‌ సహాయంతో రక్తనాళాల్లోని పాచిని తొలగించి, తద్వారా గుండెపోటు ముప్పును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇలా చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే అంశంపై వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు