Sajida Khadar: హాట్సాఫ్‌ ‘అమ్మా’.. ఆడపడుచును ఎప్పటికీ గుండెల్లో నిలుపుకొనేందుకు!

28 May, 2022 12:53 IST|Sakshi
సాజిదా ఖాదర్‌

చెరగని నవ్వుల దివ్వె 

కుటుంబంలో ఓ వ్యక్తి దూరమైతే  కలిగే దుఃఖం ఎవరూ తీర్చలేనిది. కానీ, మన గుండెల్లోని దయాగుణం ఎదుటివారి మోములో చిరునవ్వుగా మారినప్పుడు శోకం కూడా సంతోషంగా మారుతుంది అంటారు సాజిదా.

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ హుడా కాంప్లెక్స్‌లో ఉంటున్న సాజిదా ఖాదర్‌ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించినప్పుడు తన ఆడపడుచు పేరును తలచుకున్నారు. అనారోగ్యంతో తమకు దూరమైన ఆడపడుచు హసీనాను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటున్నామని బదులిచ్చారు. ఆ వివరాలు  ఆమె మాటల్లోనే... 

‘‘నా కూతురు ఏడాది వయసున్నప్పుడు మా ఆడపడచు హసీనా బ్రెయిన్‌ ట్యూమర్‌తో చనిపోయింది. ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది హసీనా చనిపోయి. కానీ, ఇప్పటికీ తను మా కళ్లముందున్నట్టే ఉంటుంది. అందంగా నవ్వుతుండేది. పేదవారి పట్ల దయగా ఉండేది. మా ఇంట్లో అందరికీ హసీనా అంటే చాలా అభిమానం. 

ఆమె గుర్తుగా ప్రతి యేటా పేదలకు మాకు తోచిన సాయం చేసేవాళ్లం. ఉద్యోగాలు మాని, సొంతంగా వ్యాపారం చేసినప్పుడు, వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని హసీనా పేరున దానం చేసేవాళ్లం. దానిని ట్రస్ట్‌గా ఏర్పాటు చేసి, ఒక పద్ధతి ప్రకారం చేస్తే మరింత బాగుంటుందని ఆలోచన వచ్చి దానిని అమలులో పెట్టాం. అవసరమైన వారికి ఏం చేయగలమా అని ఆలోచించాం.

అప్పుడే.. పేద పిల్లలకు చదువు, స్లమ్స్‌లోని వారికి వైద్యం అందించాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేశాం. అప్పటినుంచి పదిహేనేళ్లుగా మా చుట్టుపక్కల స్లమ్స్‌కి వెళ్లి అక్కడ అవసరమైనవారికి ప్రతీ నెలా రేషన్‌ ఇచ్చి రావడాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నాం.

అలాగే వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడంలో భవన నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఐరన్‌ వంటివి ఇస్తూ వచ్చాం. మా భార్యాభర్తల ఇద్దరి ఆదాయం నుంచే ఈ సేవలు అందిస్తున్నాం. వేరే ఎవరి దగ్గరా తీసుకోవడం లేదు. ఎంత చేయగలిగితే అంతే చేస్తున్నాం. 

ఫ్యామిలీ కౌన్సెలర్‌గా మార్చిన డే కేర్‌
మా స్వస్థలం గుంటూరు. పాతికేళ్ల క్రితం పెళ్లి అయ్యాక ఇద్దరమూ హైదరాబాద్‌  వచ్చేశాం. మొదట్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండేవాళ్లం. డబుల్‌ డిగ్రీ చేసిన నేను ప్రైవేట్‌ టీచర్‌గా చేసేదాన్ని. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారిని పగటి వేళ ఉంచడానికి సరైన కేర్‌ సెంటర్‌ కోసం చాలా ప్రయత్నించాను.

కానీ, ఏదీ సరైనది అనిపించలేదు. దాంతో ఉద్యోగం మానేసి బేబీ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించాను. దీంతో సెంటర్‌కు వచ్చే తల్లులు, కాలనీల వాళ్లు కొన్ని సందర్భాలలో తమ సమస్యలను చెప్పినప్పుడు, నాకు తోచిన సలహా ఇచ్చేదాన్ని. డే కేర్‌ సెంటర్‌ కొన్నాళ్లకు ఫ్యామిలీ కేర్‌ సెంటర్‌గా మారిపోయింది. 

న్యాయ సేవ వైపు అడుగులు..
కొన్ని సమస్యలు ఎంత కౌన్సెలింగ్‌ చేసినా పరిష్కారం అయ్యేవి కావు. అప్పుడు అక్కడ నుంచి పారా లీగల్‌ సేవలు వైపుగా వెళ్లాను. సామరస్యంగా సమస్యలను పరిష్కార దిశగా తీసుకెళ్లేదాన్ని. అలా చాలా కేసుల పరిష్కారానికి కృషి చేశాను. నా సర్వీస్‌ను గమనించి, జిల్లా న్యాయసేవా సదన్‌ వారు పారా లీగల్‌ వలంటీర్‌గా నియమించారు.

అలా కొన్నాళ్లు కౌన్సెలింగ్‌ చేస్తూ వచ్చాను. ఒక సందర్భంలో నటి జయసుధ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన వ్యక్తి ద్వారా హ్యూమన్‌ రైట్స్‌లోకి వెళ్లాను. మానవహక్కులను కాపాడటంలో ఎవరికీ భయపడలేదు. చాలాసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, పోలీస్‌ డిపార్ట్‌మెంట్, న్యాయవ్యవస్థ అండగా ఉండటంతో ఎన్నో కేసుల్లో విజయం సాధించాను. 

మహిళలకు ఉచిత శిక్షణ
ఎన్ని పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా హసీనా ట్రస్ట్‌ మాత్రం వదల్లేదు. ఈ ట్రస్ట్‌ ద్వారా ఉచిత విద్య, వైద్యంతో పాటు వికలాంగులు నిలదొక్కుకునేలా  సహాయం అందిస్తున్నాం. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కాలనీల్లో వెల్ఫేర్‌ అసోసియేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇప్పిస్తున్నాను. 

మా అమ్మాయి పేరు హుస్నా. కానీ, చాలా మంది తెలియక హసీనా మీ కూతురా అని అడుగుతుంటారు. నేను కూడా ‘అవును నా పెద్ద కూతురు’ అని సమాధానమిస్తుంటాను. సేవ అనేది చేస్తున్న ప్రతి పనిలో భాగమైంది. హసీనా మా సేవకు ఒక రూపు అయ్యింది. పేదల నవ్వుల్లో చెరగని దివ్వె అయ్యింది’ అని వివరించారు సాజిదా.
– నిర్మలారెడ్డి 

మరిన్ని వార్తలు