ఇక్కట్లు లేని ‘ఇల’ పంటలు! 

3 May, 2022 04:22 IST|Sakshi
మండుటెండల్లోనూ టెర్రస్‌పై షేడ్‌నెట్‌ లేకుండానే కాళీఫ్లవర్‌ సహా ఇంటిపంటలు పండిస్తున్న శ్రీనివాసరెడ్డి, రమ దంపతులు

ఇంటి పంట 

కుటుంబం అవసరాలకు సరిపోయే అన్ని ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, కొన్ని రకాల పండ్లను రసాయనాలు వాడకుండా స్వయంగా సాగు చేసుకోవటమే ఆర్గానిక్‌ టెర్రస్‌ కిచెన్‌ గార్డెనింగ్‌ ముఖ్య ఉద్దేశం. అయితే,  అనుకున్న కొద్ది మంది మాత్రమే ఆ ఆశలను సక్రమంగా తీర్చుకోగలుగుతారు. కొందరు ఉత్సాహంగా ప్రారంభిస్తారు. తమకున్న స్థలానికి తగిన డిజైన్, ప్రణాళిక, తగిన వస్తువులు దొరక్క కిచెన్‌ గార్డెనింగ్‌ ప్రక్రియలో ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కొవడానికి నానా తంటాలు పడతారు. ఎంత కష్టపడినా ఫలితం లేక చివరికి చాలా మంది చేతులెత్తేస్తారు. 

ఇక వేసవి సమస్యలు సరేసరి. సరిగ్గా ఈ సమస్యలన్నిటినీ అధిగమించేందుకు దోహదపడటమే లక్ష్యంగా ఇల హోం గార్డెన్స్‌ కన్సల్టెన్సీ అనే స్టార్టప్‌ ఆవిర్భవించింది. ఆర్గానిక్‌ టెర్రస్‌/కిచెన్‌ గార్డెనింగ్‌లో ఆధునిక పద్ధతులపై సుదీర్ఘ స్వీయానుభవం కలిగిన శాస్త్రవేత్త డా. జి. శ్యామసుందర్‌ రెడ్డి, మాటీవీలో ‘భూమిపుత్ర’ సిరీస్‌ ప్రొడ్యూసర్, ఫ్రీలాన్స్‌ పాత్రికేయుడు కె.క్రాంతికుమార్‌ రెడ్డి ఉమ్మడిగా ‘ఇల’ ను హైదరాబాద్‌ కేంద్రంగా నెలకొల్పారు. టెర్రస్‌ కిచెన్‌ గార్డెనింగ్‌లో సమస్యలను అధిగమించడంతోపాటు పుష్టికరమైన ఆహారాన్ని పుష్కలంగా ఇంటిపైనే పండించుకునేందుకు  దోహదపడే ప్రత్యేకమైన కుండీ ‘ఇల’కు డా. శ్యామసుందర్‌రెడ్డి రూపుకల్పన చేశారు. 

చదరపు గజం విస్తీర్ణంలో వృత్తాకారంలో ఉండే ఈ కుండీని ప్రతికూల పరిస్థితుల్లోనూ పుష్టికరమైన ఇంటిపంటల దిగుబడినిచ్చేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. దీర్ఘకాలం మన్నే ఫైబర్‌ బేస్‌ పైన, చుట్టూతా జీఏ మెష్, లోపల వైపు గ్రీన్‌ షేడ్‌నెట్‌.. అన్నిటికీ మించి ప్రత్యేకంగా రూపొందించిన సేంద్రియ మట్టి మిశ్రమం దీని ప్రత్యేకత. ఎర్రమట్టి, కోకోపిట్, బయోచార్, వర్మీకంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులు, వర్మిక్యులేట్‌ తదితరాలతో కూడిన మట్టి మిశ్రమం.. మొక్కల వేరు వ్యవస్థ సులభంగా విస్తరించేలా, బలంగా ఎదిగేలా, గాలి పారాడేలా, ఆరోగ్యదాయకమైన అధికోత్పత్తిని అందించేలా డిజైన్‌ చేసిన కుండీలే తమ ప్రత్యేకత అని ‘ఇల’ సీఈవో క్రాంతి (83096 15657) తెలిపారు. 

ఇల కుండీలకు డ్రిప్‌ను అమర్చి క్రమం తప్పకుండా తగుమాత్రంగా తేమను అందిస్తూ వారానికో, రెండు వారాలకోసారి నిర్దేశిత పిచికారీలు చేస్తుంటే చాలు.. సులభంగా నిర్వహించుకుంటూ చక్కని ఇంటిపంటలు పండించుకొని తినొచ్చని స్వీయానుభవంతో చెబుతున్నారు దేవరం శ్రీనివాసరెడ్డి, రమ దంపతులు. మే నెల మండుటెండల్లో సైతం ముదురు ఆకుపచ్చగా అనేక ఇంటిపంటలకు నెలవుగా వీరి టెర్రస్‌ కిచెన్‌ గార్డెన్‌ కనువిందు చేస్తోంది. 

సివిల్‌ కాంట్రాక్టర్‌ అయిన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ వనస్థలిపురం ఎఫ్‌.సి.ఐ. కాలనీలో నిర్మించుకున్న ఇంటిపైన 3 నెలల క్రితం 40 ‘ఇల’ కుండీలను ఏర్పాటు చేసుకున్నారు. టెర్రస్‌ మధ్యలో సోలార్‌ ప్యానల్స్‌ ఉన్నాయి. వాటి చుట్టూతా ఉత్తరం వైపు ఒక వరుస, తూర్పు వైపు రెండు వరుసలుగా కుండీలు ఏర్పాటు చేసుకున్నారు. డ్రిప్‌తో ఇచ్చిన నీరు చుక్క కూడా నేలపై పడదు.

ప్రస్తుతం పాలకూర, గోంగూర, చుక్కకూర, పొన్నగంటి, బచ్చలి, తోటకూర, చెట్టు బచ్చలి, కొత్తిమీర, పుదీనాతోపాటు.. క్యారట్, మిరప, వంగ, టమాటో, చెర్రీ టమాటో, చెట్టు చిక్కుడు, గోకర (గోరుచిక్కుడు) పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఎండలు మండే మే నెలలోనూ షేడ్‌నెట్‌ లేకుండానే పండిన కాళీఫ్లవర్‌ వీరి ఇంటిపంటల సుసంపన్నతకు నిదర్శనంగా నిలిచింది. ఏర్పాటు చేసుకున్న నెల రోజుల నుంచే ఆకుకూరలు కొనటం పూర్తిగా మానేశామని, బయట కొనే వాటితో పోల్చితే తాము పండించుకున్న ఆకుకూరలు, కూరగాయల రుచే వేరని.. వంకాయ కూర రుచి ఎంతో బాగుందని శ్రీనివాసరెడ్డి (98480 39532), రమ సంతోషంగా చెప్పారు. ఆరోగ్యం కోసం ఏమైనా చేయాలంటే ముందు మన  ఆహారాన్ని రసాయన రహితం చేసుకోవాలి. అందుకు అద్భుత సాధనం టెర్రస్‌పై ఇంటిపంటలే అనటం అతిశయోక్తి కాదు.  
ilahomegardens.com. 

మరిన్ని వార్తలు