కీమాతో చీజ్‌ పఫ్స్‌.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

22 Sep, 2023 17:00 IST|Sakshi

కీమా – చీజ్‌ పఫ్స్‌ తయారీకి కావల్సినవి:

మటన్‌ కీమా – 400 గ్రాములు,చీజ్‌ తురుము – 4 టేబుల్‌ స్పూన్లు
నూనె – 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు
వెల్లుల్లి పొడి, పసుపు, జీలకర్ర – 1 టీ స్పూన్‌ చొప్పున
ఉప్పు – తగినంత,మసాలా పొడి – 1 టేబుల్‌ స్పూన్‌
పచ్చిమిర్చి ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌,కొత్తిమీర తరుగు – కొద్దిగా
పఫ్‌ పేస్ట్రీ షీట్‌ – 1(మందంగా ఉండేది, లేదా షీట్స్‌ చిన్నచిన్నవి 4 లేదా 5 మార్కెట్‌లో దొరుకుతాయి)
గుడ్డు – 1(ఒక బౌల్లో పగలగొట్టి.. కొద్దిగా పాలు కలిపి పెట్టుకోవాలి)
నల్ల నువ్వులు – 1 టీ స్పూన్‌ పైనే(గార్నిష్‌కి)

తయారీ విధానమిలా: 
ముందుగా నూనెలో 2 టేబుల్‌ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసుకుని.. దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి పొడి, కీమా వేసుకుని.. మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి. అందులో పసుపు, మసాలా పొడి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని.. గరిటెతో బాగా కలిపి.. బాగా ఉడకనివ్వాలి. అనంతరం పఫ్‌ పేస్ట్రీ షీట్‌లో కీమా మిశ్రమాన్ని నింపుకుని.. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌ తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని ఊడిపోకుండా తడి చేత్తో గట్టిగా ఒత్తాలి. దానిపైన గుడ్డు–పాల మిశ్రమాన్ని బ్రష్‌తో బాగా రాసి.. నువ్వులతో గార్నిష్‌ చేసి బేక్‌ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము జల్లి సర్వ్‌ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చిన్న చిన్న పఫ్‌ పేస్ట్రీ షీట్స్‌లో కూడా కీమా, చీజ్, ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని ఉంచి.. త్రిభుజాకారంలో పఫ్స్‌ చుట్టుకోవచ్చు. 

మరిన్ని వార్తలు