సోషల్‌ మీడియా అవార్డు

24 Aug, 2020 02:55 IST|Sakshi

మంచి మొగుడు

‘బెస్ట్‌ హజ్బెండ్‌’ ఇజాత్‌ హఫీజ్‌కి వచ్చిన టైటిల్‌ ఇది. ఇంత గొప్ప టైటిల్‌ని అతడికి సోషల్‌ మీడియా ఇచ్చేసింది. ఫిలింఫేర్‌కి ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అవార్డుల వేడుక ఏదీ లేదు. కానీ ఇజాత్‌ చేసిన పనికి ప్రశంసాపూర్వకంగా నెటిజన్‌లు మనస్ఫూర్తిగా ఇచ్చిన ప్రశంస ‘బెస్ట్‌ హజ్బెండ్‌’. ఇజాత్‌ చేసిన పనికి కొందరైతే ‘దిస్‌ ఈజ్‌ గ్రేట్‌’ అన్నారు. ఒక మగాడి గురించి సోషల్‌ మీడియా వేదికగా అంతమంది అన్నేసి కాంప్లిమెంట్‌ లు ఇస్తుంటే... అతడి భార్య ఎయీన్‌ సురయ్యా మాత్రం ‘మా వారికి సహనం చాలా ఎక్కువ’ అని మురిసిపోయింది. ఇంతమంది ఇంతగా చెప్పుకోవడానికి ఇంతకీ ఇజాత్‌ హఫీజ్‌ చేసిన అంత గొప్ప పనేంటోననే ఆసక్తి సహజమే. 

వంటగదిలో హారం
ఆడవాళ్లు పోపుల పెట్టెలో డబ్బు దాచుకుంటారని, పోపుల పెట్టె ఆడవాళ్ల ఏటీఎమ్‌ సెంటర్‌ అని జోకులు వేస్తుంటారు మగవాళ్లు. హఫీజ్‌ మాత్రం భార్య కోసం బంగారు దండ కొని కిచెన్‌లో ఉన్న ఎయిర్‌ ఫ్రైయర్‌లో దాచాడు. అతడు అలా దాచి రెండు నెలలు దాటిపోయింది. సురయ్యా మూడు నెలలుగా ఎయిర్‌ ఫ్రెయర్‌ను వాడనేలేదు మరి. ఆమె ఎప్పుడు ఎయిర్‌ ఫ్రైయర్‌ను ఓపెన్‌ చేస్తుందా అని ఎదురు చూడడం హఫీజ్‌ వంతయింది. ఎట్టకేలకు ఆమె ఇటీవల ఒకరోజు ఏదో ఫ్రై చేయడానికి ఫ్రైయర్‌ ను తెరిచింది. అందులో తళతళలాడుతూ బంగారు గొలుసు. ఆశ్చర్యంగా భర్త దగ్గరకు వెళ్లి అడిగింది.

‘నీకై నువ్వే చూసిన క్షణంలో కలిగే సంతోషాన్ని నీ ముఖంలో చూడాలనుకున్నాను. అందుకే చెప్పలేదు. ఎప్పుడు చూస్తావా అని ఎదురు చూశాను’ అన్నాడు సింపుల్‌గా. ఇంతకీ అతడు ఆ హారాన్ని కొన్న సందర్భం భార్య పుట్టిన రోజు లేదా పెళ్లి రోజు కానీ కాదు. మరే ఇతర ప్రత్యేకత కూడా లేదు. జస్ట్‌ భార్యకు బహుమతి ఇవ్వాలనుకున్నాడంతే. హఫీజ్‌కు మంచి భర్త అని ప్రశంసలు రావడం వెనుక కథ ఇది. అయితే ఈ కథంతా వివరించిన సురయ్యా తమ దంపతులు ఫొటోను షేర్‌ చేయకుండా, కేవలం బంగారు హారాన్ని మాత్రమే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇదంతా తెలిసిన తర్వాత హఫీజ్‌ గురించి ఆసక్తి ఇంకా పెరిగిపోవడం సహజమే. ఇదంతా జరిగింది ఇండియాలో కాదు మలేసియాలో. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు