Singer KK Biography In Telugu: పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'

2 Jun, 2022 11:08 IST|Sakshi

‘ఎద లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి’... ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’లో ఇంత మధురంగా పాడిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (కెకె)  53 ఏళ్ల వయసులో తన అభిమానులను దిగ్భ్రమ పరిచి ఇక పై తన పాటల్నే జ్ఞాపకాలుగా  చేసుకోమన్నాడు. పాట పాడటానికి పుట్టిన కెకె కోల్‌కతాలో మంగళవారం రాత్రి  పాడుతూనే తుదిశ్వాస విడిచాడు. సుందరమైన స్వరం గల ఆ గాయకుడికి నివాళి.

కృష్ణకుమార్‌ కున్నత్‌ అను కెకె మామూలుగా బయట కనపడడు. ఇంటర్వ్యూలు ఇవ్వడు. సినిమా ఫంక్షన్స్‌లో పాల్గొనడు. అందుకని అతని పాట చెప్తే తప్ప అతణ్ణి నేరుగా గుర్తు పట్టేవారు తక్కువ. ‘ప్రేమదేశం’ లో ‘క..క..క... కాలేజీ స్టైలే’ పాడింది కేకేనే. ‘హలో డాక్టర్‌ హార్ట్‌ మిస్సాయే’ పాడి కుర్రకారు హార్ట్‌ మిస్సయ్యేలా చేసింది అతడే. తెలుగులో ఒక కాలంలో కెకె ఎన్నో హిట్స్‌ పాడాడు. ఖుషీలో ‘ఏ మేరా జహా... ఏ మేరి ఆషియా’ పెద్ద హిట్టు. వెంకటేష్‌ ‘వాసు’లో ‘పాటకు ప్రాణం పల్లవి అయితే’ నేటికీ వింటున్నారు. ‘ఘర్షణ’లో ‘చెలియ.. చెలియా’ కూడా.

కెకె మాతృభాష మలయాళం. కాని పుట్టి పెరిగిందంతా ఢిల్లీలో. సంగీతం శాస్త్రీయంగా నేర్చుకో లేదు. అమ్మమ్మ దగ్గర తప్ప. కాని బాగా పాడేవాడు. బ్యాండ్స్‌లో పని చేయాలని ఉండేది. చదువు పూర్తి కాగానే 1991లో జ్యోతికృష్ణను వివాహం చేసుకున్నాడు. ఢిల్లీలో మొదట అతను జింగిల్స్‌ పాడేవాడు. అలాగే హోటల్స్‌లో బ్యాండ్స్‌లో పెర్ఫార్మ్‌ చేసేవాడు. ఆ సమయంలోనే ఢిల్లీకి వచ్చిన హరిహరన్‌ అతడు పాడుతున్న హోటల్‌లో అతడి పాట విని ‘ఇక్కడేం చేస్తున్నావ్‌. నువ్వు ఉండాల్సింది ముంబైలో’ అని చెప్పాడు. అయినా కూడా కెకెకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్‌ లేదు.


పాప్‌ సింగర్‌గానే ఉండాలని, ఆల్బమ్‌ రిలీజ్‌ చేయాలని ఉండేది. కాని భార్య అతణ్ణి ప్రోత్సహించింది. ఢిల్లీలో ఎంతకాలం ఉన్నా ఇంతే.. మనం ముంబై వెళ్దాం అంటే 1994లో ముంబైకి వచ్చాడు. అప్పటికే అతనికి విశాల్‌–శేఖర్‌ ద్వయంలోని విశాల్‌తో పరిచయం ఉంది. విశాల్‌ ‘మేచిస్‌’కు సంగీతం ఇస్తూ అందులో పెద్ద హిట్‌ అయిన ‘ఛోడ్‌ ఆయే హమ్‌ ఓ గలియా’ పాటలో ఒకటి రెండు లైన్లు ఇచ్చాడు. ఆ పాట హిట్‌ అయ్యింది. ఆ తర్వాత జింగిల్స్‌ పాడటం మొదలు పెట్టి జింగిల్స్‌ సింగర్‌గా చాలా బిజీ అయ్యాడు.

1994 నుంచి 1998 వరకూ నాలుగేళ్లలో 11 భాషల్లో 3,500 జింగిల్స్‌ పాడాటంటే అది అతని గొంతు మహిమ. ఏఆర్‌. రహెమాన్‌ కూడా జింగిల్స్‌ చేసేవాడు కాబట్టి వెంటనే కెకెను పాటల్లోకి తెచ్చాడు. ‘ప్రేమదేశం’, ‘మెరుపుకలలు’ (తమిళం) సినిమాల్లో పాడించాడు. 1999లో ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమాలో ‘తడప్‌ తడప్‌ కే’... పాట సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. సల్మాన్‌ఖాన్‌కు పాడటంతో కెకెకు ఇక తిరుగు లేకుండాపోయింది. 1999లోనే సోనీ అతనితో ‘పల్‌’ అనే ఆల్బన్‌ తెచ్చింది. ఆ ఆల్బమ్‌ కూడా హిట్‌.

కెకె మొత్తం పది భారతీయ భాషల్లో 700 పాటలు పాడాడు. వందల సంగీత ప్రదర్శనలు చేశాడు. అతడు అయితే స్టూడియోలో ఉంటాడు. లేదంటే ఇంట్లో. ఎక్కడా తిరగడానికి ఇష్టపడడు. కొడుకు నకుల్‌ కృష్ణ, కూతురు తామ్రకృష్ణ అతడి లోకం

తెలుగులో చిరంజీవికి ‘దాయి దాయి దామ్మా’, తరుణ్‌కు ‘అయామ్‌ వెరీ సారీ’, పవన్‌ కల్యాణ్‌కు ‘మై హార్ట్‌ ఈజ్‌ బీటింగ్‌’, అల్లు అర్జున్‌కు ‘ఫీల్‌ మై లవ్‌’– ‘ఉప్పెనంత ఈ ప్రేమకు’, మహేశ్‌ బాబుకు ‘అవును నిజం’... ఎన్నో హిట్స్‌ కెకె ఖాతాలో ఉన్నాయి. సెవన్‌బైజి బృందావన్‌ కాలనీలో పాడిన ‘తలచి తలచి చూస్తే’ పాటకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ‘గుర్తుకొస్తున్నాయి’ పాటకు కూడా.

ఒక మంచి గాయకుడు దూరమయ్యాడు. పాడుతూ పాడుతూ నేలకొరిగిపోయాడు. అతని గొంతు మాత్రమే గడ్డ కట్టింది. పాడిన పల్లవి చరణాలు ప్రవహిస్తూనే ఉంటాయి.

మరిన్ని వార్తలు