సమ్మర్‌లో ఫేస్‌, హెయిర్‌ అండ్‌ స్కిన్‌ కేర్‌.. సింపుల్‌ టిప్స్‌ ఇవిగో

5 Mar, 2022 10:34 IST|Sakshi

శివరాత్రికి  శివ.. శివా... అంటూ  చలి  అలా  వెళ్లిందో లేదో  ఎండలు, ఉక్కపోత ఇలా వచ్చేసాయి. రానున్న కాలంలో ఎండలు మరింత ముదిరి మండించడం ఖాయం. మరి ఈ టైమ్‌లో అందాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది టీనేజర్లకు బెంగ. ముఖ్యంగా ముఖం, జుట్టు, అందమైన  చర్మం కోసం వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. ఎండాకాలంలోనూ మన  స్కిన్‌  కోమలంగా మెరిసిపోవాలంటే  పాటించాల్సిన   సింపుల్‌ బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం.

పూర్తిగా ఎండాకాలం రాకముందే ఎండలు భయపెడుతున్నాయి.సాధారణంగా చర్మ రక్షణ కోసం మనం ఏడాది పొడవునా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ సమ్మర్‌లో మాత్రం ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సిందే. లేదంటే  వేడికి స్కిన్‌  ట్యాన్‌ అయిపోయి, కాంతి విహీనంగా మారిపోతుంది.  సమ్మర్‌ కేర్‌లో అన్నింటికంటే ముఖ్యమైంది సన్‌స్క్రీన్ క్రీమ్‌ లేదా లోషన్‌.  అందుకే సూర్యుని నుంచి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుండి చర్మాన్ని కాపాడు కోవడం చాలా ముఖ్యం. అందుకే బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, రెగ్యులర్‌గా ఆఫీసులకు వెళ్ళే వారు, సన్‌స్క్రీన్  ప్రతి రోజూ ఉదయం రాయాలి. దీంతోపాటు యాంటీ టానింగ్ క్రీమ్స్ వాడాలి. . తద్వారా చర్మం  టాన్ అవ్వకుండా మెరుస్తూ ఉంటుంది. యూవిఎ/యూవిబి లేబుల్, ఎస్ఎఫ్ ఫి + ఉన్న లోషన్‌ లేదా క్రీమ్‌ సెలక్ట్ చేసుకోవడం చాలా మంచిది.  డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయేలా ఇంట్లో తయారు చేసుకున్న నలుగు పిండితో స్నానం చేయడం, లేదా  ఆర్గానిక్‌ స్క్రబ్‌ని ఉపయోగించడం అవసరం. వేసవిలో  హాలీడే ట్రిప్స్‌, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు  చాలాకామన్‌. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్త పడాలి.

వేసవిలో చర్మంతో పాటు జుట్టు కూడా పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో చికాకు పెట్టే చెమటలు కురులను కూడా వేధిస్తాయి. మండేఎండలు,  చెమటకు జుట్టు కాంతి విహీనంగామారడంతోపాటు దుమ్ము,ధూళితో చుండ్రు సమస్య పీడిస్తుంది.సో..ఎండలో వెళ్లేటపుడు జుట్టును కవర్‌ చేసుకునేలా స్కార్ఫ్ లాంటివి రక్షణగా వినియోగించుకోవాలి.  ప్రతీరోజూ కాకపోయినా, ఎండకు, డస్ట్‌కు ఎక్స్‌పోజ్‌ అయ్యాం అనిపించినపుడు మంచి షాంపూతో తలస్నానం చేయడం ఉత్తమం. అలాగే తలస్నానానికి ముందుకు ఇంట్లో తయారు చేసుకున్న హెర్బల్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకోవడం ఇంకా మంచిది. నెలలో రెండుసార్లు  తలలోని చర్మం కూల్‌గా ఉండేలా ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకోవాలి. తద్వారా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారకుండా నిగనిగలాడుతుంది. 

వేసవికాలంలో పెదాలు సహజ కోమలత్వాన్ని కోల్పోవడం, పగలిపోవడం మరో సమస్య. సెన్సిటివ్‌ స్కిన్‌తో  ఉండే లిప్స్‌ ఎండ వేడికిమికి త్వరగా పొడిబారతాయి. సో.. ఎండలోకి వెళ్లేముందు లిప్‌బామ్‌ అప్ల్‌ చేయాలి. అది ఇంట్లో తయారుచేసుకున్నదైతే మరీ మంచింది.

అలాగే రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యిని రాసుకుని మృదువుగా మాసాజ్ చేసుకుంటే పెదాలు మృదుత్వాన్ని  కోల్పోకుండా ఉంటాయి.

ఇక భరించలేని ఎండలకు ప్రభావితమయ్యేవి కళ్లు. కళ్లను రక్షించుకునేందుకు కూలింగ్ గ్లాసులు వాడటం అలవాటు చేసుకోవాలి..వీటన్నింటికంటే కీలకమైంది శరీరానికి ఏంతో మేలు చేసే మంచినీళ్లు తాగడం చాలా చాలా ముఖ్యం. వీటితోపాటు, పల్చటి మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, బార్లీ గంజి, సబ్జా గింజల నీళ్లు లాంటి ద్రవపదార్థాలు విరివిగా తీసుకోవాలి. అలాగే  ఎండలోనుంచి వచ్చిన వెంటనే కాకుండా.. ముఖాన్ని, కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 

మరిన్ని వార్తలు