Independence Day 2021: ఇండిపెండెన్స్‌ టూర్‌.. ఎందరో మహానుభావులు

14 Aug, 2021 17:00 IST|Sakshi

ఒక అల్లూరి... ఒక ఆజాద్‌. ఓ మహాత్ముడు... ఓ ఉక్కు మనిషి. అందరిదీ ఒకటే నినాదం... జైహింద్‌. మంగళ్‌పాండే పేల్చిన తుపాకీ...  లక్ష్మీబాయి ఎత్తిన కత్తి... భగత్‌సింగ్‌ ముద్దాడిన ఉరితాడు... అందరిదీ ఒకటే సమరశంఖం. అదే... భారతదేశ విముక్తపోరాటం. డయ్యర్‌ దురాగతానికి సాక్షి జలియన్‌ వాలాబాగ్‌. దేశభక్తిని ఆపలేని ఇనుపఊచల అండమాన్‌ జైలు.సంకల్ప శుద్ధితో బిగించిన ఉప్పు పిడికిలి దండు. వీటన్నింటినీ ప్రకాశవంతం చేసిన దేవరంపాడు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా... దేశమాతకు సెల్యూట్‌ చేస్తూ చూడాల్సిన కొన్ని ప్రదేశాలు.

దేవరంపాడు: ప్రకాశ వీచిక
ఆ రోజు 1928, అక్టోబరు నెల. స్వాతంత్య్ర సమరయోధులు మద్రాసు (చెన్నై) పారిస్‌ కార్నర్‌లో గుమిగూడారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ‘సైమన్‌ గో బ్యాక్‌’ అంటూ ఏకకంఠంతో నినదించారు. బ్రిటిష్‌ అధికారుల ఆదేశాలతో పోలీసులు ఉద్యమకారుల మీద కాల్పులు జరిపారు. పార్థసారథి అనే దేశభక్తుడు అక్కడికక్కడే నేలకొరిగాడు. ఆ క్షణంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆవేశంగా ముందుకు వచ్చి ‘కాల్చండిరా కాల్చండి’ అంటూ శాలువా తీసి ఛాతీ విరుచుకుని ముందుకొచ్చారు. ఆ గొంతులో పలికిన తీక్షణతకు పోలీసులు చేష్టలుడిగిపోయారు. ఆ చోటులోనే ప్రకాశం పంతులు విగ్రహం ఉంది. చెన్నై వెళ్లిన ప్రతి తెలుగు వారూ తప్పక చూడాల్సిన ప్రదేశం. ప్రకాశం పంతులు చివరిక్షణాల్లో జీవించిన దేవరంపాడు కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది.

దేవరంపాడు గ్రామం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడి స్థానిక రాజకుటుంబీకులు విరాళంగా ఇచ్చిన పన్నెండు ఎకరాల మామిడితోట ప్రస్తుతం జాతీయ స్మారక చిహ్నాల సుమహారం. ఇందులో వందేమాతర విజయధ్వజం, గాంధీ– ఇర్విన్‌ ఒడంబడిక సందర్భంగా త్రివర్ణ స్థూపం ఉన్నాయి. ప్రకాశం పంతులు చివరి రోజుల్లో ఇక్కడే జీవించారు. ఏటా ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్, మంత్రులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యాటకులు ఒంగోలులో బస చేసి దేవరంపాడుకి వెళ్లి రావచ్చు.

హుస్సేనీవాలా: విప్లవ జ్ఞాపకం

పంజాబ్‌ రాష్ట్రం, ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ఉంది హుస్సేనీవాలా గ్రామం. ఇది అమర వీరుల స్మారక చిహ్నాల నేల. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల గౌరవార్థం రోజూ సాయంత్రం జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని భారత్‌– పాకిస్థాన్‌ సైనికులు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఈ అమరవీరుల జ్ఞాపకార్థం వీరు ముగ్గురూ ప్రాణాలు వదిలిన రోజును గుర్తు చేసుకుంటూ ఏటా మార్చి 23వ తేదీన ప్రభుత్వం షాహీద్‌ మేళా నిర్వహిస్తారు.

