జెండా పండుగ వంటలు

15 Aug, 2021 05:00 IST|Sakshi

స్వాతంత్య్ర దినోత్సవం... మువ్వన్నెల జెండా దేశమంతా రెపరెపలాడుతుంది. ఇంటింటా దేశభక్తి వెల్లివిరుస్తుంది. పిల్లలంతా మిఠాయిలు పంచుకుంటారు. మువ్వన్నెల వంటలు తయారు చేసి, జాతీయజెండాకు వందనం చేద్దాం.


తిరంగా ఢోక్లా 

కావలసినవి: బియ్యం – 3 కప్పులు; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; పుల్ల పెరుగు – కప్పు; అల్లం తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; బేకింగ్‌ సోడా – అర టేబుల్‌ స్పూను; పుదీనా తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 2; పసుపు – టీ స్పూను; మిరప కారం– టేబుల్‌ స్పూను; ఆవాలు – టీ స్పూను; నువ్వులు – టేబుల్‌ స్పూను

తయారీ:
∙బియ్యం, సెనగ పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, విడివిడిగా సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి 
∙నీరంతా ఒంపేసి మిక్సీలో వేసి విడివిడిగా గారెల పిండిలా ఉండేలా పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి 
∙పుల్ల పెరుగు, కొద్దిగా వేడినీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, ఆరుగంటలసేపు పిండిని వదిలేయాలి 
∙మిక్సీలో పుదీనా, పచ్చి మిర్చి వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి 
∙నానిన పిండికి ఉప్పు, అల్లం తురుము జత చేయాలి 
∙పిండిని మూడు సమాన భాగాలుగా చేసుకోవాలి 
∙ఒక భాగం పిండికి పసుపు, మిరప కారం జత చేయాలి 
∙ఒక భాగానికి మెత్తగా చేసిన పుదీనా, పచ్చిమిర్చి ముద్ద జత చేయాలి 
∙ఒక పాత్ర తీసుకుని నూనె పూయాలి 
∙ముందుగా పుదీనా జత చేసిన మిశ్రమాన్ని సమానంగా వేసి, ఆవిరి మీద రెండు నిమిషాలు ఉడికించాలి 
∙పాత్రను బయటకు తీసి, దాని మీద, తెల్లటి పిండి వేసి మళ్లీ ఆవిరి మీద ఉంచి రెండు నిమిషాల తరవాత ఆ పాత్రను బయటకు తీయాలి 
∙పసుపు, మిరపకారం జత చేసిన మిశ్రమాన్ని సమానంగా పరిచి ఆవిరి మీద బాగా ఉడికించి దింపేయాలి 
∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక నువ్వులు కూడా వేసి కొద్దిగా వేయించి తీసేసి, ఢోక్లా మీద సమానంగా పోయాలి.


కాజు కట్లీ

కావలసినవి: జీడి పప్పు – 2 కప్పులు; నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు; పాలు – టేబుల్‌ స్పూను; పంచదార పాకం కోసం;
నీళ్లు – కప్పు; పంచదార – కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఫుడ్‌ కలర్‌ – ఆకుపచ్చ, ఆరెంజ్‌ రంగులు (చిటికెడు చొప్పున)

తయారీ: 
ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి పంచదార కరిగాక, ఏలకుల పొడి జత చేసి, ముదురు పాకం పట్టి పక్కన ఉంచాలి 
∙జీడిపప్పును మిక్సీలో వేసి మధ్యమధ్యలో ఆపుతూ తిప్పి, ఆ పొడిని జల్లించాలి 
∙ఇలా మొత్తం జీడిపప్పులను మిక్సీ పట్టి జల్లెడ పట్టి పక్కన ఉంచాలి 
∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పు పొడి వేసి దోరగా వేయించాలి 
∙పంచదార పాకం జత చేసి సన్నటి మంట మీద ఆపకుండా కలుపుతుండాలి 
∙బాగా దగ్గర పడి, అంచులను వదిలేస్తుండగా దింపేసి, కొద్దిగా  చల్లారనివ్వాలి 
∙చేతికి నెయ్యి రాసుకుని, పాలు జత చేసి, మెత్తగా అయ్యేవరకు కలిపి మూడు భాగాలుగా చేసుకోవాలి 
∙ఒక భాగానికి ఆకు పచ్చ రంగు రెండు చుక్కలు, ఆరెంజ్‌ రంగు రెండు చుక్కలు విడివిడిగా కలిపి పక్కన ఉంచాలి 
∙ముందుగా ఆకుపచ్చరంగు, ఆ తరవాత తెలుపు రంగు, చివరగా కాషాయ రంగు ఉంచి చేతితో జాగ్రత్తగా అదిమి, సుమారు పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తీసి, కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి.


కోకోనట్‌ గుల్కండ్‌

కావలసినవి: తెలుపు కోసం, తాజా కొబ్బరి తురుము – 3 అర కప్పులు; స్వీట్‌ కండెన్స్‌డ్‌ మిల్క్‌ – 3 పావు కప్పులు; గుల్కండ్‌ రోజ్‌ పెటల్‌ ప్రిజర్వ్‌ – ఒక టేబుల్‌ స్పూను; నెయ్యి – మూడు టీ స్పూన్లు; ఎండు కొబ్బరి తురుము – రోలింగ్‌ కోసం తగినంత; క్యారట్‌ ముక్కలు – పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా; గ్రీన్‌ ఫుడ్‌కలర్‌ – కొద్దిగా. 

తయారీ: 
తెల్ల లడ్డు... స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక క్యారట్‌ ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి 
∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక కొబ్బరి తురుము వేసి, సన్నటి మంట మీద దోరగా (రంగు మారకుండా) వేయించాలి 
∙కండెన్స్‌డ్‌ మిల్క్‌ జత చేసి, ఆపకుండా కలపాలి 
∙అంచులు విడుతుండగా, దింపి చల్లారనిచ్చాక మూడు భాగాలు చేయాలి 
∙ఒక భాగం నుంచి కొద్దిగా చేతిలోకి తీసుకుని, మధ్యలో కొద్దిగా గుల్‌కండ్‌ ఉంచి లడ్డూ మాదిరిగా చేసి, ఎండు కొబ్బరి పొడిలో దొర్లించి పక్కన ఉంచాలి (ఇలా తెలుపు లడ్లు సిద్ధం చేసుకోవాలి) 
∙రెండో భాగానికి క్యారట్‌ మిశ్రమం, కొద్దిగా ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ జత చేసి లడ్లు చేసి, కొబ్బరి పొడిలో దొర్లించితే కాషాయ రంగు లడ్లు తయారైనట్లే 
∙మూడో భాగానికి ఆకు పచ్చ ఫుడ్‌ కలర్‌ జత చేసి లడ్లు తయారుచేసుకుని, కొబ్బరి పొడిలో దొర్లించితే మువ్వన్నెల కోకోనట్‌ గుల్‌కండ్‌ రెడీ.

మరిన్ని వార్తలు