ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!

6 Dec, 2022 19:36 IST|Sakshi
నవరత్నాల గనులు: ‘ది హిస్టీరికల్‌ క్లబ్‌’ సభ్యులు

ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా?
నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్‌’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. 

వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. 
అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్‌’లాంటి క్లబ్‌లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. 
ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే!

చెన్నైలోని ఫస్ట్‌ ఆల్‌–ఉమెన్‌ ఇంప్రొవైజేషన్‌ థియేటర్‌ ‘ది హిస్టీరికల్‌’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్‌–యాక్టివిటీస్‌ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్‌ ఏ యాన్‌–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్‌ జాప్‌ జోప్‌–ప్లేయర్స్‌ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్‌ ఎండోమెంట్‌–మూడో ప్లేయర్‌కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్‌ రహస్యంగా మాట్లాడుకుంటారు.

‘ది హిస్టీరికల్‌ క్లబ్‌’ అనేది షాలిని విజయకుమార్‌ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్‌–బాయిల్డ్‌ ఇంక్‌’ ఇంప్రూవ్‌ కామెడీ గ్రూప్‌లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ.

‘కామెడీ ఫీల్డ్‌లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్‌ క్లబ్‌ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్‌ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్‌’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని.

శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్‌తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్‌తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్‌’ స్టాండప్‌–కామెడీ మూమెంట్‌ సహకారంతో ‘ఫీల్‌ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్‌ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్‌ క్లబ్‌’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు.

‘ఇంప్రొవైజేషనల్‌ థియేటర్‌ లేదా ఇంప్రూవ్‌ అనేది కామెడీలోని సబ్‌ జానర్‌. చిన్న స్టోరీ లైన్‌ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్‌’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్‌.

‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు.

‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని.
‘ది హిస్టీరికల్‌ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్‌.

‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్‌. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి)

మరిన్ని వార్తలు