Baanali Home Foods Story: పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, జంతికలు.. మొత్తం 80 రకాలు! ఇంట్లోనే పిండివంటలు చేస్తూ..

24 Aug, 2022 11:44 IST|Sakshi
ఉష, రాజేశ్వరి

ఆహారమే ఆరోగ్యం! అదే విజయ రహస్యం!!

‘‘అక్కా! ఈ జంతికలు సరిగ్గా కాలాయో లేదో ఓ సారి చూస్తావా!’’.. ‘‘ఉషా! తోటకూర వేపుడు పొడి చేయిస్తున్నావా? కమ్మటి వాసన వస్తోంది!!’’ ... ‘‘పెద్దమ్మాయి పిల్లలకు మునగాకు పొడి కావాలట. ప్యాక్‌ చేయించక్కా!’’.. ‘‘పాలు వచ్చాయి... కోవా బాణలి స్టవ్‌ మీద పెట్టమ్మాయ్‌. నేను వస్తున్నా...  అడుగంటకుండా కాగాలి పాలు. గులాబ్‌ జామూన్‌ మృదువుగా ఉండాలి’’ 

సికింద్రాబాద్, న్యూ బోయిన్‌ పల్లి, ‘బాణలి’లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల సంభాషణ ఇది. ఇద్దరూ అరవయ్యేళ్లు దాటిన వాళ్లే. వాళ్లకు అధిక బరువు సమస్య ఎలా ఉంటుందో తెలియదు. జుట్టుకు డై వేయాల్సిన అవసరమూ రాలేదు. ‘ఆరోగ్యంగా తింటే అనారోగ్యం ఎందుకు వస్తుంది’ అంటారు. ఆరోగ్యంగా తినడం అంటే... మన సంప్రదాయ వంటకాలేనంటారు వాళ్లు.

‘‘మేము రోజూ ఆవకాయతో మొదలు పెట్టి గడ్డపెరుగుతో పూర్తి చేస్తాం. ఏ అనారోగ్యమూ లేదు. రోజూ ఒక ముద్ద వేడి అన్నంలో నెయ్యి, మునగాకు పొడి కలిపి తినండి. రోజూ సున్నుండ, నువ్వులుండ తినండి. మెత్తగా జారిపోయే కేకుల బదులు వేరుశనగ పట్టీని పటపటా కొరికి బాగా నమిలి తినండి.

మా ఇంట్లో అలాగే తింటాం. ఆరోగ్యంగా ఉన్నాం. అనారోగ్యం పాలవుతున్న కొత్తతరానికి ఆరోగ్యపు బాట వేయడానికే ఈ పని మొదలు పెట్టాం’’ అంటూ ‘బాణలి’ పేరుతో హోమ్‌ఫుడ్‌ సెంటర్‌ ప్రారంభించడానికి కారణాన్ని వివరించారు ఈ అక్కాచెల్లెళ్లు దాట్ల రాజేశ్వరి, పెన్మెత్స ఉష.  

వంటలన్నీ ఇంట్లోనే 
‘‘మా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం, దర్భరేవు గ్రామం. పదహారేళ్లకే మాకు పిండివంటలు చేయడం నేర్పించింది మా అమ్మ. మా నాన్న కలిదిండి సత్యనారాయణ రాజు. ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో రోజూ అతిథులుండేవారు.

రకరకాలు వండడం వడ్డించడంలో మా అమ్మకు రోజు సరిపోయేది కాదు. పెళ్లయి అత్తగారింటికి వెళ్తే అక్కడ మామగారు మునసబు. గ్రామానికి ఏ ఉద్యోగి వచ్చినా భోజనం మా ఇంట్లోనే. ఏ ఫంక్షన్‌ అయినా అన్నీ ఇంట్లోనే వండేవాళ్లం.

పెళ్లి, పేరంటాలకు పాతిక కావిళ్లు సారె పంపించడం... ఇలా ఎప్పుడూ వండడమే. ఒక్కమాటలో చెప్పాలంటే వండడం తప్ప మరొకటి తెలియదు, వంటల్లో మాకు తెలియనిది లేదు’’ అన్నారు రాజేశ్వరి.

వంద రుచులు వచ్చు!
‘‘పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, చెగోడీ–జంతికల వంటివి మొత్తం ఎనభై రకాలు వండుతాం. ఇతర వంటకాలన్నీ కలిపి వంద రకాలు వచ్చు. మాకు వంటల పుస్తకాలు తెలియదు. దినుసులన్నీ ఉజ్జాయింపుగా వేయడమే. వంటల పుస్తకాలు రాయమని చెప్తున్నారు.

కానీ దేనికీ కొలతలు పాటించం, కొలతలతో వండడం మాకు తెలియదు. కొలతలతో చెప్పడమూ తెలియదు. మా అమ్మ వండుతుంటే చూసి నేర్చుకున్నాం. మా దగ్గర పని చేసే వాళ్లకూ అలాగే నేర్పించాం’’ అన్నారు ఉష. 

