కోవిడ్‌ తగ్గడం లేదూ.. ట్రావెల్‌ తప్పడం లేదు... మరి ఎలా? 

26 Dec, 2021 13:24 IST|Sakshi

ఓ వైపు కోవిడ్‌ తగ్గడం లేదు...  మరోవైపు ప్రయాణాలు చేయాల్సిన అవసరం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 

► అన్నిటికంటే ముందుగా రెండు విడతల్లో తాము వ్యాక్సిన్‌ డోసులను తీసుకున్నామని తెలిపే పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. 
► తాము వెళ్తున్న ప్రదేశంలో  ఉండే వాతావరణ పరిస్థితులకు అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... వాటిని ఆచరించాలి.  

► తమకు ఏవైనా సమస్యలుంటే అవి కరోనా ఇన్ఫెక్షన్‌తో కలిసి కో–మార్డిడ్‌ (ప్రమాదానికి దారితీసే అవకాశాలున్న వ్యాధులు)గా పరిణమించే అవకాశం  ఉన్నట్లయితే ఆ మేరకు అవసరమైన మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే వ్యవధికి అవసరమైన మేరకు మందులను సంసిద్ధం చేసుకోవాలి.
(చదవండి: మొసళ్ల కన్నీళ్లు తుడిచారు.. మీరు భేషుగ్గా ఈ నదిలో ఉండవచ్చు!)

► విదేశాలకు వెళ్లేవారు కరోనా పరీక్ష చేయించుకుని, తమకు కోవిడ్‌ లేదనే సర్టిఫికేట్‌ను వెంట ఉంచుకోవాలి. కోవిడ్‌ పరీక్షలు, వ్యాక్సిన్ల విషయంలో వివిధ దేశాల నిబంధనలు వేర్వేరుగా ఉండవచ్చు. వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. 
► పిల్లల విషయంలో కొంత సమస్య వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరగలేదు. అయితే విదేశాల్లోని కొన్నిచోట్ల 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకూ, 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఇవ్వడాన్ని అనుమతించారు. ఈ నేపథ్యంలో పిల్లలకు క్వారంటైన్‌ నిబంధలు వర్తించే అవకాశం ఉంది. అందుకే తమ గమ్యస్థానంలో పిల్లల విషయంలో ఉన్న కోవిడ్‌ నిబంధలను తెలుసుకున్న తర్వాతే ప్రయాణం నిర్ణయించుకోవడం అవసరం. 

► ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతున్నాయి.  ‘‘ఫిట్‌ టు ఫ్లై’’ నిబంధనలుగా చెప్పే వీటిని ముందుగా తెలుసుకోవాలి. దాంతో మున్ముందు తాము పడబోయే ఇబ్బందులను తేలిగ్గా నివారించుకున్నట్లు అవుతుంది.
(చదవండి: హైపో థైరాయిడిజమ్‌.. ఏం తినాలి? ఏం తినకూడదు!!)

► తాము బస చేయబోయే చోట కొందరు ‘పాస్ట్‌ ట్రావెల్‌ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. గతంలో తాము ప్రయాణం చేసివచ్చిన ఆయా ప్రాంతాలు ఒకవేళ కంటెయిన్‌మెంట్‌ జోన్లు లేదా నిషేధ ప్రాంతాలుగా ఉంటే... ఆ ప్రయాణికులను అనుమతించబోరు లేదా నిర్దేశిత సమయం కోసం వారిని క్వారంటైన్‌లో ఉంచవచ్చు. అందుకే తమ పాస్ట్‌ ట్రావెల్‌ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్‌ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది. ఒకవేళ అక్కడ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే ఆ మేరకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

► ప్రయాణం ఎలా చేసినప్పటికీ (బస్సు, ట్రైన్, విమానం) అక్కడ గుంపులు మనుషులు (క్రౌడ్‌) ఉన్నచోట మాస్కులు విధిగా ధరించడం, ప్రయాణంలోనూ తరచూ శానిటైజర్‌తోగానీ లేదా సబ్బుతోగానీ చేతులు శుభ్రం చేసుకవడం లాంటి తగిన కోవిడ్‌ నిబంధనల వల్ల ప్రయాణం చాలావరకు సురక్షితంగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. 
-డాక్టర్‌ ఆర్‌.వి. రవి కన్నబాబు, సీనియర్‌ కన్సల్టెంట్‌, జనరల్‌ మెడిసిన్, విశాఖపట్నం .

మరిన్ని వార్తలు