హోమ్‌ మేడ్‌... మటన్‌ హలీమ్‌

17 Apr, 2021 15:46 IST|Sakshi

కావల్సిన పదార్థాలు: బోన్‌లెస్‌ మటన్‌ –500 గ్రాములు; నెయ్యి– అరకప్పు; జీలకర్ర – ఒకస్పూన్‌; తోక మిరియాలు –ఒకస్పూన్‌; దాల్చిన చెక్క –మీడియం సైజు ఒకటి; లవంగాలు – మూడు; సాజిరా –ఒక స్పూన్‌; యాలకులు – మూడు; పెద్ద ఉల్లిపాయలు –మూడు; అల్లంవెల్లుల్లి పేస్టు –రెండు స్పూన్లు; గరం మసాల–ఒక స్పూన్‌; పచ్చిమిర్చి –నాలుగు; పెరుగు –ఒక కప్పు; పసుపు –ఒక స్పూను; గోధుమ రవ్వ –ఒకటిన్నర కప్పు; శనగపప్పు –ఒకస్పూన్‌; పెసరపప్పు –ఒక స్పూన్‌; ఎర్ర పప్పు(మసూరి పప్పు) –ఒక స్పూన్‌; కొత్తిమీర – మీడియం సైజు కట్ట ఒకటి; పుదీనా – మీడియం సైజు కట్ట ఒకటి; నిమ్మకాయ –ఒకటి; అల్లం –చిన్న ముక్క; నీళ్లు– 12 కప్పులు; ఉప్పు – తగినంత; జీడిపలుకులు– కొద్దిగా.

తయారీ విధానం: 
► ముందుగా గోధుమరవ్వ, పెసరపప్పు, శనగపప్పు, ఎర్ర పప్పులను విడివిడిగా కడిగి రాత్రంతా నానపెట్టుకోవాలి. రాత్రి నానపెట్టుకోవడం కుదరనివారు కనీసం రెండు గంటలైనా నానపెట్టాలి. తరువాత మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, పెరుగు, పసుపు, గరం మసాల వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద ప్రెజర్‌ కుక్కర్‌ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న మటన్‌ మిశ్రమాన్ని దానిలో వేయాలి. ఒక ఐదు నిమిషాలపాటు నెయ్యిలో మటన్‌ వేగిన తరువాత దానిలో రెండు కప్పులు నీళ్లుపోయాలి. తరువాత కుక్కర్‌ మూత పెట్టి పది విజిల్స్‌ వచ్చేంతవరకు ఉడికించాలి.

► మటన్‌ ఉడికిన తరువాత చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నాన పెట్టుకున్న అన్ని రకాల పప్పులను ఒక గిన్నెలో వేసి ఉడికించాలి. ఇవి ఉడుకుతుండగానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, జీలకర్ర, సాజిరా వేసి దానిలో పది కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తరువాత వీటన్నింటిని మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వాటిని ఎర్రగా వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.


► ఇప్పుడు స్టవ్‌ మీద మరో పాన్‌ పెట్టుకుని దానిలో మూడు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తరువాత దానిలో ఉడికించి మెత్తగా రుబ్బి పెట్టుకున్న మటన్‌ను వేసి రెండు–మూడు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరువాత గోధుమ రవ్వ, పప్పులన్నింటిని కలిపి గ్రైండ్‌ చేసిన ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం ఉడికేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి పైకి నెయ్యి తేలినప్పుడు దానిలో ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి కలిపితే హలీమ్‌ తయారైనట్లే. స్టవ్‌ ఆపేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు పలుకులను పైన చల్లి వడ్డిస్తే  హలీమ్‌ చాలా రుచిగా ఉంటుంది.    

మరిన్ని వార్తలు