మీలోని శక్తి ఎంత?!

26 Feb, 2023 01:38 IST|Sakshi

నలుగురితో కలిసి ఉన్నప్పుడు మనలోని బలం పెరిగినట్టు అనిపిస్తుంది. అదే, ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొనే సమయంలో మానసికంగా మనంఎంతటి శక్తివంతులమో మనకే అర్ధమవుతుంది. ఈ సమయంలో భావోద్వేగాలలో మార్పులు తీవ్రంగా ఉంటే జీవన విధానంపై అవి చెడు ప్రభావం చూపుతాయి. ‘ఒంటరిగా ఉన్నా, నలుగురిలో కలివిడిగా ఉన్నా భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ మనల్ని మనం శక్తిమంతులుగాఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుంటేవచ్చే సమస్యల అలలను సులువుగా ఎదుర్కోవచ్చు’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. 

‘సైకలాజికల్‌ ఫ్లెక్సిబిలిటీ అనేది సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే, ఇటీవల చాలా మందిలో గమనిస్తున్న విషయమేంటంటే చిన్న విషయానికి కూడా ఓవర్‌గా రియాక్ట్‌ అవుతుంటారు. నేను చెప్పిందే వినాలి’ అనే ధోరణి పెరగడం కూడా బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది’ అంటున్నారు లైఫ్‌స్కిల్‌ ట్రెయినర్‌ జ్యోతిరాజ. 

ఎరుక అవసరం 
కొందరు తమచుట్టూ ఎవరికీ కనపడని ఒక వలయాన్ని సృష్టించుకుంటారు. పరిమితులను నిర్దేశించుకుని వాటిని దాటి బయటకు రారు. ఏదైనా చిన్న సమస్య ఎదురైనా సృష్టించుకున్న వలయం ఎక్కడ ఛిన్నాభిన్నం అవుతుందో అని తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. ఫలితంగా భావోద్వేగాల అదుపు కోల్పోయి ఇతరులను నిందించడం, తమను తామే శిక్షించుకోవడం లేదా గాసిప్స్‌ని ఆశ్రయిస్తారు. ‘భావోద్వేగాల అదుపు కోల్పోతే ఏ బంధంలోనైనా బీటలు వస్తాయి. అందుకని వలయాలతో కాకుండా ఎరుకతో మెలిగితే మనలోని అంతర్గత శక్తి స్థాయిలు స్పష్టమవుతాయి’ అనేది నిపుణుల మాట.   

మౌనంగా ఉండటం మేలు
అతిగా మాట్లాడటం, చేతల్లో మన పనిని చూపించకపోతే ఎదుటివారి ముందు మన శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా భావోద్వేగాల్లోనూ మార్పు వస్తుంది. ఇది బంధుమిత్రుల మధ్య పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ, పని ప్రదేశాలలో ఈ ‘శక్తి’ని బాగా గుర్తించవచ్చు. ఇబ్బందిని కలిగించే సంభాషణల్లో పా ల్గొనడం కన్నా, తక్కువ మాట్లాడం వల్ల శక్తిని, భావోద్వేగాల సమతుల్యతను కాపా డుకోవచ్చు. ఆ శక్తిని ఇతర సృజనాత్మక పనులకు బదిలిచేయవచ్చు.  

అవగాహనతో సరైన శక్తి
అంతర్గత దిక్సూచిని భావోద్వేగ మేధస్సు అని కూడా అంటారు. ఇది సున్నితం–తీవ్రం రెండింటినీ సమాన స్థాయిలో ఉంచుతుంది. అంటే, నలుగురిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఎలా దూకుడుగా ప్రవర్తించబోతున్నాడో ముందే పసిగట్టి, నివారించే శక్తి వీరికుంటుంది. సరైన సమయంలో ఎలా స్పందించాలో తెలిస్తే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగల అంతర్గత శక్తి పెరుగుతుంది.

పట్టు విడుపులు తెలుసుండాలి...
ఏ అంశం వదిలేయాలి, దేనిని మన ఆధీనంలో ఉంచుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. అనవసరం అనిపించే సమస్య ఏదైనా వదిలేయడం కూడా తెలియాలి. పిల్లలైతే వారు చదువుల్లో ఆటపా టల్లో బిజీగా ఉంటారు. కాలేజీ స్థాయి యువతలో బిజీగా ఉంటారు. గృహిణుల్లో మాత్రం పిల్లలు పెద్దయ్యాక వారికి కొంత తీరిక సమయం ఉంటుంది.

ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ముందునుంచే తమను తాము మలుచుకుంటూ ఉండాలి. తమలో ఉండే ఇష్టాయిష్టాలు, కలల కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా కలిగే సంతృప్తి వల్ల భావోద్వేగాల అదుపు, అంతర్గత శక్తి స్ఙాయిలు పెరుగుతాయి. ఈ ప్రా క్టీస్‌ ఇంట్లో పిల్లల చేత కూడా చేయిస్తే, వారిలోనూ కొత్త సమర్థతలు బయటకు వస్తాయి. భావోద్వేగాల అదుపుకు అంతర్గతశక్తిని మేల్కొల్పడమే సరైన ఆయుధం. – ఆచార్య జ్యోతిరాజ,  లైఫ్‌ స్కిల్‌ ట్రెయినర్‌

తట్టుకునే శక్తిని పెంచుకోవాలి.. 
సాధారణఃగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే కంగారు పడిపోతాం. భయం ఆవరించేస్తుంది. ఈ ఒత్తిడి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. బ్యాక్‌పెయిన్, నెక్‌ పెయిన్, స్ట్రెస్‌.. వంటివి సాధారణంగా ఉంటాయి. ఈ సమస్యలకు విరుగుడుగా ఆరోగ్యం, మానసిక స్థిరత్వానికి యోగ సాధన చేయడం ఒక భాగం చేసుకున్నాను. దీనితో పా టు ధ్యానం చేయడం వల్ల ప్రశాంతతను ఇస్తుంది. ఆందోళన లేకుండా సమస్యలను తట్టుకుని, ముందడుగు వేసే శక్తినిచ్చే ఆయుధాలుగా వీటిని మలుచుకున్నాను.   – కవిత ఎన్,  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

మరిన్ని వార్తలు