అహ్మదాబాద్‌: ఐక్యత వేదిక
అహ్మదాబాద్‌ వెళ్లగానే మొదట సబర్మతి నది తీరాన ఉన్న గాంధీ మహాత్ముని ఆశ్రమం వైపు అడుగులు పడతాయి. మన జాతీయోద్యమంలో అనేక ముఖ్యమైన ఉద్యమాలకు ఇక్కడే నిర్ణయం జరిగింది. అందుకే దీనిని సత్యాగ్రహ ఆశ్రమం అంటారు. ఈ ఆశ్రమంలో అణువణువూ గాంధీజీ నిరాడంబరమైన జీవితాన్ని, జాతీయోద్యమం పట్ల ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నగరంలో చూసి తీరాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్మారక భవనం. అహ్మదాబాద్‌ నగరం షాహీబాగ్‌లో ఉన్న మోతీ షాహీ మహల్‌ను పటేల్‌ మెమోరియల్‌గా మార్చారు. సర్దార్‌ పటేల్‌ నేషనల్‌ మెమోరియల్‌లో పటేల్‌ జీవితంతోపాటు జాతీయోద్యమం మొత్తం కళ్లకు కడుతుంది. ఒక్కో గది ఒక్కో రకమైన విశేషాలమయం. పటేల్‌ జీవితంలో జైలు ఘట్టాలతోపాటు, బాల్యం, స్వాతంత్య్ర పోరాటం, జాతీయనాయకులతో చర్చల చిత్రాలు, ఆయన ఉపయోగించిన వస్తువులు కూడా ఉంటాయి. 

కృష్ణదేవి పేట: అల్లూరికి వందనం
తెలుగు జాతి గర్వపడే వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు... అల్లూరి సీతారామ రాజు సమాధి విశాఖపట్నం జిల్లా, గోలుగొండ మండలం, కృష్ణదేవి పేట (కె.డి. పేట)లో ఉంది. ప్రభుత్వం దీనిని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తోంది. ఇక్కడి ప్రజలు కూడా అల్లూరి సమాధి అని మన మాట పూర్తయ్యేలోపు ఎలా వెళ్లాలో దారి చూపిస్తారు. ఈ ప్రదేశంలో సీతారామరాజు పేరుతో పార్కును అభివృద్ధి చేశారు. అల్లూరి సీతారామరాజు సమాధికి సమీపంలోనే సీతారామరాజు అనుచరులు మల్లుదొర, ఘంటం దొర సమాధులు కూడా ఉన్నాయి. ఒక భవనంలోని ఫొటో గ్యాలరీలో సీతారామరాజు జీవిత విశేషాలను, బ్రిటిష్‌ వారి మీద పోరాడిన ఘట్టాలను చూడవచ్చు. కృష్ణదేవి పేట గ్రామం విశాఖపట్నానికి పశ్చిమంగా నూటపది కిలోమీటర్ల దూరాన ఉంది.

ప్రయాగ్‌రాజ్‌: ఆజాద్‌ ఆఖరి ఊపిరి
అలహాబాద్‌ నగరంలో 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు ఆజాద్‌ స్మారకం. చంద్రశేఖర్‌ ఆజాద్‌ తుది శ్వాస వదిలిన చోట ఆయన స్మారక విగ్రహాన్ని స్థాపించారు. ఇది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌) నగరంలో ఉంది. జాతీయోద్యమంలో భాగంగా ఆజాద్‌ 1931 ఫిబ్రవరి 27వ తేదీన పోలీసు అధికారుల మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. తాను పట్టుబడుతున్న క్షణంలో ఆజాద్‌ తన తుపాకీలోని చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. అప్పటి వరకు ఆల్‌ఫ్రెడ్‌ పార్కుగా ఉన్న పేరును ఆజాద్‌ పార్కుగా మార్పు చేశారు.

దండి: ఉవ్వెత్తిన ఉప్పు దండు 
గుజరాత్‌ రాష్ట్రం, దండి తీరాన గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలియని భారతీయులు ఉండరు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఎనభై మంది సత్యాగ్రహులు 1930, మార్చి నెలలో దండి గ్రామం వరకు 241 కి.మీల దూరం ఈ మార్చ్‌ నిర్వహించారు. అహింసాయుతంగా శాసనోల్లంఘనం చేసిన ఉద్యమంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉద్యమం ఇది. ఇక్కడ ఉన్న ‘నేషనల్‌ సాల్ట్‌ సత్యాగ్రహ మెమోరియల్‌’ను ప్రతి భారతీయుడు ఒక్కసారైనా సందర్శించి తీరాలి. 

