సుఖమైన నిద్ర కోరుకునే వారికి ఇది కూడా అవసరమే!

13 Aug, 2021 16:07 IST|Sakshi

బెడ్‌ హైజిన్‌  లోపిస్తే ఇక్కట్లు

శరీరారోగ్యానికి సుఖనిద్ర ఎంతో అవసరం. మరి సుఖ నిద్ర కావాలంటే సరైన పడక కూడా అవసరమే! కేవలం సుఖ నిద్రకే కాకుండా, ఆరోగ్యానికి సైతం పడక పరిశుభత్ర అవసరమన్నది నిపుణుల మాట. కానీ కొంతమంది మాత్రమే పడకను పరిశుభ్రంగా ఉంచుకునే అలవాటుతో ఉంటారు. చాలామందికి, ముఖ్యంగా యువతలో ఈ పడక పరిశ్రుభత చాలా తక్కువ. తల్లితండ్రులకు దూరంగా ఉండే యువతలో బెడ్‌ హైజిన్‌పై అవగాహన, ఆసక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఎక్కడెక్కడో తిరిగిన బట్టలతో అలాగే పడుకోవడం, లేవగానే కనీసం బెడ్‌షీట్, దుప్పట్లను మడత పెట్టకుండా ఉండ చుట్టి పెట్టుకోవడం, దిండ్లను ఇష్టారీతిన నలిపి వాటి కవర్లను అపరిశుభ్రంగా ఉంచుకోవడం, పడుకునే పరుపు లేదా బొంతను ఎన్నాళ్లున్నా కనీసం దులపకపోవడం.

అదే విధంగా బెడ్‌పైనే తినడం, తాగడం చేయడం, పడక దగ్గర రకరకాల వాసనలు వస్తున్నా క్లీన్‌  చేయకపోవడం.. వంటివన్నీ అనారోగ్యాలకు దారి తీసే అంశాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పడకను చెత్తకుప్పలాగా మార్చడం ప్రమాదకరమన్నది నిపుణుల మాట. ప్రతిరోజూ నిద్రపోయిలేవగానే బెడ్‌పై మనిషి తాలుకా లాలాజలం, చెమట, చుండ్రు, మృత చర్మ కణాల్లాంటివి పడుతూ ఉంటాయి. వీటివల్ల ప్రమాదకరమైన సూక్ష్మజీవులు బెడ్‌పై ఆవాసం ఏర్పరుచుకునే వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు పడకను శుభ్రంగా ఉంచుకోకపోతే కోరి రోగాలు తెచ్చుకున్నట్లే!

బ్యాక్టీరియా బాంబులు
పలు రకాల బ్యాక్టీరియా జాతులకు మన పడకలు ఆవాసాలుగా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఉదాహరణకు స్టెఫైలోకోకస్‌ రకం బ్యాక్టీరియా పడకల్లో నివాసమేర్పురుచుకుంటుంది. ఇవి నిజానికి హానికారకమైనవి కావు, కానీ మనిషి శరీరంపైన ఏదైనా గాయం ద్వారా రక్తప్రసారంలోకి చేరితే మాత్రం తీవ్ర అనారోగ్యం కలిగిస్తాయి. స్టెఫైలోకోకస్‌ ఆరియస్‌ బ్యాక్టీరియా పడకపై చేరితే చర్మ సంబంధ వ్యాధులు, న్యుమోనియా, ఎన్నటికీ తగ్గని మొటిమలు వస్తుంటాయి.

వీటిలో కొన్ని ప్రజాతులు యాంటిబయాటిక్స్‌కు కూడా తొందరగా లొంగనంతగా బలపడుతుంటాయి. ఇకోలి బ్యాక్టీరియా సైతం బెడ్‌పై కనిపిస్తుంది. ఇవి మనిషి పేగుల్లో ఉండే సాధారణమైన బ్యాక్టీరియా. కానీ కొన్ని ప్రజాతులు మనిషిలో తీవ్రమైన మూత్రసంబంధిత వ్యాధులు, డయేరియా, మెనింజైటిస్‌ కలిగిస్తాయి. అందుకే నిద్రపోతున్నవారు మూత్రవిసర్జనకు మేల్కొంటే, తిరిగి పడుకోబోయేముందు కాళ్లు చేతులు కడుక్కోవాలని పెద్దలు చెబుతుంటారు. స్టెఫైలోకోకస్‌ కానీ, ఇ కోలి కానీ పెద్ద సంఖ్యలో పునరుత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని బెడ్‌పైకి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలి.

