Kalpana Ramesh: జల కల్పనకు ఊతం!

19 Aug, 2021 23:49 IST|Sakshi
స్థానికులు, జిహెచ్‌ఎంసి సిబ్బందితో కలిసి బన్సీలాల్‌పేట మెట్లబావి పునరుద్ధరణ 

‘‘75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని బన్సిలాల్‌పేట్‌ మెట్లబావిని పునరుద్ధరించేందుకు 75 మందికి పైగా స్థానిక జనం పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది’’ అంటూ ఆకాశం నుంచి రాలే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్న కల్పనా రమేష్‌ ఆనందంగా వివరించారు. హైదరాబాద్‌లో పాడుబడిన బావులను పునరుద్ధరిస్తూ, చెరువులు–కుంటలను సంరక్షిస్తూ, వాన నీటితో భూగర్భజలాలను పెంచడానికి కృషి చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒంగోలులో పుట్టి పెరిగిన కల్పన వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌. ఇంటీరియర్‌ ఆర్కిటెక్ట్‌ స్టూడియో కూడా నిర్విహిస్తున్న కల్పనా రమేష్‌ నీటి వైపుగా వేసిన అడుగుల గురించి వివరించారు. 

‘‘ఐదేళ్ల క్రితం కుటుంబంతో అమెరికా నుండి భారత్‌కు వచ్చాను. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు చుట్టూ పచ్చదనం కావాలనుకున్నాను. కానీ, అప్పటికి ట్యాంకర్లతోనే నీటిని తెప్పించుకునే పరిస్థితి. ఆ నీళ్లలో హానికారకాలున్నాయని గుర్తించాను. ఈ పరిస్థితి ని ఎలాగైనా మార్చాలనుకున్నాను. మా డాబా మీద వర్షపు నీటిని నిల్వ ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నాను. వాడిన నీళ్లు వృథాపోకుండా రీఛార్జ్, రీయూజ్, రీసైకిల్‌ పద్ధతిని అనుసరించాను. ఏడాదిలోనే మా ఇల్లు, మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం చల్లదనం, పచ్చదనం తో ఆహ్లాదకరంగా మారిపోయింది. 

బడి పిల్లలకు అవగాహన తరగతులు
ఎప్పుడైతే ఈ ఆనందం మేం చవి చూస్తున్నామో, నాటి నుంచి మా కాలనీవాసులూ ఇదే పద్ధతిని అనుసరించారు. దీంతో సమాజానికి నా వంతు సాయం చేయాలని, వాటర్‌ రీసైక్లింగ్‌ పై జనాల్లో అవగాహన పెంచుతూ వస్తున్నాను. ఇందుకు స్కూళ్లు, కాలేజీల్లోనూ దాదాపు 70 వేల మంది పిల్లలకు అవగాహన క్లాసులు తీసుకున్నాను. పాఠశాలల నుంచి పిల్లలే స్వచ్ఛందంగా ఈ నీటి యజ్ఞంలో పాల్గొనేలా చేశాను. 

చెరువుల సంరక్షణ
నగరంలో రియల్‌ ఎస్టేట్‌ కారణంగా వందల చెరువులు కాంక్రీట్‌ వనంలో కలిసిపోయాయి. ఇంకొన్ని ఇరుకైపోయాయి. కొన్ని మురుగు కు కేంద్రాలయ్యాయి. గోపీనగర్‌ చెరువు ఇందుకు ఉదాహరణ. దీనికోసం స్త్రీలనే బృందాలుగా ఏర్పాటు చేయడంతో, వారంతా చెరువు చెత్తను ఆటోల్లో డంప్‌యార్డ్‌ కు తరలించడం మొదలుపెట్టారు. పది రోజుల్లోనే ఆ చెరువును పరిశుభ్రంగా మార్చేశారు.

పాత బావులను తిరిగి వాడుకునేలా..
గచ్చిబౌలిలో మసీద్‌ వద్ద ఉన్న పాత బావి కొన్నేళ్లుగా చెత్తకు డంప్‌యార్డ్‌గా మారింది. పూర్తిగా చెత్త తొలగించి, ఆ చుట్టుపక్కల ఇళ్ల రూఫ్‌ నుంచి వర్షపు నీళ్లు బావిలో పడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు మసీదుకు వచ్చేవారు కూడా బావి నీళ్లు వాడుతున్నామని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాగే.. కోకాపేట్, కొండాపూర్, గచ్చిబౌలి, బన్సీలాల్‌పేట్‌.. ప్రాంతాల్లోని ప్రాచీన బావులను వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేశాం. ఇంకుడు గుంతలు, పాత బావులు... ఇతరత్రా విధానాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే నీటి ఎద్దడి రాదు. అంతా ప్రభుత్వమే చేయాలనుకోకుండా ఎవరికి వారు ఈ పనులు చేపడితే ఎంతో మంచిది. 

ప్రతి ఒక్కరూ ఒక వాటర్‌ వారియర్‌
ప్రజల్లో ఉండే నిర్లక్ష్యం ఎలా ఉంటుందో, దానిని ఎలా దూరం చేయాలో ఒక ఉదాహరణ  కుడికుంట చెరువు. ఆ చెరువును బాగు చేయడానికి ముందు స్థానికులతో చర్చించాను. ప్రతి ఒక్కరూ ఒక వాటర్‌ వారియర్‌ కావాలని కోరాను. అందరం కలిసి చెరువు నుంచి వంద టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాం. చెరువులను, బావులను శుభ్రం చేయాలనుకున్నప్పుడు దీని వల్ల నాకేదో ప్రయోజనం ఉందన్నారు కొందరు. అపుడు బాధేసింది. కానీ నా భర్త రమేష్‌ ఇచ్చిన సలహాలు, మద్దతు నన్ను బలవంతురాలిని చేశాయి. అలా ‘లివ్‌ ది లేక్స్‌ ఇనిషియేటివ్‌’ను ప్రారంభించా. నీరు మనిషి ప్రాథమిక హక్కు. నీటి నిల్వపై అవగాహనతో పాటు అపార్ట్‌మెంట్స్, ఆఫీసులకు అండగా నిలుస్తున్నా.

పాడైన బోర్లను బాగు చేసేందుకు 10కె బోర్స్‌ కార్యక్రమాన్ని చేపట్టా. ఇంటి ఆవరణలోనే రీ చార్జ్‌ పిట్‌లు ఏర్పాటు చేస్తున్నాను. జీహెచ్‌ఎంసీ, కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నాను. నగరంలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన సిటీ లేక్‌ యాక్షన్‌ కమిటీ టు కన్‌సర్వ్‌ లేక్స్‌’లో ఉన్నాను’ అని వివరించారు ఈ వాటర్‌ వారియర్‌. కల్పన జల సంరక్షణ మంత్రం ‘రీసైకిల్, రీఛార్జ్, రీయూజ్‌.’ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపుతున్నారు. మొదటి అడుగు ఒంటరిదే అయినా సంకల్పం బలంగా ఉంటే వేల అడుగులు జతకలుస్తాయి అంటున్న కల్పనారమేష్‌ అందుకు అసలైన ఉదాహరణ. ఇది వర్షాకాలం. నీటి నిల్వలు పెంచుకోవడానికి సరైన కాలం అంటున్నారు కల్పన.

మరిన్ని వార్తలు