ఫ్రీ నస్రీన్‌.. ఫ్రీ లోజైన్‌ విడుదల ఉద్యమం

30 Apr, 2021 03:36 IST|Sakshi

నస్రీన్, లోజైన్‌.. ఈ ఇద్దరూ అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు. ఇద్దరిలో ఒకరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇంకొకరు జైలు వంటి నిర్బంధంలో బయట ఉన్నారు. జైల్లో ఉన్న నస్రీన్‌కు కరోనా వచ్చిందని తాజా సమాచారం! జైలు బయట ఉన్న లోజైన్‌.. డేగ కళ్ల నిఘాల మధ్య తన అనుదిన జీవితాన్ని గడుపుతున్నారు. ఇద్దరూ రెండు దేశాల వాళ్లు. వీళ్ల కోసం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గళమెత్తింది. ‘ఫ్రీ సస్రీన్‌.. ఫ్రీ లోజైన్‌’ అని ఉద్యమించింది. హక్కుల కోసం పోరాడుతున్న మహిళ హక్కుల కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ బయట, నెట్‌ లోపల ‘ఫ్రీడమ్‌ ఫర్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌’ అంటూ నిరసనలు, ప్రదర్శనలు మొదలయ్యాయి.

నస్రీన్‌ సొటుడే (57) లాయర్‌. మానవ హక్కుల కార్యకర్త. స్త్రీ హక్కుల ఉద్యమకారిణి. ఆమె రచనలు, ప్రసంగాలు, సమావేశాలు.. దేశంలో రాజకీయ అస్థిరతకు కారణం అవొచ్చంటూ ఇరాన్‌ ప్రభుత్వం 2018 జూన్‌లో ఆమెను అరెస్ట్‌ చేసింది. 38 ఏళ్ల జైలు శిక్ష విధించి, 148 కొరడా దెబ్బలు కొట్టించింది! టెహ్రాన్‌ సమీపంలో ఆమెను ఉంచిన కర్చక్‌ జైలు అత్యంత దారుణమైనది, అపరిశుభ్రమైనది. పైగా నస్రీన్‌ ఇప్పుడు కరోనా బారిన కూడా పడ్డారు. ఆమెను తక్షణం విడిపించి వైద్య చికిత్సకు తరలించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ కోరుతోంది.

లోజైన్‌ అల్‌హత్‌లౌల్‌ (31) ప్రజా న్యాయవాది. మహిళా హక్కుల కార్యకర్త. ప్రజల తరఫున ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సౌదీ అరేబియా పాలకులకు నచ్చలేదు. అమెను తక్షణం నిలువరిం^è కపోతే దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదం అని తలచారు. 2018 మే లో అమెను అరెస్ట్‌ చేశారు. వెయ్యి రోజులు జైలు శిక్షను అనుభవించాక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. అలాగని స్వేచ్చగా ఉండేందుకు లేదు. మూడేళ్ల ‘గమనింపు’ కాలం విధించారు. ఈ మూడేళ్లూ ఆమె ప్రభుత్వ సమ్మతి లేకుండా అడుగు తీసి అడుగు వేయడానికి లేదు. నోరు తెరిచి మాట్లాడటానికి లేదు. ఏ విధమైన రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. పాల్గొంటే మళ్లీ జైలు శిక్ష. వెయ్యి రోజుల శిక్షాకాలంలో అనేక విధాలైన హింసలకు గురయ్యారు లోజైన్‌. ‘ఆమ్నెస్టీ’ ఈమె కోసం కూడా పోరాడుతోంది. లోజైన్‌ పై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయమని డిమాండ్‌ చేస్తోంది.

నస్రీన్, లోజైన్‌ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలలో ఇంకా ఎంతో మంది మహిళా హక్కుల కార్యకర్తలు జైళ్లలోనూ, జైలు వంటి నిర్బంధాలలోనూ దుర్భమైన జీవితాలను గడుపుతున్నారు. వారందరి కోసం ఇప్పుడు ఆమ్నెస్టీ తో పాటు, ‘పెన్‌’ (పొయెట్స్, ఎడిటర్స్, నావెలిస్ట్స్‌) అమెరికా, ఇంటర్నేషనల్‌ బార్‌ అసోసియేషన్, ప్రసిద్ధ అమెరికన్‌ మ్యాగజీన్‌ ‘మిస్‌’, సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ ఉద్యమించాయి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు