కరోనా భయాన్ని జయించడం ఎలా..?

24 Apr, 2021 00:42 IST|Sakshi

అనవసర భయాల నుంచి మనస్సును వేరే అంశాల వైపు మళ్లించుకోవడానికి (డైవర్ట్‌ చేయడానికి) గట్టిగా ప్రయత్నించాలి. కరోనా అంటేనే చాలామందిలో భయం ఏర్పడిపోయింది. కరోనా సోకితే భయం. పాజిటివ్‌ కాకపోయినా తమకూ వస్తుందేమో అనే భయం. కరోనాతో ఆస్పత్రుల్లో సీరియస్‌గా ఉన్న వారి గురించి, మరణించిన వారి గురించిన వార్తలు, అంబులెన్సుల సైరన్లు వంటి నెగెటివ్‌ విషయాలు వినడం వల్ల ఓవర్‌ థింకింగ్‌ అలవాటైపోతోంది. దీంతో గుండె దడ, గాభరా పెరిగి పోతుంది. పులి వచ్చినప్పుడు ఫేస్‌ చేయడం ఎలా అనేది నేర్చుకోవాలి. అంతే కానీ అదిగో వస్తోంది, ఇదిగో వస్తోంది అనే టెన్షన్‌ పడకూడదు. ఈ విధమైన అవగాహన పెంచుకోవాలి. కొందరైతే పాజిటివ్‌ కాకపోయినా ముందుగానే ఆసుపత్రిలో బెడ్‌ బుక్‌ చేసుకుంటున్నారు. ఇంత ఆలోచన పనికిరాదు.

ఒక విషయం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే... అంతగా అదే జోన్‌లోకి మనం వెళ్లిపోతాం. ప్రసుతం కోవిడ్‌ వచ్చినవారికి అప్పటివరకూ లేని భయాలు కూడా ఆవరిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది హార్ట్‌ అటాక్‌ వస్తుందేమోనన్నది. దాంతో కాస్త గుండె గట్టిగా కొట్టుకున్నా ఆందోళన పడుతున్నారు. ఇవన్నీ ఇమ్యూనిటీని దెబ్బతీసేవే. ఇలాంటివారిలో రికవరీ అయ్యాక కూడా తీవ్రమైన అలసట కనపడుతోంది. పెద్ద వయసు వారిలో జ్ఞాపకలేమి, ఏవోవో ఫోబియాలు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమయంలో మనసును బాగా డైవర్ట్‌ చేసుకోవాలి. వీలైతే గార్డెనింగ్‌ దగ్గర్నుంచి కేరమ్స్‌ ఆడడం వరకు నచ్చిన పనులు చేసుకుంటూ ఉండాలి. కోవిడ్‌ వల్ల నలుగురితో కలవడం కూడా (సోషలైజేషన్‌) బాగా తగ్గిపోయింది. అలవాటు లేని ఒంటరితనం వల్ల బాగా డిప్రెషన్‌కి గురవుతున్నారు.  ఎవరైనా సరే ఒంటరిగా ఉండొద్దు. ఇతరులు కూడా ఇలాంటి వారిని ఒంటరిగా వదలొద్దు. ఏదో రకమైన పలకరింపు ముఖ్యం. 

డా.హరిణి, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, కేర్‌ హాస్పిటల్, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు