కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!

9 Sep, 2022 18:08 IST|Sakshi

పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు!

కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. 

తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. 

బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్‌ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరిశోధనా బృందానికి కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ విమల్‌ కటియార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. వైభవ్‌ వి గౌడ్‌ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ సస్టైనబుల్‌ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్‌ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. 


లేపనంలో ఏముంది?

డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్‌ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్‌ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్‌: ఇంటి పంట: రూఫ్‌టాప్‌ పొలం.. 5.7 ఎకరాలు!)

ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు.  

పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్‌కె21 సెల్‌ లైన్‌’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్‌ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్‌: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..)

ఈ అధ్యయన ఫలితాలు రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్‌ కెమికల్‌ సొసైటీకి చెందిన ‘ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. 
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు!
భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్‌ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది.


లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్‌ కోటింగ్‌ టెక్నిక్‌’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు.  
– ప్రొ. విమల్‌ కటియార్, అధిపతి, కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in

మరిన్ని వార్తలు