నిలుపుకోవలసిన అలవాట్లు

29 Jun, 2021 07:12 IST|Sakshi

ఒక పనిని ప్రతి రోజూ ఒకే సమయానికి చేస్తుంటే దానిని అలవాటు అంటాం. దానిని సూర్యోదయం, సూర్యాస్తమయాలంత సహజంగా, క్రమం తప్పకుండా చేస్తుంటాం. అలా ఇది మన జీవితంలో, వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. దీనికి అంతర్గత ప్రేరణ ఉంటుంది. అంటే, కొన్ని ఏళ్లుగా తెల్లవారు ఝామునే లేవడాన్ని అలవరచుకుంటే అలారం అవసరం లేకుండా ఆ సమయానికి అప్రయత్నంగా మెలకువ వచ్చేస్తుంది.

ఒకే సమయానికి భోజనం చేయటం, పడుకోవటం కూడ ఇలాంటివే! వీటిని స్థిర అలవాట్లంటాము. సత్పురుషుల సాంగత్యంతో దానగుణం, పరోపకారం, పెద్దవాళ్ళని గౌరవించటం, నిస్సహాయులకు అండగా నిలవటం, చక్కగా సంభాషించటం, సరైన నిర్ణయాధికారం అనే మంచి అలవాట్లను ప్రయత్నపూర్వకంగా అలవరచుకుంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇవి నిలిచిపోతే, వీటి వల్ల వ్యక్తిగత ప్రగతి తద్వారా సమాజ ప్రగతి కలుగుతుంది..

అలవాట్ల మీద నియంత్రణ అవసరం. మంచి అలవాట్లు కూడ ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆహార పానాదులు ఒక నిర్ణీత కాలంలో తీసుకునే మనకు అన్నివేళలా అలా సాధ్యం కాకపోవచ్చు. అందుకనే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రతి మంచి అలవాటు కూడ ఒక చెడ్డ అలవాటే నంటాడు. అలవాట్లను మన అధీనంలో ఉంచుకోవాలి. మన శరీరం మన అధీనం లో ఉండాలి గాని అది చెప్పినట్లు మనం వినకూడదు. దాని వశంలోకి మనం వెళ్ళకూడదు.

శరీరానికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటవుతుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నడక, వ్యాయామం చేసే అలవాటున్న వాళ్లకు ఒక్కరోజు చేయకపోయినా ఆ వెలితి తెలుస్తుంది. మంచి అలవాట్లు జీవితానికి ఒక క్రమశిక్షణ నిస్తాయి. బాల్యంలో ఏర్పడిన మంచి అలవాట్ల వల్ల మనం పొందే ప్రయోజనం ఎంతగానో ఉంటుంది. ఇది చాలా కాలం కూడా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల, ఉపాధ్యాయులపాత్ర, బాధ్యత ఎంతో ఉంది.

సాధారణంగా చెడుకి ఆకర్షణ ఎక్కువ. దీనివల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మంచి అలవాట్లు సైతం పోతాయి. చెడు అలవాట్లకు గురైన వ్యక్తుల కుటుంబాలు ఛిన్నాభిన్నమైన ఉదాహరణ లెన్నో! దీనివల్ల సమాజంలో మనిషికి గౌరవం ఉండదు. పైగా సమాజం నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

అలవాట్లనేవి మనిషి జీవితంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. మంచి అలవాట్లతో జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించు కోగలరు. చెడు అలవాట్లతో జీవితమే నాశనం అయిపోతుంది. ఒక మంచి అలవాటు మనిషిని ఉన్నత పథానికి తీసుకెళ్తే, చెడ్డది అధః పాతాళానికి తీసుకెళ్లిపోతుంది. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు కావచ్చు. కాని, అతి ధూమపానం, మద్యపానం, పరస్త్రీ వ్యామోహం, జూదం, దుబారా చేసి అనవసరంగా అప్పులు చేయటం వంటివి చెడు అలవాట్లుగా భావించటంలో ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు.

