సరికొత్త రచన..ఫుడ్‌ డెలివరీ గర్ల్‌

26 Jun, 2021 00:57 IST|Sakshi
మామిడిపెల్లి రచన

కరోనా వచ్చాకా పెద్దపెద్ద కంపెనీలు నష్టాల బాట పడితే మరికొన్ని కంపెనీలు మూతపడ్డాయి. కొంతమంది ఉద్యోగుల కొలువులు కోతకు గురైతే రోజువారి కూలిపని చేసుకునే నిరుపేదల బతుకులు రోడ్డున పడ్డాయి. లాక్‌డౌన్‌తో దినసరి కూలీల అరకొర ఆదాయం కూడా ఆవిరైపోయింది. సరిగ్గా ఈ కోవకు చెందిన రచన ఒకపక్క చదువుకుంటూ మరోపక్క ఫుడ్‌ డెలివరి గర్ల్‌గా పనిచేస్తూ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటు తన చదువుకయ్యే ఖర్చులు నెట్టుకొస్తూనే, కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తోంది.

వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన మామిడిపెల్లి రచనది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు రోజువారి కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వ స్కూలు, కాలేజిలో చదువుకుంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజిలో డిప్లామా చదివేందుకు రచనకు అడ్మిషన్‌ దొరకడంతో రచన హైదరాబాద్‌ వచ్చింది. సిటీæఅంటే ఖర్చులు ఎక్కువ. వాటిని భరించే స్థోమత రచనకు లేదు. దీంతో ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచి ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లను డెలివరి చేస్తూ కొంత ఆదాయాన్ని సంపాదించేది. తన సొంతఖర్చులకు కొంత వాడుకుని మిగతాది తల్లిదండ్రులకు పంపించేది.

మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టుగా... కరోనా విజృంభణతో కూలి పనిచేసే వారి బతుకులు చితికిపోయాయి. దీంతో రచన మరికొంత ఎక్కువ సంపాదించి తల్లిదండ్రులను ఆదుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఎక్కువగా అబ్బాయిలు మాత్రమే చేసే.. ఫుడ్‌ డెలివరి ఉద్యోగాన్ని ఎంచుకుంది. జొమాటో ఫుడ్‌ డెలివరి యాప్‌లో పనిచేస్తూ తన ఆదాయాన్ని మరికొంత పెంచుకుని తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది.

‘‘అబ్బాయిలు చేసే ఉద్యోగమే అయినప్పటికి నా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నేను ఫుడ్‌ డెలివరి జాబ్‌ను ఎంచుకున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి మంచి ఆర్థిక ఆధారాన్ని ఇస్తుంది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తయ్యాక నాకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నా కష్టాలు కూడా తీరతాయి’’ అని రచన ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
 

మరిన్ని వార్తలు