క్యాన్సర్‌.. ఫాలో అప్‌ల ప్రాధాన్యమెంత? ఇదిగో ఇంత!

6 Sep, 2021 12:52 IST|Sakshi

Importance Of Follow-Up Care: క్యాన్సర్‌ అన్న పదం వింటేనే ఎంతో ఆందోళన. అయితే.. త్వరగా వ్యాధి నిర్ధారణ జరిగి.. రకాన్ని బట్టి చికిత్స రేడియోథెరపీనా, కీమోథెరపీనా లేక శస్త్రచికిత్సా అన్నది నిర్ణయించాక, ఆ తర్వాత ఫాలో అప్‌లన్నీ సరిగ్గా జరుగుతుంటే దాన్ని తేలిగ్గానే అదుపు చేయవచ్చు. క్యాన్సర్‌ చికిత్సలో ఫాలోఅప్‌ల ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం. 

క్యాన్సర్‌కు ఇదమిత్థంగా ఇలాగే అంటూ నిర్దిష్ట చికిత్స ఇవ్వడం సాధ్యం కాదు.  క్యాన్సర్‌ రకంతో పాటు మరెన్నో అంశాలు చికిత్స జరగాల్సిన తీరును నిర్ణయిస్తాయి.  ఫాలో అప్‌ అంటే డాక్టర్లు నిర్ణయించిన సమయాల్లో తర్వాత్తర్వాతి చికిత్సలకు హాజరుకావడంగా చెప్పవచ్చు. అవి... ప్రధాన చికిత్స తర్వాత... నిర్ణీత వ్యవ«ధుల్లో అంచెలంచెల్లో జరుగుతుంటాయి. ఇవి కేవలం ప్రధానంగా చికిత్స విషయంలోనే కాదు... బాధితుడికి మానసికంగా, సామాజికంగా... వ్యాధి ముదరకుండా చూడటం ద్వారా ఆర్థికంగా కూడా సాంత్వన ఇస్తాయి.
చదవండి: ఆర్థరైటిస్‌ నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌ వద్దు! 

ఈ ఫాలో అప్‌లో రక్తపరీక్షల వంటివి మాత్రమే కాకుండా... దేహంలో వచ్చే ఇతరత్రా మార్పులను పసిగట్టడానికి రకరకాల పరీక్షలు అవసరమవుతూ ఉంటాయి. సాధారణంగా మిగతా వ్యాధుల చికిత్సలతో పోలిస్తే ఇవి చాలాకాలం పాటు అలా కొనసాగుతూ ఉండటమనే అంశం కూడా రోగి మానసిక స్థైర్యానికి పరీక్ష పెడుతుంటుంది. అందుకే క్యాన్సర్‌ బాధితులకు మానసిక బలం కూడా చాలా అవసరమని అందరూ గుర్తించాలి. 

ఫాలో అప్‌ ప్లాన్‌ ఎలా ఉంటుందంటే..
క్యాన్సర్‌ రోగులందరికీ చికిత్స ఒకేలా ఉండనట్లే... ఫాలో అప్‌లు కూడా నిర్ణీతంగా ఉండవు. అవి చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. బాధితుడికి ఉన్న క్యాన్సర్‌ రకం,  అతడికి ఇచ్చే చికిత్స (రేడియోథెరపీయా / కీమోథెరపీనా / శస్త్రచికిత్సా?...  మొ.)  రోగి సాధారణ ఆరోగ్యం /చికిత్స ఇచ్చాక అతడిక పరిస్థితులు మొదలైనవి. అందరి విషయంలో ఒకేలా ఉండకపోయినా..  ఫాలో అప్‌లలోనూ కొన్ని సాధారణ సామ్యతలు కనిపిస్తాయి. ఉదాహరణకు... చికిత్స పూర్తయిన మొదట్లో నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో మొదటిసారీ, ఆ తరువాత ప్రతీ 3 – 4 నెలలకు ఒకసారి చొప్పున ఆంకాలజిస్టులను కలవాల్సి రావచ్చు. ఆ తర్వాత ప్రతి మూడు లేదా నాలుగు నెలలకోసారి చొప్పున కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెరుగుదలను బట్టి ప్రతి ఏడాదికోసారి లేదా రెండుసార్లు ఉండవచ్చు. 


చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా..

