ఎక్కువగా ఏడిస్తే కళ్ల కింద క్యారీ బ్యాగులే..

7 May, 2021 08:57 IST|Sakshi

పెరి ఆర్బిటల్‌ పఫ్ఫినెస్‌.. అంటే చటుక్కున అర్థం కాదు. కానీ కళ్ల కింద క్యారీ బ్యాగులనగానే వెంటనే తెలిసిపోతుంది. కళ్ల చుట్టూ ఉండే కండరాల్లో (ఆర్బిట్స్‌ అంటారు)వచ్చే వాపును శాస్త్రీయంగా పెరి ఆర్బిటల్‌ పఫ్ఫినెస్‌ అని, ఈ టిష్యూలో ఫ్లూయిడ్స్‌ పేరుకుపోవడం వల్ల వచ్చే వాపును పెరి ఆర్బిటాల్‌ ఎడిమా అనీ అంటారు.  వయసు వచ్చే కొద్దీ కంటి దిగువ పెరిగే కొవ్వు కారణంగా ఏర్పడే సమస్యని సబ్‌ఆర్బిక్యులారిస్‌ ఆక్యులి ఫ్యాట్‌ అంటారు. ఈ సమస్య చిన్నపెద్దా తేడా లేకుండా అందరిలో కనిపిస్తుంది. కామన్‌ గా వీటిని ఐబ్యాగ్స్‌ అంటారు. చిన్నవయసువారి లో కనిపించే బ్యాగ్స్‌ కొంత జాగ్రత్త తీసుకుంటే కనిపించకుండా పోతాయి. పెద్దవారిలో వచ్చేవి ఎంత యత్నించినా కొన్నిసార్లు దాచలేము. ఇవి పెద్దగా సీరియస్‌ కండిషన్‌ కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే కొన్నిమార్లు ఇబ్బందులు పెరుగుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు వీటి నివారణకు యత్నించడం మేలు.

కారణాలనేకం :
ఐబ్యాగ్స్‌ పేరుకుపోవడానికి కారణాలనేకం ఉన్నాయి. వయసు, తిండి, హార్మోన్స్‌, వ్యాధులు, మెడిసిన్స్‌ వాడకం, మానసిక స్థితి.. ఇలా అనేక అంశాలు క్యారీబ్యాగ్స్‌కు కారణమవుతుంటాయి.
వయసు
వయసు పెరిగేకొద్దీ కళ్ల కింద చర్మం పలచబడి వేలాడుతుంటుంది. ఈ ఖాళీల్లోకి ఫ్లూయిడ్స్‌ చేరుతుంటాయి. దీంతో ఇవి క్రమంగా విస్తరించి పర్మినెంట్‌గా ఉండిపోతాయి. వయసుతోపాటు టియర్‌గ్లాండ్స్‌ సరిగా పనిచేయక లూబ్రికేషన్స్‌  తేడాలు వచ్చి కళ్ల కింద వాపు వస్తుంది.
ఏడుపు, నిద్రలేమి
ఎక్కువగా ఏడ్చేవాళ్లకు కన్నీళ్లలో ఉండే సాల్ట్‌ కారణంగా ఐబ్యాగ్స్‌ వస్తుంటాయి. అదేవిధంగా కలత నిద్ర పోయేవారిలో కంటి లూబ్రికేషన్స్‌ లో వ్యత్యాసాలు వస్తాయి. ఇవి క్రమంగా కంటికింద బ్యాగులకు దారితీస్తుంటాయి. అలాగే రాత్రి పడుకొని పొద్దున లేచాక కంటి చుట్టూ ఫ్లూయిడ్‌ బాలెన్స్‌ సరిగా జరగక ఉబ్బుతుంటాయి.
థైరాయిడ్‌ సమస్యలు 
థైరాయిడ్‌ సమస్యల కారణంగా శరీరద్రావకాల్లో మ్యూకోపాలీసాఖరైడ్స్‌ తదితర రసాయనాల ఫిల్టరేషన్‌  సరిగా జరగదు. దీంతో ఇవన్నీ కణజాలాల మధ్య ఖాళీల్లోకి ఆస్మాసిస్‌ ద్వారా ప్రవహించి పేరుకుపోతుంటాయి. 
వ్యాధులు
పెరిఆర్బిటాల్‌ సెల్యులైటిస్, బ్లిఫారో కెలాసిస్, చాగస్‌ డిసీజ్, మోనో న్యూక్లియోసిస్‌ లాంటి కండీషన్ల కారణంగా కంటి చుట్టూ వలయాల్లో ఫ్యాట్‌ లేదా ఫ్లూయిడ్స్‌ నిల్వ చేరుతుంటాయి. ఇవి క్రమంగా ఐ పఫ్ఫీనెస్‌కు దారితీస్తాయి. కొన్ని రకాల అలెర్జీలు, చర్మవ్యాధులు కూడా ఇందుకు కారణమవుతుంటాయి. 
ఆహారం
సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో పఫ్ఫీ ఐస్‌ వచ్చే అవకాశం అధికం.
పొగాకు, ఆల్కహాల్‌
ఈ రెండూ వాడేవారు స్ట్రెస్, హార్మోన్స్‌ మార్పులు, అలసట, నిద్రలేమికి తొందరగా గురవుతారు. అందువల్ల వీరిలో ఈ ఐబ్యాగ్స్‌ కామన్‌గా వస్తాయి. 

