కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ జెట్‌

13 Sep, 2020 08:49 IST|Sakshi

కరోనా వ్యాక్సిన్‌ ఆశల చిలకరింపు జల్లులు ముఖాన కురియక ముందే ఆవిరైపోతున్నాయి. మబ్బుల్లో నీళ్లున్నాయి అనుకోగానే మేఘాలై తేలిపోతున్నాయి. వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 180 పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిల్లో 35.. మనుషులపై ప్రయోగాల దశకు చేరుకున్నాయి. రష్యాలోనైతే వ్యాక్సిన్‌ మార్కెట్‌ లోకి వచ్చేసింది. తర్వాత ఏమైందీ నమ్మకంగా తెలియడం లేదు. ఏమైనా.. వ్యాక్సిన్‌ వచ్చింది, వస్తోంది, వస్తుంది అనే ఈ మూడు భూత భవిష్యత్‌ వర్తమాన నమ్మకాలే ఇప్పుడు ముందస్తు వ్యాక్సిన్‌లు. ఈ నమ్మకంతోనే ఈ భూగోళంపై ఉన్న మొత్తం 700 కోట్ల 80 లక్షల మంది జనాభాకు వ్యాక్సిన్‌ ని చేరవేసే విషయమై కెనడా లోని ‘ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అసోసియేషన్‌’ (ఐ.ఎ. టి.ఎ.) అంచనాలు వేస్తోంది.

గగన గజరాజు బోయింగ్‌ 747 జంబో జెట్‌లో వ్యాక్సిన్‌లను లోడ్‌ ఎత్తుకుని కనీసం 8 వేల ట్రిప్పులైనా కొడితేనే కానీ ‘అందరికి టీకా’ అందదని ఐ.ఎ. టి.ఎ. ఒక స్పష్టతకు వచ్చింది. షిప్పింగ్‌ పెద్ద పని. వ్యాక్సిన్‌ని కనిపెట్టినంత పని. షిప్పింగ్‌ అంటే ఇక్కడ సముద్ర రవాణా అని కాదు. వ్యాక్సిన్‌ను విమానాల తలకెత్తడం. 747 కార్గో క్రాఫ్ట్‌ లోపల ఆ పెట్టెలను భద్రంగా అమర్చడం. దించవలసిన చోట దించడం.. ఇవన్నీ ఉంటాయి. ఈ భారీ తరలింపులు బూడిదలో పోసిన పన్నీరో, నేల పై పగిలిన అమృతమో అవకుండా చూడ్డం పెద్ద టాస్క్‌. ఈ బరువైన బాధ్యతను వీలైనంత తేలికగా చేయడం కోసం ఐ.ఎ.టి.ఎ. అప్పుడే వ్యూహ రచనలు (లాజిస్టిక్స్‌) కూడా చేసి ఉంచింది. ‘వ్యాక్సిన్‌ ఎప్పటికైనా రానివ్వండి. అది  మీకు తప్పక చేరుతుంది’ అనే నమ్మకాన్ని సిద్ధం చేసి ఉంచింది. గ్రేట్‌! 

మరిన్ని వార్తలు