మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?

15 Jun, 2022 00:36 IST|Sakshi

దూరాన మేఘాలు గర్జిస్తున్నాయి. ఆకాశం నీళ్ల ధారలు కుమ్మరించనుంది. మరి వానలకు మీ ఇల్లు సిద్ధమేనా? కొట్టాల్సిన కొమ్మలు నాటాల్సిన మొక్కలు చెక్‌ చేయాల్సిన పైకప్పులు వాననీళ్లు పారాల్సిన తూములు విద్యుత్‌ తీగల నుంచి భద్రత దోమల నివారణకు తెరలు పిల్లలకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రెడీ అవుదాం.

మన దేశంలో వానకాలం వస్తే దృష్టి సగమే ఉంటుంది. అంటే? రోడ్డు ఉంటుంది... అది రోడ్డో కాదో తెలియదు. వీధి ఉంటుంది. అది వీధో కాదో తెలియదు. నీళ్లు కప్పిన నేలను ఏ లేపనం పూసుకున్నా ఎగురుతూ దాటలేము. కాలో, బండి చక్రమో వేయాల్సిందే. గోతుల్ని చూసుకోకపోతే పడాల్సిందే. అందుకే తీరిగ్గా కాకుండా ఇప్పటి నుంచే ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అది ఇండిపెండెంట్‌ ఇళ్లు ఉన్నవారైనా, అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారైనా.

చెట్లు... మొక్కలు
ఇది చెట్లు మొలిచే సమయం. చెట్లు ఊగే సమయం కూడా. మన ఇంట్లో వేసుకోవాల్సిన కొత్త మొక్కల కోసం కుండీలను, వాటికి అవసరమైన స్థలాలను గుర్తించాలి. పాతవి, డొక్కువి, పగిలిపోయినవి, అడుగుపోయినవి ఇప్పుడే పారేయాలి. ఈ వానల్లో తడిసిన కొత్త మొక్కల్ని చూడటం ఎంతో బాగుంటుంది. అలాగే ఇళ్లల్లో గాని అపార్ట్‌మెంట్‌ చుట్టూగాని పెరిగిన చెట్లు ఎలా ఉన్నాయి... వాటి కొమ్మల ధాటి ఎలా ఉంది చూసుకుని విరిగి పడేలా ఉండే వాటిని కొట్టించేయాలి.

చాలా ఇళ్లకు, అపార్ట్‌మెంట్లకు సోలార్‌ ఫెన్సింగులు ఉన్నాయి. గాలివానలకు పెద్ద చెట్ల వల్ల వీటికి నష్టం జరక్కుండా చూసుకోవాలి. అలాగే ఏ మొక్కా, చెట్టూ లేకుండా కళావిహీనంగా ఉన్న ఇంటిని, అపార్ట్‌మెంట్లను ఈ సీజన్‌లో మొక్కలతో నింపుకోవాలి. అందుకు అవసరమైన మట్టిని, పనిముట్లను, బడ్జెట్‌ను కూడా సిద్ధం చేసుకోవాలి.

గోడలు... కిటికీలు.. పైకప్పులు
వాన నీరు నెత్తి మీద చేరే కాలం ఇది. ప్రతి ఇంటి పైకప్పును క్షుణ్ణంగా చెక్‌ చేయించుకోవాలి. లీకేజీ లేకుండా ఇప్పుడే నిపుణులతో పూడ్చుకోవాలి. వాటర్‌ప్రూఫ్‌ కోటింగ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంటి బయటి గోడలకు వాటర్‌ప్రూఫ్‌ పెయింటింగ్‌ చేయించుకోవడం కూడా ఒక మంచి సంరక్షణ. పైకప్పు మీద వాన నీరు నిలువ ఉండకుండా వాలును, నీరు బయటకు వెళ్లే పైపులను చెక్‌ చేసుకోవాలి.

ఇంటి గోడల చుట్టూ ఉండే స్థలంలో నీటి గుంటలు ఏర్పడకుండా చూసుకోవాలి. ఆ గుంటల్లోని నీరు గోడలని దెబ్బ తీస్తుంది. కాంపౌండ్‌ వాల్స్‌గా చాలా పాత గోడలైతే కనుక వాటికి చుట్టుపక్కల పిల్లలు ఆడుకోకుండా ఉండటమే కాదు వెహికల్స్‌ పార్క్‌ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోడలు, చెట్లు కూలి వాహనాలు ధ్వంసం కావడం ఈ సీజన్‌లో సాధారణం.