పలాస జీడిపప్పు... నర్సాపురం బెల్లం 
‘‘వండడం వస్తే సరిపోదు, దినుసుల్లో నాణ్యత కూడా ముఖ్యమే. బెల్లం నర్సాపురం నుంచి, కారం బోధన్‌ నుంచి, జీడిపప్పు పలాస నుంచి, మంచి ఆవునెయ్యి కర్ణాటక నుంచి తెప్పించుకుంటాం. ఇంట్లో దినుసులు ఎలాగ మంచివి తెచ్చుకుంటామో అలాగే ఇదీనూ. మా అమ్మాయి హైదరాబాద్‌లో ఉండడంతో తరచూ అమ్మాయి ఇంట్లో పది– ఇరవై రోజులుండేవాళ్లం.

మనుమడు ప్యాకెట్లలో దొరికే చిరుతిళ్లు తింటుంటే... ఇదేం తిండి అనిపించేది. ఒంటికి బలం రాని తిండితో పిల్లలు ఊబదేలుతారు, ఎముక పుష్టితో పెరగరు. అందుకే ఇంట్లో రకరకాల పిండివంటలు చేసేదాన్ని. అమ్మాయి స్నేహితులు, వాళ్ల పిల్లలు ఎంతో మెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా అనిపించేది. ‘మీ చేతిలో ఉన్న విద్య విలువ మీకు తెలియడం లేదు.

చాలామందికి మన గోదారి జిల్లాల వంటల పేర్లు తప్ప రుచి కూడా తెలియదు. అందరికీ పరిచయం చేయవచ్చు కదా! నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించనూ వచ్చు. అన్నింటికంటే ముందు మన పిల్లలతోపాటు అందరి పిల్లలూ ఆరోగ్యంగా పెరుగుతారు. మీకు నాలుగు డబ్బులు కూడా వస్తాయి’ అని మా వియ్యంకులు చెబితే... ఎందుకో చాలా బిడియం వేసింది.

మాకు చక్కగా వండి పెట్టడమే తెలుసు, వంటను అమ్మడం చిన్నతనంగా అనిపించింది. కానీ వాళ్ల మాటలు కాదనలేక మొదలుపెట్టాం. గత ఏడాది ఉగాది రోజు మొదలైంది. ఇప్పుడు మా వంటల్ని కొన్నవాళ్లు నాలుగువేల మంది.

ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌గారు ఈ సెంటర్‌ను చూసి మమ్మల్ని అభినందించారు. ‘ఈ వంటలు మీ తరంతో అంతరించి పోకూడదమ్మా. కొత్త తరానికి అందించండి’ అని చెప్పారాయన. అంతపెద్ద ఆఫీసర్‌గారు ప్రశంసిస్తుంటే మేము చేస్తున్న పని మంచిదే అని మాకు ధైర్యం వచ్చింది’’ అన్నారు ఉష. 

అక్కడ ఇడ్లీ ప్రియం!
‘ఈ స్టోర్‌ చూసిన వాళ్లు మీ ఇద్దరే ఇన్ని చేస్తున్నారా! అని ఆశ్చర్యపడుతుంటారు. ఈ వయసులో చక్కటి ఆరోగ్యం మీది’ అని మెచ్చుకుంటారు. దేహానికి మంచి ఆహారం, తగినంత శ్రమ ఉంటే అనారోగ్యాలెందుకు వస్తాయి? అంటారు రాజేశ్వరి.

‘చపాతీలు చేయాలంటే గోధుమలు రోట్లో దంచాం, పిండి తిరగలితో విసిరాం. గారెలకు పిండి రోట్లో రుబ్బాం. ఈ చేతులకు ఈ పని పెద్ద పనేమీ కాదు’’ అని స్టోర్‌లో ఉన్న రకరకాల పిండివంటలను చూపించారీ సీనియర్‌ సిస్టర్స్‌.

ఇంకా... ‘‘మన సంప్రదాయ వంటల్లో ఆరోగ్యం ఉంది. ముందు తరాలకు అందివ్వాలి. వీటిని మన తరంతో అంతరించిపోనివ్వకండి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వాళ్ల పిల్లలకు వీటిని వండడం నేర్పించండి. మనం కేకులు, పిజ్జాలు, బర్గర్లు తినడం ఫ్యాషన్‌ అనుకుంటున్నాం.

పాశ్చాత్యదేశాల వాళ్లు మన ఇడ్లీ, దోశెలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. మన రుచిని మర్చిపోవద్దు. మన పోపుల పెట్టె ఔషధాల గని. తరతరాలకు అందించండి’’ అని సాటి మహిళలకు ఓ మంచిమాట చెప్పారు.

మరొక్క చిన్నమాట... ‘మేము స్వీట్లు చేస్తాం. కానీ తినం. రోజూ ప్రతి స్వీట్‌నీ తయారైనప్పుడు తప్పకుండా రుచి చూస్తాం. ఎక్కువ మోతాదులో తింటే రుచిని గుర్తించడం కష్టం’ అన్నారు. బహుశా! వీళ్ల విజయ రహస్యం, ఆరోగ్య రహస్యం ఇదే కావచ్చు. 
– వాకా మంజులారెడ్డి 
ఫొటోలు: మోర్ల అనిల్‌ కుమార్‌ 
చదవండి: Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు

మరిన్ని వార్తలు