మంచి మాట: శత్రుత్వంతో శత్రుత్వం పెట్టుకుందాం

19 Dec, 2022 01:07 IST|Sakshi

ఏ ఒకవ్యక్తిని మాత్రమో... ఏ కొంతమందిని మాత్రమో కాదు, కుటుంబాలకు కుటుంబాలను, ఊళ్లకు ఊళ్లను, రాష్ట్రాలకు రాష్ట్రాలను, దేశాలకు దేశాలను, మొత్తం ప్రపంచాన్ని వేధించేది శత్రుత్వం. ప్రతిమనిషికీ, ప్రపంచానికీ శత్రుత్వం తీరని గాయాల్ని కలిగిస్తూనే ఉంది. జీవితాలకు జీవితాలే శత్రుత్వానికి కాలి బూడిద అయిపోయాయి.

శత్రుత్వం అగ్ని అయి అందరికీ అంటుకుంది, అంటుకుంటోంది... ఉన్నంతవరకూ నిప్పు కాలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం మనిషి కడతేరిపోయేంతవరకూ రగులుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యక్తులుపోయాక కూడా వాళ్ల వారసులకూ అంటుకుని శత్రుత్వం వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంది. శ్వాస తీసుకుంటున్నట్లుగా మనిషి శత్రుత్వాన్ని కూడా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది.

పుట్టీపుట్టడంతోనే శత్రువును, వ్యాధిని ఎవరైతే పోగొట్టుకోడో అతడు ఎంతటి బలవంతుడైనా  నశించిపోతాడని భోజ చరిత్రం చెబుతోంది. అంటే వ్యాధిని, శత్రువును లేదా శత్రుత్వాన్ని ముదరనివ్వకూడదు. సాధ్యమైనంత వేగంగా వాటిని తీర్చేసుకోవాలి. శత్రుత్వం వ్యాధిలాంటిది అని అనడం, అనుకోవడం కాదు శత్రుత్వం వ్యాధికన్నా వినాశకరమైంది అనే సత్యాన్ని మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి.

కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం మరికొన్ని దేశాలనూ బాధించింది, బాధిస్తోంది... కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం వల్ల జరిగిన యుద్ధాల్లో కలిగిన ప్రాణ నష్టాన్ని, సంపద నష్టాన్ని చరిత్ర మనకు తెలియజెబుతూనే ఉంది. శత్రుత్వం కారణంగా దేశ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు, విలవిలలాడిపోతున్నారు...ఇటీవలి కరోనా విలయానికి కూడా కొన్ని దేశాల శత్రుత్వమే కారణం అని కొన్ని పరిశీలనలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.

సంస్కృతి పరంగానూ, సంపదపరంగానూ, విద్యపరంగానూ, అభివృద్ధి పరంగానూ ఏర్పడిన శత్రుత్వం  ప్రధాన కారణం కాగా మనదేశంలోకి విదేశీ దురాక్రమణదారులు చొరబడి దేశాన్ని కొల్లగొట్టడమూ, ఆక్రమించుకోవడమూ, సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చెయ్యడమూ అందువల్ల మనదేశానికి పెద్ద ఎత్తున నష్టం, కష్టం కలగడమూ చారిత్రికసత్యంగా మనకు తెలిసిందే. కొన్ని శతాబ్దులకాలం మనదేశం పరపాలనపీడనలో దురవస్థలపాలవడానికి శత్రుత్వం ప్రధానమైన కారణం అయింది.  ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా శత్రుత్వం కారణంగా ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దురంతాలకు శత్రుత్వం ఒక్కటే ప్రాతిపదిక అయింది. శత్రుత్వం ఉంటే దురంతమే ఉంటుంది. శత్రుత్వం ప్రేరణకాగా ప్రపంచంలో ఎన్నో ఘోరమైన పరిణామాలు జరిగాయి.

శత్రుత్వంవల్ల మనం ఎంత మాత్రమూ క్షేమంగా లేం. శత్రుత్వంవల్ల చాలకాలం క్రితమే మనిషితో మనిషికి ఉండాల్సిన సంబంధం లేకుండాపోయింది. శత్రుత్వం మనిషిని ఆవహించింది అందువల్ల మనం ఎంత మాత్రమూ భద్రంగా లేం. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం బుద్ధిలోకి తీసుకోవాలి. మనిషి ప్రగతి, ప్రశాంతతలను, ప్రపంచ ప్రగతి, ప్రశాంతతలను ధ్వంసం చేస్తున్న శత్రుత్వాన్ని తక్షణమే త్యజించాలి. క్షయకరమైన శత్రుత్వం మనిషి లక్షణం కాకూడదు. శత్రుత్వం మనిషి జీవనంలో భాగం కాకూడదు.

‘ఇది నాలుగురోజుల జీవితం ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం’ ఈ భావంతో  తెలుగు కవి–గాయకుడు పి.బి. శ్రీనివాస్‌ ఒక ఉర్దూగజల్‌ షేర్‌ రాసి, పలికారు. ఆలోచిద్దాం... మన బతుకుల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఛిద్రం చేసే శత్రుత్వం మనకు ఎందుకు? ఆలోచిద్దాం... మనం జీవించడానికి శత్రుత్వం అవసరం ఉందా?

మనం శత్రుత్వాన్ని సంపూర్ణంగా వదిలేసుకుందాం. అది సాధ్యం కాకపోతే శత్రుత్వంతోనే శత్రుత్వం చేద్దాం. సాటి మనిషికీ, సమాజానికీ కాదు మనిషి శత్రుత్వానికి శత్రువైపోవాలి. మనిషికి శత్రుత్వంలో ఉన్న నిజాయితి, అభినివేశం స్నేహంలో లేకుండా పోయాయి. ఇది విధ్వంసకరమైన స్థితి. ఈ స్థితి మనకు వద్దు. మనిషి తీరు మారాలి. శత్రుత్వం ఇలలో లేకుండా పోవాలి.
ఇప్పటికే మనమందరమూ శత్రుత్వం వల్ల ఆవేదన చెందుతున్నాం. ఇకనైనా సంసిద్ధులమై శత్రుత్వంతో శత్రుత్వమూ, స్నేహంతో స్నేహమూ చేస్తూ బతుకుదాం. నిజమైన మనుషులమై మనం మనకూ, ప్రపంచానికీ వీలైనంత మంచి, మేలు చేసుకుందాం.

‘ఇది నాలుగురోజుల జీవితం, ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? / నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం‘

 – రోచిష్మాన్‌

మరిన్ని వార్తలు