కొందరికి ప్రతి చిన్ననొప్పికి మాత్రలు వేసుకోవటం అలవాటుగా ఉంటుంది. అవసరమున్నా, లేకపోయినా డాక్టర్ల దగ్గరికి పరుగెడుతూ ఉంటారు. ప్రతి చిన్న బాధను కొంచెమైనా సహనంతో భరించలేక పోతే, విపరీతమైన మందుల వాడకం తదనంతర జీవితం పై దుష్ప్రభావం చూపుతుంది. మన దృష్టి దాని మీద నుండి మరల్చుకోవాలి.
మంచి అలవాట్లు జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తాయి. మంచి ఆరోగ్యానికి పునాది మంచి అలవాట్లే! పూర్వం బైటికి వెళ్లి ఇంటికి వస్తే, వచ్చిన వెంటనే కాళ్ళు, చేతులు కడుక్కుని లోపలికి వెళ్లేవారు. అంత శుభ్రత పాటించేవారు. ఆధునికత, జీవనశైలి అన్న పేరుతో ఇప్పుడు వీటిని వదిలేశాం. పాదరక్షలతోనే లోపలికి వెళ్లిపోతున్నాం. చేతులు కడుక్కోకుండానే భోజనం చేసేస్తున్నాం. వీటివల్ల అనారోగ్యాల పాలవుతున్నాం.

ఇప్పుడు, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో భయం కొద్దీ పూర్వపు పద్ధతులను ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నారు. చేతులు పదే పదే కడుక్కోవడం, కూరగాయలు బజారు నుంచి తెచ్చిన వెంటనే శుభ్రంగా కడగటం వంటివి వంద శాతం చేస్తున్నారు. పూర్వపు శుచి శుభ్రతలకు పూర్ణంగా విలువనిచ్చి పాటిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మంచి అలవాటు. ఈ క్లిష్ట పరిస్థితి పోయాక కూడ, ఇది ఒక స్థిరమైన అలవాటుగా ఎప్పటికి కొనసాగిస్తే, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరూ దోహదం చేసిన వారవుతారు. ఇటువంటి మంచి అలవాట్లను యువత అవసరార్థం నేర్చుకున్నా తదనంతరం కొనసాగించటం మంచిది.

అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. మనిషి మూడు అలవాట్లను తప్పక చేసుకోవాలని మేధావులు చెపుతారు.

మొదటిది – డబ్బు సంపాదించటం. జీవన గమనం కోసం, ఆర్ధిక భద్రత కోసం డబ్బు చాలా అవసరం.
రెండవది – ఎప్పుడూ తన ప్రవర్తనను తానే విశ్లేషించుకుంటూ, లోపాలను సరి దిద్దుకుంటూ ఆత్మ విమర్శ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి.
మూడవది – ఇష్టమైన రంగంలో సృజనాత్మకత పెంపొదించుకోవటం అలవాటు చేసుకోవాలి. రచయితలు, సంగీత, నృత్య కళాకారులు, క్రీడారంగ నిపుణులు నిరంతర సాధన చేస్తూనే ఉంటారు. పోటీలు ప్రదర్శనలు వున్నప్పుడే కాక ప్రతిరోజూ సాధన చేస్తూ ఉండటం వల్ల వారి విద్వత్తు మరింత ప్రకాశిస్తుంది. వృత్తినైపుణ్యాలు మెరుగవుతాయి. ప్రజ్ఞాపాటవాలు మరింతగా పరిఢవిల్లుతాయి.

మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏదైనా అలవాటు కావటానికి 21రోజులు అవసరమంటారు. ఆ నిర్ణీత కాలంలో నిష్ఠతో ప్రయత్నించటం వల్ల అది అలవాటవుతుంది. దానిని నిలుపుకోవటానికి ప్రతి రోజు ఆ అలవాటును కొనసాగించవలసి ఉంటుంది. శరీరానికి, మనసుకు కూడ మంచి అలవాట్లను అలవాటు చేయాలి. మనసుకు ఎటువంటి క్లిష్ట, విషాద పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండటం అలవాటు చేయాలి.

ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ, చెడు, హానికరం అనిపించినవి వదిలేయటానికి ప్రయత్నిస్తూ, మంచి అలవాట్లను వదలకుండా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూండాలి. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యం వైపు నడిపించేవి అలవాట్లు. 
మంచి అలవాట్లే వ్యక్తిత్వానికి చిరునామా.

అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి.

–డాక్టర్‌ చెంగల్వ రామలక్ష్మి

మరిన్ని వార్తలు