ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటున్నారా?

15 Jun, 2022 18:36 IST|Sakshi

ఒక కార్టూన్‌లో... యువకుడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ కాస్త ‘సెల్‌’ (జైలు)గా మారుతుంది. అందులో బందీ అయిన కుర్రాడు బయటికి బిత్తర చూపులు చూస్తుంటాడు. యువతరం డిజిటల్‌ వ్యసనానికి అద్దం పట్టే కార్టూన్‌ ఇది.

హైదరాబాద్‌కు చెందిన పల్లవికి అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వస్తుంటుంది. లేచి తన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు ‘పదిలంగానే ఉన్నాయా లేదా!’ అని ఒకసారి చూసుకొని పడుకుంటుంది. చెన్నైకి చెందిన శ్రీహర్షిణి ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌. తాను చదువుకుంటున్నా, ఏదైనా పనిలో ఉన్నా సెల్‌ఫోన్‌ రింగైనట్లు శబ్దభ్రమ కలిగి, ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటుంది. ఇవి మాత్రమే కాదు...

‘స్క్రీన్‌ టైమ్‌’లో తినాలనిపించకపోవడం, నిద్రపోవాలనిపించకపోవడం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం, స్క్రీన్‌ యాక్సెస్‌కు అవకాశం లేని సమయాల్లో ఒత్తిడికి గురికావడం, చిరాకు అనిపించడం, కోపం రావడం, ఏదైనా సరే ఆన్‌లైన్‌లోనే చేయాలనుకోవడం (అవసరం లేకపోయినా సరే), ఫోన్‌లలో ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం గడపడం (ఉద్యోగ విధుల్లో భాగంగా కాదు), చదువు దెబ్బతినడం... మొదలైనవి ‘డిజిటల్‌ అడిక్షన్‌’ కు సూచనలుగా చెబుతున్నారు.

‘ఇది సమస్య’ అని తెలుసుకోలేనంతగా ఆ సమస్యలో పీకల లోతులో మునిగిపోయిన యువతరం ఇప్పుడిప్పుడే ఆ వ్యసనం ఊబి నుంచి బయటపడడానికి, స్వీయచికిత్సకు సిద్ధం అవుతోంది. ‘డిజిటల్‌ అడిక్షన్‌’కు దూరం కావడానికి యువతరంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న టెక్నిక్స్‌లో కొన్ని....

20–20–20: ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఫోన్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవడం. 20 సెకండ్ల పాటు ఫోన్‌ను 20 ఫీట్ల దూరంలో పెట్టడం.

అన్నీ బంద్‌: పడుకోవడానికి ముందు అన్ని స్క్రీన్‌లు ఆఫ్‌ చేయడం.

డిజిటల్‌ ఫాస్ట్‌: నెలలో కొన్నిరోజులు గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండడం.

యూజ్‌ టెక్‌–స్టే ఆఫ్‌ టెక్‌: అధిక సమయం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించకుండా యాప్‌ బ్లాకర్, టైమ్‌ ట్రాకర్‌లను ఉపయోగించడం. ఉదా: సెల్ఫ్‌–కంట్రోల్, ఫోకస్‌ బూస్టర్, థింక్‌... మొదలైన యాప్స్‌

అలారం: అలారం సెట్‌ చేసుకొని ప్రతి అరగంటకు ఒకసారి మాత్రమే సెల్‌ఫోన్‌ చెక్‌ చేసుకోవడం.

మిగులు కాలం: డిజిటల్‌ ప్రపంచంలో గడపడానికి నిర్దిష్టమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని, మిగులు కాలాన్ని పుస్తకాలు చదవడానికి, స్నేహితులను ప్రత్యక్షంగా కలవడానికి ఉపయోగించడం, ఇంటి పనుల్లో పాల్గొనడం... మొదలైనవి.

టర్న్‌ ఆఫ్‌: ఫోన్‌లో రకరకాల నోటిఫికేషన్లకు సంబంధించి ‘టింగ్‌’ అనే శబ్దాలు వస్తుంటాయి. ఎంత కాదనుకున్నా వాటిని చూడాలనిపిస్తుంది. దీనివల్ల టైమ్‌ వేస్ట్‌ అవుతుంటుంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి నోటిఫికేషన్‌ టర్న్‌ ఆఫ్‌ చేయడం.

నో ఫోన్స్‌ ఎట్‌ నైట్‌ పాలసీ: అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ స్మార్ట్‌ఫోన్‌ వైపు చూడరాదు  అనేది ఈ పాలసీ ఉద్దేశం.

టెక్‌ దిగ్గజాలు కూడా కాలం వృథాను అరికట్టడానికి కొత్త ఫీచర్‌లు తీసుకువస్తున్నాయి. తాజాగా టిక్‌టాక్‌ రెండు స్క్రీన్‌టైమ్‌ ఫీచర్లను తీసుకువచ్చింది. 

‘మొదట్లో డిజిటల్‌ ఫాస్ట్‌ అనే మాట నాకు వింతగా అనిపించేది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని వాదించేదాన్ని. నేను కూడా ప్రాక్టిస్‌ చేసి చూశాను. చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఏదైనా మితంగానే ఉపయోగిస్తే మంచిది అనే వాస్తవాన్ని తెలుసుకున్నాను’ అంటుంది పల్లవి. ముంబైలో డిగ్రీ రెండో సంవత్సరం స్టూడెంట్‌ అయిన మేఘ ఒకప్పుడు ఫేస్‌బుక్‌లో నుంచి అరుదుగా మాత్రమే బయటికి వచ్చేది. ఈ వ్యసనం తన చదువుపై తీవ్ర ప్రభావం చూపడంతో డిజిటల్‌ ఫాస్ట్‌ వైపు మొగ్గు చూపింది.

‘ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వాటికవే చెడ్డవేమీ కాదు. అయితే వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం, ఎంతసేపు ఉపయోగిస్తున్నాం అనేది అసలు సమస్య’ అంటారు మానసిక నిపుణులు.

మొన్నటి వరకు ‘ఫోమో’ ప్రపంచంలో (ఫోమో... ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌. ఏదైనా మిస్‌ అవుతున్నానేమో అనే భావనతో పదే పదే ఫోన్‌ చెక్‌ చేసుకోవడం) ఉన్న యువతరం ఇప్పుడు  ‘జోమో’ ప్రపంచంలోకి  (జోమో... జాయ్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌–మిస్‌ కావడంలో కూడా ఆనందం వెదుక్కోవడం) రావడానికి గట్టి కృషే చేస్తోంది. మంచిదే కదా!  (క్లిక్‌: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?)

మరిన్ని వార్తలు