దీపావళి నోము: మనోబలానికి సంకల్పం

4 Nov, 2021 00:07 IST|Sakshi

‘ఏ పని తలపెడుతున్నామో అది పూర్తయ్యేంతవరకు మనలో సంకల్పం బలంగా ఉండాలి’ అంటారు పెద్దలు. కుటుంబ శ్రేయస్సుకు తపించే మనసుకు తగినంత బలం అందాలంటే అందుకు దైవ శక్తి కూడా తోడవ్వాలి అనేది పండితుల వాక్కు. అందుకే, అనాది నుంచి కుటుంబ క్షేమం కోసం చేసే దైవారాధనలలో నోములు, వ్రతాలు మన జీవనంలో ఓ భాగమయ్యాయి. వాటిలో కొన్ని ప్రాంతాలలో దీపావళి రోజున చేసుకునే కేదారేశ్వర వ్రతం (నోము)కు విశేష ప్రాముఖ్యత ఉంది.

ఈ నోమును సాక్షాత్తు పార్వతీదేవే నోచిందని, పరమేశ్వరుడి అనుగ్రహం పొందిందని పురాణోక్తి. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీ దేవి కేదారేశ్వర వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమినాడు మొదలుపెట్టి అమావాస్య వరకు ఆచరించినట్టుగా చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు చాలా వరకు దీపావళి అమావాస్య రోజున ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో గౌరీ సమేత కేదారేశ్వరుడిని పూజించి, ఆ ఆది దంపతుల కృపను పొందుతుంటారు. 

కల్పవల్లి.. పాలవెల్లి..
పీఠం మధ్యన ధాన్యరాశిని పోసి, అందులో పూర్ణకుంభాన్ని ఉంచి, ఇరవై ఒక్క దారాలతో సూత్రాన్ని చుట్టి, గంధ పుష్పాక్షతలను ఉంచాలి. పీఠానికి పై భాగాన మామిడి ఆకుల తోరణాలు, పూలతో అలంకరించిన పాలవెల్లిని అమర్చుకోవాలి. పసుపు గౌరి, పసుపు గణపతి. జాకెట్టు ముక్క, నోము దండ, 21 తమలపాకులు, 21 నల్ల పోకలు, 21 ఖర్జూర పండ్లు. వత్తిపత్తి, పసుపు, కుంకుమ, 2 ఎండుకొబ్బరి చిప్పలు, 2 కొబ్బరికాయలు, హారతి కర్పూరం, కంకణం(చేతికి కట్టుకునే తోరం), ధూప, దీప, నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి.

గౌరీ తనయుడితో ఆరంభం..
ముందుగా గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి (పసుపు గణపతిని) ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకొని, సంకల్పం చెప్పుకోవాలి. కేదారేశ్వరుని ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృతస్నానం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పాలతో షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అథాంగపూజ, అష్టోత్తర శతనామ పూజ, అధసూత్ర గ్రంధిపూజ చేసి శ్రీ కేదారేశ్వర వ్రత కథ విని, బ్రాహ్మణులు, పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఉపవాస దీక్షను విరమిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలుగా భావించే నోముదండలను మెడలో ధరించి, పసుపు, కుంకుమ, పండు, ఆకు, వక్కలను ముల్తైదువులకు వాయినంగా ఇవ్వడంతో నోము పూర్తవుతుంది. 

మరుసటి ఏడాది దీపావళి నోము వరకు తమ ఇంట కేదారేశ్వరుని అనుగ్రహంతో ఆయురారోగ్య, సౌభాగ్య, ఐశ్వర్యాభివృద్ధి మెండుగా కలుగుతుందన్న నమ్మకమే కొండంత అండగా భక్తులు తమ జీవనప్రయాణాన్ని కొనసాగిస్తారు. 
సర్వేజనా సుఖినోభవంతు! 

మరిన్ని వార్తలు