చికిత్స తర్వాత ఉద్భవించే ప్రశ్నలు... 
ప్రధాన చికిత్స తర్వాత ఫాలో అప్‌ల సమయంలో రోగిలో వచ్చే కొన్ని సందేహాలివి... ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ డాక్టర్‌ను తప్పక అడిగి తెలుసుకోవాలి. 
► పూర్తిగా కోలుకోడానికి ఎంత సమయం పట్టవచ్చు? 
►ఎలాంటి లక్షణాలూ లేదా చిహ్నాలు కనిపిస్తే డాక్టర్‌ను వెంటనే కలవాలి? 
►చికిత్స తర్వాత తరచూ చేయించాల్సిన ప్రధాన పరీక్షలేమిటి? అవెంత తరచుగా చేయించాలి? 
►ప్రధాన చికిత్స తర్వాత దీర్ఘకాలంలో కనిపించే సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి? 
►మళ్లీ తిరగబెట్టడానికి అవకాశం ఉందా? అయితే... అవకాశం ఎంత? 
►ఏయే డాక్యుమెంట్లు / ఏయే పరీక్షల ఫలితాల రిపోర్టులు జాగ్రత్తగా ఉంచాలి? 
►మళ్లీ మునపటిలాంటి ఆరోగ్యం పొందడం సాధ్యమా? పొందాలంటే ఏం చేయాలి? 
►గ్రూప్‌హెల్ప్‌ పొందడానికి తమలాంటి వాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? 

ఫాలో అప్‌ సమయంలో డాక్టర్‌తో చెప్పాల్సినవి... 
ఫాలో అప్‌ సమయంలో డాక్టర్‌ను కలిశాక బాధితుడు తమ సమస్యలన్నీ ఏమీ దాచకుండా... పూర్తిగా పారదర్శకంగా డాక్టర్‌తో మాట్లాడాలి. కేవలం లక్షణాల గురించే కాదు... శారీరక, మానసిక బాధలు, వ్యాధి సంబంధిత కష్టాలు, ఉద్వేగాలు... ఇవన్నీ దాచకుండా చెప్పాలి. అంతకు ముందు కనిపించని కొత్త లక్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా వివరించాలి. అయితే అవన్నీ క్యాన్సర్‌కు సంబంధించినవేనా అనే ఆందోళన ముందే వద్దు. అవి క్యాన్సర్‌వి కాకపోవచ్చు కూడా. ఎందుకంటే కొందరిలో చికిత్సకు సంబంధించిన కొన్ని అంశాలు/ప్రభావాలు చికిత్స పూర్తయిన చాలా కాలం తర్వాత బయటకు కనిపించవచ్చు. అందుకే అవి క్యాన్సర్‌ సంబంధించినవా / సంబంధించనివా, లేదా అన్న సంశయానికి తావివ్వకుండా అన్నీ చెబితే... రోగి చాలా ఆందోళన పడేది అసలు సమస్యే కాదనే విధంగా దూదిపింజలా ఎగిరిపోవచ్చు.

డాక్టర్‌కు ఇంకా చెప్పాల్సినవి... 
►బాధితుడికి రోజువారీ ఎదురయ్యే సమస్యలు... ఉదాహరణకు తన ఆకలి, అలసట, మూత్రసంబంధిత అంశాలు, లైంగికంగా ఎదురయ్యే సమస్యలూ, సందేహాలు, ఏకాగ్రత కుదురుతుందా, జ్ఞాపకశక్తిలో మార్పులేమైనా వచ్చాయా, నిద్రకు సంబంధించినవి, బరువు పెరుగుతున్నారా/తగ్గుతున్నారా... లాంటివి. 
►ఇతరత్రా సమస్యలకు సంబంధించి వాడుతున్న మందులు / మార్పు చేసిన మందులు, మూలికలూ, ఔషధమొక్కలకు సంబంధించినవి (హెర్బ్స్‌) ఏమైనా వాడారా? 
►కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర (మెడికల్‌ హిస్టరీలో) వచ్చిన మార్పులు 
►భావేద్వేగాల విషయంలో వచ్చిన మార్పులు / వ్యాకులత / కుంగుబాటు వంటి మానసిక బాధల గురించి అడగాలి. 
►ఇవన్నీ అడుగుతూ... జీవనశైలి విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో, చెడు వ్యసనాలకు పూర్తిగా దూరం గా ఉంటే... మిగతా అందరిలాగే క్యాన్సర్‌ బాధితులు కూడా పూర్తి ఆరోగ్యంతో, దాదాపు సాధారణ వ్యక్తుల ఆయుఃప్రమాణాలకు తగ్గకుండా జీవించవచ్చు. 

-డాక్టర్‌ అజయ్‌ చాణక్య వల్లభనేని,కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ రోబోటిక్‌ సర్జన్‌

మరిన్ని వార్తలు