కనుక బయట పార్క్‌ చేసేప్పుడైనా ఇంటి దగ్గర పార్క్‌ చేసేప్పుడైనా పరిస్థితి అంచనా వేసుకోవాలి. అలాగే గాలికి, నీటి ధాటికి కిటికీలు నిలుస్తాయో లేదో చూసుకుని ఇప్పుడే రిపేర్లు చేసుకోవాలి. విద్యుత్‌ స్తంభాల నుంచి వైర్లు కిందకు వేళ్లాడి ఉంటే వాటిని సరి చేయించుకోవాలి. మన ఇంటి గోడలకు, శ్లాబ్‌లకు ఈ వైర్లు తగలకుండా చూసుకోవాలి.

పాత సామాను పారేయండి
ఇది వెలుతురు, ఎండ తగలని సమయం. ఇంట్లో పాత సామాను, చల్లదనానికి ముక్కిపోయే సామాను ఉంటే ఇప్పుడే వదుల్చుకోవడం మంచిది. మంచి వానల్లో చెత్త పారేయడం కూడా సాధ్యం కాదు. అలాగే ఇప్పటి వరకూ వాడిన కూలర్ల వంటి వాటిని అడ్డం లేకుండా అటక ఎక్కించడం మంచిది. అలాగే ఇంట్లో ఉండే ఫర్నీచర్, కప్‌బోర్డులు వాసన కొట్టకుండా, పురుగు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దోమలు, ఈగలు పెరిగే కాలం. దోమలు ఇళ్లల్లోకి దూరకుండా మెష్‌లు కొట్టడం, పాతవి రిపేరు చేసుకోవడం తప్పదు. మరీ ఎక్కువ దోమలున్న ఏరియాల్లో వారు దోమతెరలు తెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా చిన్నారులు ఉంటే.

డాక్యుమెంట్లు జాగ్రత్త
చాలా మంది డాక్యుమెంట్లను చెక్క బీరువాల్లో, టేబుళ్లలో పెట్టుకుంటారు. ముఖ్యమైన సర్టిఫికెట్లు, దస్తావేజులు... ఇవన్నీ ఈ కాలమంతా పూర్తిగా పొడిగా ఉండే సురక్షితమైన చోట ఉండేలా ఇంట్లో పెట్టుకోవాలి. వాటిని ప్లాసిక్ట్‌ ఫోల్డర్లలో భద్రపరచుకోవాలి.

ఎమర్జెన్సీ కిట్‌
వానాకాలంలో ప్రతి ఇంట్లో ఎమర్జెన్సీ కిట్‌ ఉండాలి. బ్యాటరీ, టార్చ్‌లైట్, అగ్గిపెట్టె, వరద నీరు చేరితే దాటడానికి తాడు, ముఖ్యమైన మందులు, అదనపు చార్జింగ్‌ పరికరాలు... ఇవన్నీ ఇంట్లో ఉండాలి. అలాగే శుభ్రమైన నీరు గురించిన పరిశీలన కూడా అవసరం. ఇంటికి వచ్చే నీరు లీకేజీకి గురికావచ్చని అనుకుంటే ఫిల్టర్‌ పెట్టుకోవాలి. లేదా వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలి.

 అలాగే ఊహించని భారీ వర్షం, ఉత్పాతం జరిగితే మనం వెళ్లవలసిన ఇళ్లు, కాంటాక్ట్‌ చేయాల్సిన నంబర్లు కుటుంబ సభ్యులు చర్చించుకోవాలి. ముఖ్యంగా లోతట్టు కాలనీల్లో ఉన్నవారు తమకు ఏదైనా సమస్య వస్తే తల దాచుకోవడానికి వస్తాం అని ముఖ్యమైన మిత్రులకో, బంధువులకో చెప్పి వారిని మానసికంగా సిద్ధం చేసి పెట్టాలి. వాహనాలు ఉన్నవారు ఈ కాలంలో బ్యాటరీలు మొరాయించకుండా చెక్‌ చేయించుని అవసరమైతే కొత్త బ్యాటరీలు వేయించుకోవాలి.

ఆల్ట్రాలైట్‌ రెయిన్‌ కోట్‌
వాన వసే గొడుగులో ప్రతిసారీ పోలేము. వాహనం కూడా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే రెయిన్‌ కోట్‌ తప్పనిసరిగా ఒక్కటన్నా ఉండాలి. పిల్లలకు ఉండటం కూడా మంచిదే. ఎప్పుడూ బండిలో. కారులో గొడుగు పెట్టుకుని ఉండాలి. కార్లు ఉన్నవారు వైపర్లను చెక్‌ చేయించుకోవడం తప్పనిసరి అని వేరే చెప్పక్కర్లేదు కదా.

మరిన్ని వార్తలు