నోరూరించే కిస్మిస్‌ లడ్డూ, కస్టర్డ్‌ ఆపిల్‌ హల్వా తయారీ ఇలా..

17 Oct, 2021 12:00 IST|Sakshi

స్వీట్లు చూస్తే ఆగలే.. బజార్లో దొరికే స్వీట్లలో నాణ్యతలేని పదార్థాలు కలుపుతారు.. తింటే ఆరోగ్య సమస్యలు. ఇంట్లోనే మీకిష్టమైన స్వీట్లు తయారు చేస్తే.. కిస్మిస్‌ లడ్డూ, కస్టర్డ్‌ ఆపిల్‌ హల్వా తయారీ విధానం మీకోసం..

కిస్మిస్‌ లడ్డూ
కావలసిన పదార్థాలు:
►కిస్మిస్‌ పేస్ట్‌ – 1కప్పు (మిక్సీ పట్టుకోవాలి)
►కొబ్బరి పాలు, తేనె, పీనట్‌ బటర్‌ – 4 టేబుల్‌ స్పూన్ల చొప్పున
►ఓట్స్‌ – పావు కప్పు ( వేయించి పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి)
►బాదం పౌడర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు 
►నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకు
►కొబ్బరి తురుము – కొద్దిగా (అభిరుచిని బట్టి)

తయారీ విధానం
ముందుగా ఒక బౌల్‌లో ఓట్స్‌ పౌడర్, కొబ్బరిపాలు, తేనె, పీనట్‌ బటర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, కిస్మిస్‌ పేస్ట్‌ కూడా వేసుకుని ముద్దలా కలుపుకుని, చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం కొబ్బరి తురుములో ఈ లడ్డూలను 
దొర్లిస్తే  సరిపోతుంది.

కస్టర్డ్‌ ఆపిల్‌ హల్వా

కావలసిన పదార్థాలు:
►సీతాఫలం (కస్టర్డ్‌ ఆపిల్‌) – 1 కప్పు (బాగా మగ్గిన సీతాఫలాలను పైతొక్క తొలగించి, వడకట్టే తొట్టెలో వేసుకుని, దాని కింద గిన్నె పెట్టుకుని, చేత్తో నలిపి గింజలన్నీ ►తొలగించి గుజ్జు తీసుకోవాలి)
►నెయ్యి, సుజీ రవ్వ – అర కప్పు చొప్పున
►పంచదార – పావు కప్పు, చిక్కటి పాలు – 1 కప్పు
►జాజికాయ పొడి – పావు టీ స్పూన్‌
►కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలు – 
►అర టేబుల్‌ స్పూన్‌ చొప్పున (నేతిలో వేయించి పక్కనపెట్టుకోవాలి)

తయారీ విధానం
ముందుగా కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసి తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార, పాలు పోసుకుని  దగ్గర పడే వరకూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అనంతరం సీతాఫలాల గుజ్జు, జాజికాయ పొడి, నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలూ వేసి తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. 

చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్‌ సమోసా, మరమరాల వడ తయారీ..

మరిన్ని వార్తలు