ఏం చేయాలి?
ఇది సాధారణ సమస్యేకానీ బయటకు కనిపించేందుకు ఇబ్బందిపెడుతుంది. కొందరిలో మాత్రం ఇది తీవ్ర సమస్యగా మారి సర్జరీ వరకు దారితీస్తుంది. క్యారీబ్యాగులు వచ్చి పోవడం వేరు, కంటి కింద పర్మినెంట్‌గా ఉండడం వేరు. ఇలా పర్మినెంట్‌గా ఈ బ్యాగ్స్‌ ఉండిపోతే మెడికల్‌ డిజార్డర్‌ ఏదో ఉందని డాక్టర్‌ను సంప్రదించాలి. సర్వసాధారణంగా వచ్చే వాపునకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
   ఆహారంలో ఉప్పు తగ్గించడం, లో కార్బోహైడ్రేట్‌ డైట్‌ తీసుకోవడం, ఏ, సీ, ఈ విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, అధికంగా నీరు తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు.
 నిద్రలో తల కింద కాస్త ఎత్తు ఉంచుకోవడం, కళ్లకు కోల్డ్‌ కంప్రెస్‌ ట్రీట్మెంట్‌(కళ్ల మీద, చుట్టూ ఐస్‌ రుద్దుకోవడం) ద్వారా ఫ్లూయిడ్‌ అసమతుల్యతను తాత్కాలికంగా సరిచేయవచ్చు. 
   మందులు వాడాల్సివస్తే డాక్టర్‌ సలహా ప్రకారం కార్టికోస్టీరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్‌, యాంటీ హిస్టమిన్స్‌, అడ్రినలిన్‌ లేదా ఎపినెఫ్రిన్‌ , యాంటిబయాటిక్స్‌ తదితరాలు వాడాలి.

క్యారీ బ్యాగులు రాకుండా లేదా వచ్చినవి తగ్గించడానికి కొన్ని వంటింటి చిట్కాలు బాగా పనిచేస్తుంటాయి...
♦ ఉల్లిపాయని పిండి ఆ రసంలో కొద్దిగా ఉప్పు కలపండి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని క్యారీబ్యాగ్స్‌పై పూయాలి(కంటికి తగలనీయకండి, మండిపోతుంది). మరుసటి రోజు పొద్దున్నే చల్లటి నీటితో కడగండి. ఉల్లిపాయలో ఉండే కెమికల్స్‌ కళ్ల చుట్టూ కొవ్వు పేరుకుపోవటాన్ని ఆపుతాయి.
♦ కాటన్‌ బాల్‌ ను ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో ముంచి కంటి కింద అప్లై చేయండి. తీవ్రమైన ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఐబ్యాగ్స్‌ను, వాటి మచ్చలను తొలగిస్తుంది. శరీరంలో చెడు కొవ్వు స్థాయిలను తగ్గించడానికి గోరు వెచ్చని నీటిలో ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ను కలిపి తాగవచ్చు.
♦ ఆముదం నూనెలో ఉండే ’రిసినోఎలిక్‌ ఆసిడ్‌’ పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది. కాటన్‌ బాల్‌ను ఆముదంలో ముంచి ఐబ్యాగ్స్‌పై అద్దండి. మంచి రిజల్ట్స్‌ కోసం కొన్ని రోజులు దీన్ని కొనసాగించాలి.
♦ ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతులు నానబెట్టి, మరుసటిరోజు ఉదయం పరగడుపున(ఖాళీ కడుపుతో) తాగండి. మెంతులు బాడ్‌ కొలెస్ట్రాల్‌ను, పేరుకుపోయిన ఫ్యాట్‌ను తొలగిస్తాయి. 
♦ వెల్లుల్లిని దంచి వచ్చే పేస్ట్‌ను ఐబ్యాగ్స్‌పై అప్లై చేయాలి. ఆవిధంగా అరగంట పాటుంచి చల్లటి నీళ్లతో కడగాలి. ఒకవేళ సెన్సిటివ్‌ స్కిన్‌  ఉంటే మాత్రం ఎక్కువ సమయం ఈ పేస్ట్‌ను చర్మంపై ఉంచకండి. వెల్లుల్లిలో ఉండే ఎంజైమ్‌ ఫ్లూయిడ్స్‌ లో కొవ్వుల స్థాయిని తగ్గిస్తుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు