Period Pain and Cramps: రోజుకో నువ్వుల ఉండ, ఇంకా...

17 May, 2022 10:54 IST|Sakshi

మన ఇంటి  అమ్మాయికి తొలిసారి నెలసరి రాగానే  పదిమందినీ పిలిచి వేడుక చేసుకున్నంత ఈజీ కాదు పీరియడ్స్‌ అంటే. దాదాపు ప్రతీ ఆడబిడ్డకు ప్రతీ నెల అదొక చెప్పలేనంత ఇబ్బంది. దీనికి అధిక రక్త స్రావం, భరించలేని కడుపునొప్పి లాంటివి తోడైతే ఇక నరకమే. అసలు పీరియడ్స్‌ లేదా బహిష్టు సమయంలో  ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? వీటికి పరిష్కారా లేంటి అనే విషయాలపై ప్రముఖ ఆయుర్వేద  వైద్య నిపుణులు డా. కవిత సాక్షి. కామ్‌తో వివరాలను పంచుకున్నారు. ముఖ‍్యంగా ఆహార నియమాలు,  కొద్ది పాటి వ్యాయామం చేయాలని ఆమె సూచించారు.


చాలామంది మహిళల్లో ఋతుక్రమం సమయంలో గర్భాశయ కండరాల్లో సంకోచం కారణంగా  కడుపునొప్పి వస్తుంది.  ఈ సంకోచాలు ఎంత బలంగా ఉంటే అంత తీవ్రంగా కడుపు నొప్పి వేధిస్తుంది. ఈ  కారణంగా రక్త నాళాలపై ఒత్తిడి ఏర్పడి  గర్భాశయానికి ఆక్సిజన్‌ తగ్గుతుంది. ఇలా ఆక్సిజన్ సరఫరా తగ్గి, మరింత నొప్పి, ఒక్కోసారి  తిమ్మిరి వస్తుంది. ఈ సమయంలో హీట్‌ ప్యాడ్‌ చాలా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. కాళ్లను పొట్ట దగ్గరగా వచ్చేలా ముడుచుకొని హీట్‌ ప్యాడ్‌ను పొట్టపై పెట్టుకోవాలి. దీంతో కండరాల సంకోచాలు నియంత్రణలోకి వస్తాయి. నొప్పి మరీ భరించలేనంతగా ఉన్నపుడు మాత్రమే పెయిన్‌ కిల్లర్స్‌ వాడాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ  ద్రవపదార్థాలను సేవిస్తూ ఒత్తిడికి దూరంగా ఉంటూ తగినంత విశ్రాంతి తీసుకోవడం  చాలా అవసరం. 

తక్కువ కొవ్వు, అధిక పీచు కలిగిన ఆహారం మేలు. తృణధాన్యాలు, కాయధాన్యాలు, బీన్స్,  ముదురు ఆకు పచ్చఆకు కూరలు, ఇతర కూరగాయలు  శ్రేయస్కరం. విటమిన్‌, ఈ, బీ1,బీ6, మెగ్నీషియం, జింక్ ఒమేగా-3  ఫ్యాటీ  ఆమ్లాలు లాంటి  పోషకాలు  పీరియడ్‌ బాధలనుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.  ముఖ్యంగా రోజుకు ఒక నువ్వులు,  బెల్లం కలిపిన ఉండ తీసుకుంటే  గర్భాశయ  సమస్యలు   తగ్గుముఖం పడతాయి. అలాగే  మరో మూడు నాలుగు రోజుల్లో పీరియడ్‌ వస్తుందనగా, లావెండర్‌, నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో పొట్టపై సున్నితంగా 5 నుంచి 10 నిమిషాలు పాటు మాసాజ్‌ చేసుకోవాలి. ఫలితంగా గర్భాశయంలో రక్త ప్రసరణ  మెరుగవుతుంది. 

చాలామంది టీనేజర్లలో మెన్‌స్ట్రువల్‌ సమస్యలు  ఈ మధ్య కాలంలో  చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవర్‌ బ్లీడింగ్‌, లేదంటే భరించలేని కడుపునొప్పితో మెలికలు తిరిగి పోతూ ఉంటారు. ఒక్కోసారి రెండు సమస్యలు వేధిస్తుంటాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణమని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ వల్ల చాలా ప్రమాదమని సాధ్యమైనంత వరకు మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిదని సూచిస్తున్నారు. సాంప్రదాయ బద్ధ ఆహారాన్ని తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు డా. కవిత సూచించారు. ప్రతీ నిత్యం యోగ, సూర్య నమస్కారాలు చేయడం వలన మహిళల్లో పీరియడ్‌ సమస్యలే కాదు, హార్మోనల్‌  ఇంబేలన్స్‌ అనేది లేకుండా చూసుకోవచ్చన్నారు.  .

వీటన్నింటికి తోడు ఇంట్లోని వారందరూ  పీరియడ్‌  టైంలో ఆడవాళ్ల సమస్యల్ని,బాధల్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి. పీరియడ్‌ అనగానే అదేదో అంటు ముట్టు సమస్యగానో, లేదంటే అపవిత్రమైన విషయంగానో చూడటాన్ని మానేయాలి. పీరియడ్‌ సమయంలో ఉన్న మహిళలకు  మరింత సపోర్ట్‌గా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  పీరియడ్‌లో  బ్లీడింగ్‌ ఆగిపోయి, ప్యాడ్‌లు, కప్‌లు ఇలాంటి బాదర బందీ లేకుండా.. హాయిగా ఉండొచ్చు అని  నిర్ధారించు కున్నపుడు  వచ్చే ఆనందం  మాటల్లో వర్ణించలేం. ఇది ఈ ప్రపంచంలో ప్రతీ  అమ్మాయికీ, మహిళకు  అనుభవమే

మరిన్ని వార్తలు