ఏక్తా కపూర్.. కష్టాలను ఎత్తి కుదేయండి

9 Feb, 2021 05:35 IST|Sakshi

చిన్న వయసులో పెళ్లి. భర్త దాష్టీకం. మేరిటల్‌ రేప్‌. ఇంటి నుంచి పారిపోయి వస్తే ఎక్కడికీ పారిపోనివ్వని కడుపులో బిడ్డ. డిప్రెషన్‌. ఇన్ని కష్టాలు చుట్టుముడితే ఏం చేయాలి? భయపడి పారిపోవాలా? కండలు పెంచుతాను అనుకుంది నైనిటాల్‌కు చెందిన ఏక్తా. ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తన మనసును, శరీరాన్ని ఫిట్‌గా మార్చుకుంది. ఇవాళ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌  అయ్యింది. అంతేనా ఉత్తరాఖండ్‌లో మొదటి ఖరీదైన పర్సనల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ యజమాని అయ్యింది. ‘నా పోరాటం తెలిస్తే మీ కష్టాలు చిన్నవైపోతాయి. వాటిని ఎత్తి కుదేస్తారు’ అంటోంది ఏక్తా.

‘నేను నా కథను ఎందుకు చెబుతున్నానంటే కష్టాలు ఉన్నాయని భావించే స్త్రీలు నా కథ విని ధైర్యం తెచ్చుకుంటారనే. కష్టాలు నెత్తి మీద ఎప్పుడూ ఉండే బండరాళ్లు కాదు. వాటిని ఎత్తి కిందకు కుదేయవచ్చు. దాటి ముందుకెళ్లవచ్చు’ అంటుంది 32 ఏళ్ల ఏక్తా కపూర్‌. ఈ పేరు వినగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఉన్న ఏక్తా కపూర్‌ గుర్తుకు రావచ్చుగాని ఆమెకు ఈమెకు ఏ సంబంధమూ లేదు...  ఆమె సీరియల్స్‌లో పెట్టే నాటకీయ కష్టాలు ఈమె నిజ జీవితంలో ఉన్నాయన్న ఒక్క పోలిక తప్ప.

పోరాటం మొదలు..
ఏక్తా కపూర్‌ది నైనిటాల్‌. స్కూల్‌ అమ్మాయిగా ఉండగానే తల్లిదండ్రులు విడిపోయారు. ఏక్తా తండ్రితో ఉండిపోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌ పేరెంట్‌గా ఆమెను పెంచాడు. అతడు స్కూల్‌ టీచరు. 18 ఏళ్లు రాగానే తల్లితోడు లేని పిల్ల అని పెళ్లి చేశాడు. ‘ఆ పెళ్లితో నా కొత్త జీవితం మొదలవుతుందని అనుకున్నాను’ అంటుంది ఏక్తా. కాని అత్తవారింటిలో ఆమె నరకం చూసింది. భర్తకు వయసు చాలా ఎక్కువ. అబద్ధం చెప్పి చేశారు. పైగా అతను ఆమెను ఏనాడూ భార్యగా చూడలేదు. తాను భర్తగా ఉండలేదు. ‘నాకు ఏమీ తెలియదు. లైంగిక జీవితంపై అవగాహన లేదు. నేను అతన్ని స్వీకరించే లోపే అతను రోజూ మేరిటల్‌ రేప్‌ చేసేవాడు. ఆ రోజుల్లో దాని మీద ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. అదొక నేరం కూడా కాదు’ అంది ఏక్తా.

