కవలలే.. కవలలు 

15 Mar, 2021 09:33 IST|Sakshi

సంతానం కోసం ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తుంటారు. ఒకరు పుడితే ఓకే.. అదే ఒకేసారి ఇద్దరు పుడితే.. వారికి ఆ సంబరమే వేరు. మొదటిసారే అయినా, ఇప్పటికే పిల్లలున్నా.. మళ్లీ కవలలు పుడితే అదో ఆనందం, ఆశ్చర్యం.. మరి ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య పెరిగిపోతోందని తెలుసా? ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా 16 లక్షల మంది కవలలు పుడుతున్నారు. ఇది మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో కవలల బర్త్‌ రేటు ఎక్కువగా ఉంటోంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ప్రస్తుతం ఆఫ్రికాలో కవలల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కవలల పుట్టుకలో భారత్, చైనాలే టాప్‌కు చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 165 దేశాల్లో 1980–1985 మధ్య, 2010–2015 మధ్య పుట్టిన కవలలకు సంబంధించి డేటాను ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం ప్రసవాల్లో పుట్టిన కవలల శాతాన్ని.. అప్పటికి, ఇప్పటికి పోల్చి చూశారు. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందన్నది లెక్కించి ఒక నివేదికను రూపొందించారు. 

ఉత్తర అమెరికా, ఆసియాలోనే ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కవలలు జన్మిస్తున్న శాతం పెరిగినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 1980 దశకంతో పోలిస్తే ప్రధానంగా ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాలు)లో ఏకంగా 71 శాతం పెరిగిందని, యూరప్‌లో 60 శాతం, ఆసియా ప్రాంతంలో 32 శాతం పెరిగిందని తెలిపారు. ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో మాత్రమే కవలల బర్త్‌రేటు తగ్గిందని వెల్లడించారు. 

కవలల సంఖ్యాపరంగా చూస్తే.. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఎక్కువ మంది జని్మస్తున్నారు. అంతేకాదు సహజంగా పుడుతున్న కవలలు ఈ రెండు ఖండాల్లోనే ఎక్కువ. సాధారణంగా రెండు రకాలుగా కవలలు పుడుతుంటారు. మహిళల్లో అండం ఫలదీకరణ చెందాక రెండుగా విడిపోయి వేర్వేరు శిశువులుగా ఎదగడం ఒక రకమైతే.. ఒకేసారి రెండు అండాలు విడుదలై (డైజైగోటిక్‌), ఫలదీకరణ ద్వారా కవలలు పుట్టడం రెండో రకం. ఆఫ్రికా మహిళల్లో జన్యుపరంగా డైజోగోటిక్‌ పరిస్థితి ఉంటుందని, ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లోనూ ఈ పరిస్థితి ఉందని ఈ పరిశోధనలో భాగమైన ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ క్రిస్టియన్‌ మోండెన్‌ తెలిపారు. ఇక యూరప్, ఉత్తర అమెరికా, మరికొన్ని చోట్ల ఐవీఎఫ్, హార్మోన్‌ చికిత్స, ఇతర కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా ఎక్కువగా కవలలు పుడుతున్నారు. 

వైద్యం, పోషణ లేక మరణాలు 
పేద, మధ్య ఆదాయ దేశాల్లో కవలలు ఎక్కువగా జన్మిస్తున్నా చిన్నతనంలోనే చనిపోతున్నారని ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ జెరోన్‌ స్మిత్‌ చెప్పారు. ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో చాలా వరకు ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తున్నారని.. తల్లికి పోషకాహారం లేక చిన్నారులు సరిగా ఎదకపోవడం, పుట్టిన తర్వాత కూడా సరైన పోషణ, వైద్యం అందకపోవడం దీనికి కారణమని పేర్కొన్నారు. ఇలా ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు.

కవలలు పుట్టడానికి కారణాలివీ..
కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌) వినియోగం పెరిగిపోవడం కవలలు పెరగడానికి కారణాల్లో ఒకటి. పిల్లలు లేని దంపతులు ఐవీఎఫ్‌ చేయించుకునేప్పుడే కవలల కోసం ప్రయతి్నస్తున్నారు. మరోవైపు ఈ విధానంలో ఫెయిల్యూర్‌ రేటు సగం దాకా ఉండటంతో.. డాక్టర్లు ఎక్కువ పిండాలను ఫలదీకరణం చెందించి మహిళల గర్భంలో ప్రవేశపెడుతున్నారు. 
మహిళలు ఆలస్యంగా పిల్లల్ని కనడం కవలల పుట్టుకలో మరో కారణం. ఉద్యోగాలు, కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తున్న దంపతులు లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, ఇంకా లేటుగా పిల్లల్ని కనడం జరుగుతోంది. 35, 40 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. 

30% -1980వ దశకంతో పోలిస్తే పెరిగిన కవలల పుట్టుక శాతం

16 లక్షలు ప్రపంచవ్యాప్తంగా ఏటా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య 

42లో ఒకరు సగటు ప్రసవాల్లో కవల పిల్లలు జన్మించే అవకాశం 

80% ప్రపంచంలోని కవలల డెలివరీల్లో ఆఫ్రికా, ఆసియాలో జన్మిస్తున్నవారి శాతం

మరిన్ని వార్తలు