పోర్టు బ్లెయిర్‌: బిగించిన ఉక్కు పిడికిలి
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ నాయకుల త్యాగాలను తలుచుకుంటాం. వారితోపాటు లక్షలాది మంది సామాన్యులు కనీస గుర్తింపుకు కూడా నోచుకోకుండా జీవితకాలం పాటు జైల్లో మగ్గి దేశం కోసం ప్రాణాలు వదిలారు. వారికి నివాళి అర్పించాలంటే అండమాన్‌ దీవుల రాజధాని నగరం పోర్టు బ్లెయిర్‌లోని సెల్యూలార్‌ జైలును సందర్శించాలి. ఇది నేషనల్‌ మెమోరియల్‌ మాన్యుమెంట్‌. వీర సావర్కర్‌ వంటి ఎందరో త్యాగధనులు జైల్లో ఎంతటి దుర్భరమైన జీవితాన్ని గడిపారో కళ్ల ముందు మెదిలి గుండె బరువెక్కుతుంది. వాళ్లు ధరించిన గోనె సంచుల దుస్తులు, ఇనుస సంకెళ్లు, నూనె తీసిన గానుగలు వారిలోని జాతీయత భావానికి, కఠోరదీక్షకు నిదర్శనలు.

జలియన్‌ వాలాబాగ్‌: డయ్యర్‌ మిగిల్చిన చేదు జ్ఞాపకం
బ్రిటిష్‌ పాలకుల చట్టాలను వ్యతిరేకిస్తూ సమావేశమైన ప్రజల మీద జనరల్‌ డయ్యర్‌ ముందస్తు ప్రకటన లేకుండా విచక్షణరహితంగా కాల్పులు జరిపిన ప్రదేశం పేరు జలియన్‌ వాలాబాగ్‌. ఇది పంజాబ్, అమృత్‌సర్‌లో ఉంది. వేలాది మంది ప్రాణాలను హరించిన దుర్ఘటన 1919, ఏప్రిల్‌ 13వ తేదీన జరిగింది. దేశం కోసం నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన వారి జ్ఞాపకార్థం స్మారకం, అమరజ్యోతి, ప్రతీకాత్మక శిల్పాలు ఉన్నాయి. మౌనంగా నివాళులు అర్పించే లోపే మనోఫలకం మీద ఆనాటి బాధాకరమైన దృశ్యం కళ్ల ముందు నిలిచి, హృదయం ద్రవించిపోతుంది. మనదేశ చరిత్రలో అత్యంత కిరాతకుడిగా ముద్ర వేసుకున్న జనరల్‌ డయ్యర్‌ మీద బ్రిటిష్‌ ప్రభుత్వం... జలియన్‌ వాలా బాగ్‌ సంఘటన ఆధారంగా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది.

ఝాన్సీ: వీర తిలకం
మనకు ఝాన్సీ పేరుతోపాటు రాణి లక్ష్మీబాయ్‌ పేరు పలకనిదే సంపూర్ణంగా అనిపించదు. బ్రిటిష్‌ పాలకుల మీద తొలినాళ్లలో కత్తి ఎత్తిన వీరనారి లక్ష్మీబాయ్‌. తొలి స్వాతంత్య్ర సమరంలో లక్ష్మీబాయ్‌ బ్రిటిష్‌ సేనలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించింది. ఆమె స్మారకాలు మూడు చోట్ల ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ కోట, నాటి ఝాన్సీ రాజ్యంలోని (మధ్యప్రదేశ్‌) పూల్‌బాగ్‌లో ఆమె సమాధి, స్మారక చిహ్నాలున్నాయి. వారణాసిలో ఆమె పుట్టిన చోట కొత్తగా మరో స్మారకనిర్మాణం జరిగింది. ఇందులో మణికర్ణిక పుట్టుక, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాణిగా బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఘట్టాలన్నీ కనిపిస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పర్యటించి తీరాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. 

బారక్‌పోర్‌: మంగళ్‌పాండే పేల్చిన తుపాకీ
కోల్‌కతాలోని బారక్‌పోర్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో మంగళ్‌పాండే జ్ఞాపకార్థం ‘షాహీద్‌ మంగళ్‌ పాండే మహా ఉద్యాన్‌’ పేరుతో విశాలమైన పార్కును నిర్మించారు. మంగళ్‌పాండే బ్రిటిష్‌ అధికారుల మీద దాడి చేసిన తర్వాత అతడిని ఉరితీసిన ప్రదేశం ఇది. ఈస్టిండియా కంపెనీలో సిపాయిగా చేరిన పాండే సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర వహించాడు. పాండేని బ్రిటిష్‌ పాలకులు 1857, ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీన ఉరితీశారు. ఆ ప్రదేశంలో ఆయన స్మారక చిహ్నం ఉంది. 

మరిన్ని వార్తలు