పారిపోయి ఇల్లు చేరి
ఏక్తా అత్తవారింటి నుంచి పారిపోయి ఇల్లు చేరింది. తండ్రి అక్కున చేర్చుకున్నాడు. విడాకులు ఇప్పించాడు. ‘బంధువులందరూ నా వైపు సానుభూతిగా చూడటమే. ఇది చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలు అనేవారు. నాకు డిప్రెషన్‌ పెరిగిపోయి ఆత్మహత్యాయత్నం చేశాను. హాస్పిటల్‌లో చేరిస్తే నేను గర్భవతిని అని చెప్పారు. అప్పటికే బాగా వీక్‌గా ఉన్నాను. గర్భం నిలవడం కూడా కష్టమే అన్నారు. కాని కడుపులో ఉన్న నా కూతురిని కాపాడుకున్నాను’ అంది ఏక్తా. కూతురు పుట్టాక బంధువులు మళ్లీ ఆమెను చుట్టుముట్టారు. ఆ పిల్లను ఎవరికైనా దత్తత ఇచ్చేయ్‌.. అప్పుడే నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవు అన్నారు. కాని ఏక్తా ఒప్పుకోలేదు. బిడ్డను తనతోనే ఉంచుకుంది.

రకరకాల ప్రయత్నాలు
పాపకు మూడేళ్లు వచ్చాక తండ్రికి అప్పగించి ఏక్తా రకరకాల పనుల వెంట తిరిగింది. ఢిల్లీలో కొన్నాళ్లు పని చేసింది. కొన్నాళ్లు ఏక్టింగ్‌ నేర్చుకుంది. కొన్నాళ్లు టీచర్‌గా పని చేసింది. కాని తనకు ఏదీ సూట్‌ కాలేదు. అప్పుడే ఒక బంధువు ఆమెకు ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ గురించి చెప్పాడు. ‘2014లో ముంబైలో జరిగిన ఆ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌కు హాజరయ్యాక నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అర్థమైంది. నా ఫిట్‌నెస్‌ కోసం నేను చేసిన కృషి నా శరీరాన్నే కాదు మైండ్‌ను కూడా గట్టి పరిచింది. ఏ కష్టమైనా ఎదుర్కొనగలననే ధైర్యం వచ్చింది నాకు.’ అంటుంది ఏక్తా.

మలుపు తిరిగిన జీవితం
ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లోనే ఆమెకు ప్రస్తుత భర్త శశాంక్‌ పరిచయం అయ్యాడు. అతను కూడా ఫిట్‌నెస్‌ ట్రైనరే. ‘అతని ద్వారా ఫిట్‌నెస్‌ మీద నుంచి మెల్లగా నా ఫోకస్‌ వెయిట్‌లిఫ్టింగ్‌పై పెట్టాను. కాని అది ఎక్కువగా మగాళ్ల ప్రపంచం. నీకు ఇక్కడ ఏం పని అన్నట్టు చూశారు. కాని వెయిట్‌ లిఫ్టింగ్‌లో నా సత్తా చూపాలనుకున్నాను. జాతీయ స్థాయిలో మెడల్‌ సాధించాక గాని అందరు మగాళ్ల నోళ్లు మూత పడలేదు’ అంది ఏక్తా.

ఆమె సాధించిన విజయాలను చూసి ఒకప్పుడు జాలిగా మాట్లాడినవారు ఇప్పుడు గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు. కండలు తిరిగిన ఆమె చేతులను చూసి వినయంగా తప్పుకుంటున్నారు. అంతే కాదు... ఆమె కష్టాలు దాటిన పద్ధతిని చూసి గౌరవిస్తున్నారు.

‘నా ఫిట్‌నెస్‌ నేను అందరికీ ఇవ్వాలనుకున్నాను. అందుకే డెహరాడూన్‌లో అత్యంత అధునాతనమైన ఫిట్‌నెస్‌ స్టూడియోను ప్రారంభించాను’ అంటోంది ఏక్తా.
భర్త, ఆమె కలిసి ఆ స్టూడియో నిర్వహిస్తున్నారు. కూతురు చదువుకుంటోంది. ‘నా కూతురిని మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త దొరికాడు’ అని సంతోషపడుతోంది ఏక్తా.
‘పోరాడండి. గెలుపొందండి. ఆగిపోవద్దు అని స్త్రీలకు నేను చెప్పదలుచుకున్నాను’ అంటున్న ఏక్తా కచ్చితంగా ఒక బలమైన కండలు తిరిగిన స్ఫూర్తి మనకు.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు