Foods For Healthy Liver: హెల్దీ లివర్‌ కోసం..ఈ జాగ్రత్తలు తీసుకుందాం!

25 Feb, 2022 11:01 IST|Sakshi

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న  కేన్సర్లలో లివర్‌ కేన్సర్‌ కూడా ఒకటి. World wideగా ప్రతీ ఏడాది 8 లక్షలమంది లివర్‌ కేన్సర్‌తో బాధపడుతున్నారు. 7 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌ అన్నట్టు  కాలేయాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఆ వివరాలు మీకోసం..

ప్రపంచంలో కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా  పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం హెచ్చరించిన నేపథ్యంలో  మన శరీరంలోని కీలక అవయవమైన లివర్‌ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని వడపోయడమే లివర్‌ చేసే పని.  అంతేకాకుండా ఆహారం ద్వారా వచ్చే రసాయనాలు, వాటిలోని విషతుల్యాలను సైతం కాలేయం తొలగిస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా బకాలేయం నియంత్రిస్తుంది. మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కాలేయమే కీలకం.

వాస్తవానికి కాలేయం సమస్యను గుర్తించడం అంత సులభం కాదు. చాలావరకు 90 శాతం కాలేయం దెబ్బతినేంతవరకు వ్యాధి లక్షణాలు బయటప‌డ‌వు. అందుకే  జీర్ణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు  కనిపించినా  అప్రమత్తం కావాలి.  ముఖ్యంగా  కాలేయంలో ఏదైనా సమస్య వస్తే కణజాలాల్లో ఫైబ్రయోస్ స్కార్స్ వల్ల కాళ్లల్లో వాపులు వస్తాయి. దీన్నే లివర్ ఫైబ్రోసిస్ అంటారు. పచ్చ కామెర్ల  వ్యాధికి గురైనపుడు  చర్మం, గోళ్లు పసుపు పచ్చవర్ణంలోకి మారతాయి. కళ్ళు లేత పసుపు రంగులోకి మారినట్లైతే  కామెర్లుగా అనుమానించి, వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన వైద్యం పొందాలి.

ముఖ్యంగా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్స్‌,  ప్రాసెస్డ్‌ ఫుడ్‌ సోడా, ఇతర కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే తీవ్రమైన కాలేయ సమస్యలు, ఊబకాయం, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే  సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. చివరకు ఇది కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. అందుకే ఆహార విషయంలో  చాలా జాగ్రత్తలు పాటించాలి.  కొవ్వు పదార్థాలు, నూనెలో బాగా వేయించిన పదార్థాలు మితంగా వాడటం మంచిది. మళ్లీ మళ్లీ అదే నూనెలో వేయించిన పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  మితిమీరిన ఉప్పు, చక్కెరవాడకం కూడా ప్రమాదకరం. వీటిన్నింటికంటే  లివర్‌ ఆరోగ్య దెబ్బతీసేవాటిల్లో కీలకమైనది  మద్యం, ధూమపానం  అనేది గుర్తించి వాటికి దూరంగా ఉంటే మంచిది.

అలాగే తాజాగా ఆకుకూరలు, కూరగాయలతోపాటు శరీరానికి మేలు చేసే మంచి కొవ్వులను  తీసుకోవాలి.   విటమిన్‌ సీ కాలేయ వద్ద కొవ్వును నియంత్రిస్తుంది. కనుక విటమిన్‌ సీ ఎక్కువగా లభించే ఉసిరి, సల్ఫర్ అధికంగా ఉండే వెల్లులి పాయలు , సహజ వాధి  నివారిణి పసుపు ఆహారంలో చేర్చుకోవాలి.  గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు సైతం కాలేయానికి మేలు చేస్తాయి. అలాగే  కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ  వాల్‌  నట్స్, ఆలీవ్ ఆయిల్, అవకాడో కాలేయాన్ని శుభ్రం చేస్తాయి. వీటిన్నింటికి తోడు తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం.  ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఆందోళన  చెందకుండా  వైద్యుల సలహా తీసుకోవడం, సమయానికి మందులు తీసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా మన ఆరోగ్యం మన  చేతుల్లోనే అనేది గుర్తించాలి. 

మరిన్ని వార్తలు