నోరూరించే ఫిష్‌ కట్‌లెట్‌ విత్‌ రైస్‌, ఆనియన్‌ చికెన్‌ రింగ్స్‌ తయారీ..కొంచెం వెరైటీగా!

28 Oct, 2021 12:47 IST|Sakshi

చికెన్‌, చేపలతో ఈ ప్రత్యేక వంటకాలు సరదాగా ట్రై చేయడి.. రుచి కూడా అదిరిపోతుంది. ఆనియన్‌ చికెన్‌ రింగ్స్‌, ఫిష్‌ కట్‌లెట్‌ విత్‌ రైస్‌ వెరైటీలతో మీ ​కుటుంబ సభ్యులకు మరిచిపోలేని ట్రీట్‌ ఇవ్వండి..!

ఆనియన్‌ చికెన్‌ రింగ్స్‌

కావల్సిన పదార్థాలు
చికెన్‌  ఖీమా – పావు కేజీ
ఉల్లిపాయలు – రెండు (గుండ్రంగా రింగుల్లా తరగాలి)
స్రింగ్‌ ఆనియన్‌  కాడలు – రెండు (సన్నగా తరగాలి)
వెల్లుల్లి తురుము – టేబుల్‌ స్పూను
కారం – టీ స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
గోధుమ పిండి – కప్పు
చీజ్‌ – అరకప్పు
గుడ్లు – మూడు
బ్రెడ్‌ ముక్కలపొడి – ఒకటిన్నర కప్పు
ఆయిల్‌ – డీప్‌ఫ్రై కి సరిపడా

తయారీ విధానం
►ముందుగా కడిగిన చికెన్‌ ఖీమాను ఒక గిన్నెలో తీసుకుని స్ప్రింగ్‌ ఆనియన్‌  , వెల్లుల్లి తరుగు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. 
►గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ముంచి పక్కన బెట్టుకోవాలి.
►గుడ్ల సొనను ఒక గిన్నెలో , ప్లేటులో బ్రెడ్‌ ముక్కల పొడి తీసుకోవాలి.
►ఇప్పుడు ఉల్లిపాయ రింగుల్లో.. కలిపి చికెన్‌ ఖీమా మిశ్రమాన్ని పెట్టి, మధ్యలో చీజ్‌ తరుగు పెట్టి గుండ్రంగా వత్తుకోవాలి. 
►ఈ ఆనియన్‌  రింగ్స్‌ను గుడ్డు సొన, బ్రెడ్‌ముక్కల పొడిలో వరుసగా రెండుసార్లు ముంచి, పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. 
►డీప్‌ఫ్రైకి సరిపడా ఆయిల్‌ వేడెక్కిన తరువాత..ఆనియన్‌  రింగ్స్‌ను గోల్డెన్‌  బ్రౌన్‌  కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించితే ఆనియన్‌ చికెన్‌ రింగ్స్‌ రెడీ.

చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!

ఫిష్‌ కట్‌లెట్‌ విత్‌ రైస్‌ 

కావల్సిన పదార్థాలు
బోన్‌ లెస్‌ చేపముక్కలు – అరకేజి
బియ్యం – ముప్పావు కప్పు
గుడ్డు – ఒకటి
బ్రెడ్‌ స్లైసులు – రెండు(నానబెట్టాలి)
స్ప్రింగ్‌ ఆనియన్‌  కాడలు – నాలుగు
కొత్తి మీర తరుగు – అరకప్పు
మిరియాల పొడి టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా
ఆయిల్‌ – ఫ్రై కి సరిపడా

తయారీ విధానం
►ముందుగా స్టవ్‌ మీద గిన్నెపెట్టి బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పువేసి నీళ్లను మరిగించాలి.
►నీళ్లు మరిగాక బియ్యం వేసి మెత్తటి అన్నంలా ఉడికించి పక్కనబెట్టుకోవాలి. 
►చేపముక్కల్ని ఖీమాలా తరుక్కోవాలి. ఈ ఖీమాలో గుడ్డు సొనను కార్చాలి. తరువాత మిరియాలపొడి, నానబెట్టిన బ్రెడ్, తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్‌ ఆనియన్‌  ముక్కలు, ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. 
►చేతులకు కొద్దిగా ఆయిల్‌ రాసుకుని చేప ఖీమా మిశ్రమాన్ని కట్‌లెట్‌లా వత్తుకోవాలి. 
►బాణలిలో కొద్దిగా ఆయిల్‌ వేసి సన్నని మంటమీద, ఒక్కోవైపు పదినిమిషాలు వేయించితే ఫిష్‌ కట్‌లెట్‌ విత్‌ రైస్‌ రెడీ. 

చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్‌.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తో..

మరిన్ని వార్తలు