బాబోయ్‌ బెడ్‌ బగ్స్‌
మనిషి ప్రతిరోజు నిద్రలో దాదాపు 50 కోట్ల మృత చర్మ కణాలను రాలుస్తాడు. పడకల్లో దాగుండే నల్లులు, బెడ్‌బగ్స్‌కు ఈ మృతకణాలు మంచి ఆహారం. వీటివల్ల తక్షణ చర్మ సమస్యలు, అలెర్జీలు, ఆస్తమా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరోక్షంగా యాంక్జైటీ, ఇ¯Œ సోమ్నియాకు కూడా ఇవి కారణాలవుతాయన్నారు. బ్యాక్టీరియాల కన్నా పెద్దవైనా ఇవి మాములు కంటికి తొందరగా కనిపించవు. ఒక పడక నుంచి ఇంకో పడకకు కుటుంబ సభ్యుల ద్వారా ఇవి వ్యాపిస్తుంటాయి. పసిపిల్లల పడకలో ఇవి చేరితే మరింత ప్రమాదం.

వారు కనీసం ఏం జరుగుతుందో కూడా అర్దం చేసుకోలేరు, బయటకు చెప్పలేరు. అందువల్ల ఈ బగ్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బాత్‌రూమ్‌ టవల్స్‌ను ఉండ చుట్టి బెడ్‌పై వేయడం వంటి అలవాట్లు పడకను పాడు చేస్తాయి. బ్యాక్టీరియా, బెడ్‌బగ్స్‌తో పాటు వైరస్‌లకు కూడా పడకలు నివాసాలుగా మారుతుంటాయి. వాక్సీనా లాంటి కొన్ని వైరస్‌లైతే శుభ్రం చేయని పడకల్లో 14 వారాలపాటు ఓపిగ్గా హోస్ట్‌ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.

ఏం చేయాలి?
► వ్యక్తిగత పరిశుభ్రత... అంటే ఎప్పటికప్పుడు కాళ్లు చేతులు కడుక్కోవడం, పొడిగా తుడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. ∙పసిపిల్లల పడకలను రోజుకు రెండు మార్లు పూర్తిగా మార్చడం, వారికి వాడే దుప్పట్లు, కవర్లను జాగత్త్రగా పరిశీలించడం ఎంతో అవసరం.
►ప్రతిరోజూ పడకను శుభ్రపరుచుకోవాలి. బెడ్‌ షీట్‌ మార్చడం, బెడ్‌ను దులపడం, దుప్పట్లు మార్చడం, పిల్లో కవర్లు తాజాగా ఉంచుకోవడం చేస్తుండాలి. పడకపై వాడే దుప్పట్లు, కవర్లు రెండు మూడురోజులకొకసారి ఎండలో వేయాలి. చాప వాడే అలవాటుంటే దాన్ని సైతం ఎండలో ఆరవేయాలి.
► తడి కాళ్లతో పడకపైకి చేరడమంటే సూక్ష్మజీవులకు ఆహ్వానం పంపినట్లేనని గుర్తించాలి.

► పెద్ద పరుపులు, చాపలను ఉతకలేము కాబట్టి వాటికి సరిపడా కవర్లను వాడడం, ఆ కవర్లను తరచూ మారుస్తుండడం, వీలైనప్పుడు వీటిని ఎండలో వేయడం మరవకూడదు. ►వాక్యూమ్‌ క్లీనర్‌ ఉన్నవాళ్లు చాపలు, బెడ్స్‌ను వాక్యూమ్‌ చేయడం బెటర్‌.


► పెంపుడు జంతువులున్నవాళ్లు సాధ్యమైనంత వరకు వాటిని పడకలపై చేరకుండా జాగ్రత్త వహించాలి.
► మరీ పాతపడిపోయిన పరుపులు, చాపలు, దుప్పట్లు వాడకుండా కొత్తవాటిని ఏర్పాటు చేసుకోవాలి.
► వీలైనప్పుడు కవర్లు, దుప్పట్లు బాగా మరిగించిన నీటిలో వేసి శుభ్రం చేయాలి.


► బయట నుంచి వచ్చి బట్టలు కూడా మార్చుకోకుండా పడకెక్కడం, మేకప్‌ ఉంచుకొని పడుకోవడం, సరైన గాలిరాని ప్రదేశాల్లో పడక ఏర్పాటు చేసుకోవడం, బెడ్‌పై తినడం, తాగడం వంటి అలవాట్లు వెంటనే వదులుకోవాలి. 
► శరీరం అలసిపోతే ఎక్కడైనా నిద్రవస్తుంది, అందుకని పడక పరిశుభ్రతపై అవగాహన అవసరం లేదని భావించకూడదు. బెడ్‌ హైజిన్‌ లోపిస్తే జరిగే అనర్ధాలు వెంటనే అర్దం కావు, అందువల్ల పడక పరిశుభ్రతపై పట్టింపు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
డి. శాయి ప్రమోద్‌

మరిన్ని వార్తలు