దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?

12 Nov, 2023 10:02 IST|Sakshi

దీపావళిని కేవలం హిందువులు మాత్రమే కాదు వివిధ రకాల మతస్తులు కూడా జరుపుకుంటారు. అందులో కూడా చాలా విభిన్న రకాలుగా ఉంటాయి. ఇక దీపాలు వెలిగించి బాణాసంచాలు కాలుస్తూ దేశవిదేశాల్లో ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఏయే మతస్తులు ఏవిధంగా జరుపుకుంటారో చూద్దాం!.

ఈ పండగను హిందువులతో పాటుగా బౌద్ధులు, జైనులు,సిక్కులు కూడా వారి వారి మత సంప్రదాయాలను అనుసరించి పాటిస్తారు! కొందరు ఈ పండుగ నుంచి కొత్త సంవత్సరాన్ని కూడా ప్రారంభిస్తారు! ఈ పండగని ఉత్తర భారత దేశంలో ఐదు రోజుల పండుగగా చేస్తారు. దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా వ్యవహరిస్తూ ..ఆ రోజు లక్ష్మీ పూజ చేసే అలవాటు కూడా ఉంది.

మనం మూడు రోజుల పండుగగా దీన్ని జరుపుకుంటాం !నరక చతుర్దశి,దీపావళి అమావాస్య,బలి పాడ్యమి అని ఆ మూడు రోజులను వ్యవహరిస్తారు!మొదటి రెండు రోజులు ఆశ్వయుజ మాసంలో చివరన వస్తాయి.మూడవది అయిన బలి పాడ్యమి మాత్రం కార్తీకమాసం మొదటి రోజున జరుపుకుంటారు!నరక చతుర్దశి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి,నరకుని సంహరించి ,అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు!సత్యభామ సమేతుడై శ్రీ కృష్ణుడు నరక సంహారం కోసం సమాయత్తమయ్యాడు!ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది!ఆ పౌరాణిక గాధ మీకందరికీ తెలిసిందే! ఈ కధ బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ,ఈ పండుగకు ,దీనికీ సంబంధించిన సరైన నిర్ధారణ ఏ వ్రత గ్రంధాలలోనూ లేదు!

నిజానికి దీని అర్ధం 'నరకం'నుండి విముక్తి పొందాలని!అయితే ,దానికి నరకాసురిడి పేరుని అన్వయించి నరక చతుర్దశిగా పండుగను చేసుకుంటున్నారు!ఈ పండుగను దేశమంతా ఎంతో ఘనంగా చేసుకుంటారు! కొత్త బట్టలు ధరించి,మిఠాయిలు పంచి, దీపాలతో గృహాలను అలంకరించి--ఎంతో దేదీప్యమానంగా ఈ పండుగను జరుపుకుంటారు. వ్యాపారులు ,లక్ష్మీపూజ చేసి వ్యాపార స్థలాలను కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అత్తవారింటికి రావటం కూడా ఆనవాయతీ ఉంది! ఈ పండుగకు దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తారు!. ఈ దీపాలు వెలిగించటం వెనక ఒక ఆధ్యాత్మిక ఉద్దేశ్యం కూడా లేకపోలేదు!.

దుర్గా దీపావళి..!
మనలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని బయటికి త్రోలి,జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలని దీని ఉద్దేశ్యం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్ధం. శ్రీరామచంద్రుడు 14 ఏండ్ల అరణ్యవాసం తర్వాత ఈ రోజున మళ్ళీ అయోధ్యలో కాలు పెట్టాడు. విజయదశమి రోజున రావణ సంహారం జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు దీపావళి పండుగతో పాటుగా కాళీపూజను కూడా జరుపుకుంటారు. వారు ఈ పండుగను దుర్గా దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ దీపావళి పండుగ రోజుల్లోనే అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించటం చేత బౌద్ధులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

జైన మత స్థాపకుడైన మహావీరుడు నిర్యాణం చెందిన రోజు కూడా ఈ దీపావళి పండుగ రోజుల్లోనే ​రావటం వల్ల, జైనులు కూడా ఆయనకు స్మ్రుతి చిహ్నంగా దీపాలను వెలిగించి ఈ పండుగను చేసుకుంటారు!​ ​సిక్కుల తొమ్మిదవ గురువైన ​గురు హర్ గోవింద్ ఈ రోజునే గ్వాలియర్ చెరసాల నుంచి విడుదలయిన రోజు కావటం చేత, సిక్కు మతస్తులు కూడా దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటారు. దీపాలను వెలిగించటం భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికతను కూడా సంతరించుకుంది. దురదృష్టం ఏమిటంటే,కొందరికి మాత్రమే ఇది దీపావళి,చాలామంది పేదలకు ఇది అమావాస్య !అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూసే అసలు దీపావళి త్వరలోనే రావాలని భగవంతుని వేడుకుందాం!
--కూర్పరి - శారదాప్రసాద్

(చదవండి: దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.!)

మరిన్ని వార్తలు