శ్రమజీవనమే పరమానందం

24 Feb, 2023 01:02 IST|Sakshi

‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్‌’ అన్నాడు  దేవదాస్‌. బాధ సంగతేమిటోగానీ కష్టంలోనే సౌఖ్యాన్ని వెదుక్కుంది చెన్నైకి చెందిన పరమేశ్వరి. తన కుటుంబాన్ని పో షించుకోవడం కోసం గత ఇరవై  సంవత్సరాలుగా రోజుకు మూడు ఉద్యోగాలు చేస్తోంది...

పేద ఇంట్లో పుట్టి పెరిగింది పరమేశ్వరి. అష్టకష్టాలు పడి కూతురి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. వారి సంతోషం కరిగిపో యి విషాదంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. దీనికి కారణం... అల్లుడు. అతడు పనిచేసేవాడు కాదు. పైగా మద్యానికి బానిస. పెళ్లితో కష్టాలన్నీ తీరుతాయి అనుకున్న పరమేశ్వరి పరిస్థితి పెనం మీది నుంచి పోయ్యిలో పడ్డట్లు అయింది.

ఇల్లు దాటి పని చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. కొన్ని సంవత్సరాల తరవాత చెల్లి భర్త చనిపో యాడు. ఆమె అక్క దగ్గరకి వచ్చేసింది. భర్త, పిల్లలు, తల్లి, చెల్లి, ఆమె కూతురు... వీరిని పో షించాలంటే ఒక్క ఉద్యోగం చేస్తే సరిపో దనే విషయం పరమేశ్వరికి అర్థమైంది. అలా రోజుకు మూడు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది. పోద్దున నాలుగు గంటలకు లేచి ఒకరి ఇంట్లో ఇంటిపనులు చేస్తుంది.

ఆ తరువాత ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది (ఉద్యోగులకు టీ, కాఫీలు అందించడం) సాయంత్రం ఒక హోటల్‌లో పాత్రలు శుభ్రం చేస్తుంది. పరమేశ్వరి ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదకొండు అవుతుంది. తన మాటల్లోనే చెప్పాలంటే ఆమెకు వీకెండ్స్, హాలిడేలు, సన్‌డేలు లేవు. ‘కష్టాల మధ్య పెరిగాను. అందుకే కష్టపడడాన్ని భారంగా, బాధగా భావించడం లేదు. జీవితం అంటేనే పో రాటం. ఆ పో రాటంలో ప్రతిరోజూ కష్టపడాల్సిందే. సుఖంలోనే కాదు కష్టపడడం లోనూ సంతోషాన్ని వెదుక్కోవచ్చు’ అంటుంది చెన్నైలోని ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన 36 సంవత్సరాల పరమేశ్వరి.

పరమేశ్వరికి ఒక కల ఉంది. సొంతంగా ఒక ఇల్లు, ఒక వెహికిల్‌ ఉండాలి. అదృష్టం అనేది కష్టపడేవారి అడ్రస్‌ వెదుక్కుంటూ వస్తుంది అంటారు. పరమేశ్వరి కోసం ఏ అదృష్టం వెదుక్కుంటూ రాలేదు గానీ తన శ్రమ ఫలితమే ఇల్లుగా, వాహనంగా మారాయి. సంపాదించిన దానిలో ఎంతో కొంత దాచుకునేది. అలా ఆమె తన కలను నెరవేర్చుకుంది. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ మద్రాస్‌’ అనే సంస్థ పరమేశ్వరి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పో స్ట్‌ చేసింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
పరమేశ్వరి శ్రమైక జీవనసౌందర్యాన్ని నెటిజనులు వేనోళ్ల పోగిడారు. 

మరిన్ని వార్తలు