ఎనర్జీ డ్రింక్స్‌.. ఎంతవరకు సేఫ్‌

12 Jan, 2021 08:30 IST|Sakshi

తక్షణ శక్తి, చురుకుదనం, ఏకాగ్రత పెంచే పానీయాలుగా ఎనర్జీ డ్రింక్‌కు పేరు. వీటిని ఎక్కువగా క్రీడాకారులు తాగుతుంటారు. ఇప్పుడిప్పుడే మిగిలిన వారూ వీటిని అలవాటు చేసుకుంటున్నారు. అయితే, ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నట్లు ఏదైనా మితం అయితేనే ఉపయోగకరం. అతిగా తీసుకుంటే అనవసర చిక్కుల్లో పడక తప్పదు. ఎనర్జీ డ్రింక్స్‌కు సైతం ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ, కొందరు అదే పనిగా ఎనర్జీ డ్రింక్స్‌ తాగడానికి అలవాటు పడి ఉంటారు. ఇలా వ్యసనంగా మార్చుకోవడం వల్ల కలిగే నష్టాలు, బయటపడే మార్గాల గురించి తెలుసుకుందామిలా... 

ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫెన్, చక్కెర, బి–విటమిన్లు, ఎల్‌–టారిన్‌ లాంటి అమైనో ఆమ్లాల ఉత్పన్నాలు, ఆయుర్వేద మూలికా గుణాలు ఉంటాయి. అందువల్లే ఎనర్జీ డ్రింక్స్‌ శారీరక, మానసిక ఉత్ప్రేరక పానీయాలుగా పనిచేస్తాయి. అయితే, ఈ లాభాలతోపాటు ఇందులోని కెఫెన్, చక్కెర కలిగించే దుష్ప్రభావాలూ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి ఈ డ్రింక్స్‌ను తాగడాన్ని వ్యసనంగా మార్చుకోవడం, సహజశక్తిని నమ్ముకోకుండా వీటిపైనే ఆధారపడడం. 

వ్యసనం–లక్షణాలు
ఏదైనా ఒక అలవాటు మనకు హాని చేస్తుందని తెలిసినా మానలేకపోవడమే వ్యసనం. ఇదొక మానసిక స్థితి. అతిగా తినడం, తాగడం, కంప్యూటర్‌ గేమ్స్‌కు అలవాటు పడడం.. తదితరం అన్నీ ఇలాంటివే. ఎనర్జీ డ్రింక్స్‌ వ్యసనం కూడా ఇలాంటిదే. మాదకద్రవ్యాల వ్యసనంలా ఇదంత హానికరం కాకపోయినప్పటికీ ఇది కూడా ప్రమాదకరమే. ఇలా ఎనర్జీ డ్రింక్స్‌ వ్యసనంగా మారడానికి అందులోని కెఫెన్, ఆర్ట్టఫియల్‌ స్వీట్నర్స్‌దే ప్రధాన పాత్ర. 

ఈ వ్యసన లక్షణాలు ఇలా ఉంటాయి.  
∙ఎనర్జీ డ్రింక్స్‌ను తాగాలనే బలమైన కోరికలు 
∙మనసులో ఎనర్జీ డ్రింక్స్‌ గురించే ఆలోచనలు 
∙ఎనర్జీ డ్రింక్స్‌ను పరిమితి లోపు మాత్రమే తీసుకోవడంలో అదుపు కోల్పోవడం. 
∙ఈ డ్రింక్స్‌కు తాగకుండా ఉన్నప్పడు తలనొప్పి, చిరాకు, అలసట వచ్చినట్లు అనిపించడం.  

దుష్ప్రభావాలు
ఎనర్జీ డ్రింక్స్‌లో ఆమ్ల స్వభావం ఎక్కువ. అందువల్ల వీటిని ఎక్కువగా తాగినప్పుడు చిగుళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా దంత సమస్యలు వస్తాయి. అలాగే తరచూ వీటిని తాగడం వల్ల బరువు పెరిగే ప్రమాదమూ ఉంది. ఇది ప్రయోగాత్మక అధ్యయనంలోనూ నిజమని తేలింది. అలాగే షుగర్‌ శాతం అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్‌ తరచూ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలైన హృద్రోగాలు, టైప్‌ 2 డయాబెటిస్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ షుగర్‌ లేని ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకున్నా అందులోని కెఫెన్, ఆర్టిఫియల్‌ స్వీటర్న్‌ సైతం టైప్‌ 2 డయాబెటిస్, జీర్ణక్రియ సమస్యలు సృష్టిస్తాయని అంటున్నారు. ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే రోజూ కనీసం ఒకటి రెండు ఎనర్జీ డ్రింక్స్‌ కొనడం ఆర్థిక పరిస్థితినీ ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

అయితే, ఎనర్జీ డ్రింక్స్‌ వ్యసనం నుంచి బయటపడడం కూడా అంత సులభం కాదు. ఒక క్రమపద్ధతిలో దీని నుంచి దూరం కావడానికి ప్రయత్నం చేయాలి. హఠాత్తుగా మానేయాలని ప్రయత్నిస్తే కొన్ని రకాల చెడు ప్రభావాలు సైతం కనిపించే ప్రమాదం ఉంది. అందువల్ల డాక్టరును సంప్రదించి ఆ తర్వాత ఒక క్రమపద్ధతిలో ఈ వ్యసనం బారి నుంచి బయటపడడానికి ప్రయత్నించవచ్చు. అలాగే ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు కాఫీ, లేదా డికాఫ్, పండ్ల రసాలు, గ్రీన్‌ టీ, ఆయుర్వేద టీలు తీసుకోవడం ద్వారానూ ఫలితం పొందవచ్చు.

మరిన్ని వార్తలు