దేశమాతకు గళార్చన స్వతంత్ర గేయాలు

15 Aug, 2021 01:31 IST|Sakshi

‘‘భరతమాత బిడ్డలం అందరం భరతమాత బిడ్డలమేమందరం కలసి ఉంటె కలదు సుఖం కలహిస్తే దుఃఖమయం...’’

హైదరాబాద్, గచ్చిబౌలిలో ఓ ప్రసిద్ధ పాఠశాల. పేరు నాజర్‌ బాయ్స్‌ స్కూల్‌. దానికి ఎదురుగా ఓ అధునాతనమైన అపార్ట్‌మెంట్‌ లో దేశభక్తి గీతాలాపన జరుగుతుంటుంది. కొన్నేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఓ పెద్దావిడ దేశభక్తి గీతాలు ఆలపిస్తున్నారు. ఆ పెద్దావిడ పేరు గుంటూరు ఈశ్వరమ్మ.

పాట ఆగకూడదు!
అరవై ఎనిమిదేళ్ల ఈశ్వరమ్మ కు మాటలతోపాటే పాటలు కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాళ్ల అమ్మ దమయంతికి పాటలు పాడడం ఇష్టం. ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లలను ఆడిస్తూ పాటలు పాడుతూనే ఉండేవారామె. అలా మొదలైన ఈశ్వరమ్మ పాట నేటికీ అంతే శ్రావ్యంగా జాలువారుతూనే ఉంది. ఇంట్లో వేడుకలు ఈశ్వరమ్మ పాట లేనిదే సంపూర్ణతను సంతరించుకోవు. ఆమె స్కూలుకెళ్లే రోజుల నుంచి ఆగస్టు 15, రిపబ్లిక్‌ డే, గాంధీ జయంతి... ఇలా ఏ వేడుక అయినా సరే ఈశ్వరమ్మ పాట తప్పకుండా ఉండేది.

ఆమె పాడడంతోపాటు ఆసక్తి ఉన్న పిల్లలకు నేర్పిస్తున్నారు కూడా. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాటలు పాడడానికి సిద్ధమవుతున్న పిల్లలకు ఆమె దేశభక్తి గేయాలు నేర్పిస్తున్నారు. ‘‘నా దగ్గర ఉన్న పాటల్లో చాలా పాటలు బయట ఎక్కడా దొరకవు. అంతమంచి పాటలు నా దగ్గరే ఆగిపోతే ఎలాగ? పిల్లలకు నేర్పిస్తే మరొక తరం తయారవుతుంది. నా దగ్గర నేర్చుకున్న పిల్లల్లో ఏ నలుగురైనా దీక్షగా నేర్చుకుని మరింత మందికి నేర్పిస్తే నాకదే తృప్తి’’ అన్నారు ఈశ్వరమ్మ.

పాటల పుటలు
ఈశ్వరమ్మది నల్గొండ జిల్లా, మిర్యాలగూడ. ఆమె చిన్నప్పటి నుంచి ఆటగా పాటలు పాడుతుండడంతో పదేళ్లకే మాస్టార్ని పెట్టి సంగీతం నేర్పించారు. ‘‘మా మాస్టారి పేరు పెంటపాటి సర్వేశ్వరరావు. ఆయన గేయ రచయిత కూడా కావడంతో పాటలు సొంతంగా రాసి మాకు నేర్పించేవారు. మా అమ్మ దగ్గర నేర్చుకున్నవి, నేను సేకరించినవి, మాస్టారు రాసిచ్చినవి అన్నీ కలిపి నా దగ్గర చాలా పాటలు ఉన్నాయి.  పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల్లో పడి హార్మోనియం మీటడం మర్చిపోయాను. కానీ పాడడం మర్చిపోలేదు. నేను చదివింది ఎనిమిదవ తరగతి వరకే. కానీ మా వారు తెలుగు పండిట్‌ కావడంతో ఖాళీగా ఉన్నప్పుడు పద్యాలు పాడుకోవడం ఆయన అలవాటు. అలా నేనూ పద్యాలు నేర్చుకున్నాను. పాటలు, పద్యాలు పాడి పాటలు రాయడం వచ్చేసింది. పిల్లల ను ఉయ్యాలలో వేసేటప్పుడు సొంతంగా పాటలు రాసి పాడాను. సంక్రాంతి ముగ్గుల పాటలు, బతుకమ్మ పాటలు... మొత్తం 15 పాటలు రాశాను.

జెండావందన గేయం
మా మిర్యాలగూడలో జెండావందనానికి నాలుగు రోజుల ముందే నేను పాట పాడడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని కబురు చేసేవాళ్లు. హైదరాబాద్‌లో మా అబ్బాయి ఇంట్లో.. అపార్ట్‌మెంట్‌ జెండా ఆవిష్కరణలో దేశభక్తి గేయాలు పాడుతున్నాను. కరోనా వల్ల గతేడాది అపార్ట్‌మెంట్‌ లో ఉండే వాళ్లలో చాలామంది పతాకావిష్కరణకు రాలేదు. నేను వెళ్లి పాటలు పాడాను. కార్యవర్గ సభ్యులు నాతో గొంతు కలిపారు’’ అన్నారు ఈశ్వరమ్మ.

అంతా నా బిడ్డలే!
ఈ ఏడాది పిల్లలకు పాటలను జూమ్‌ సెషన్స్‌లో నేర్పిస్తున్నారామె. ‘‘దేశమాతను గౌరవిస్తూ పాట పాడడానికి పిల్లలు ముందుకు రావడమే గొప్ప సంతోషం. అలా ముందుకొచ్చిన పిల్లలందరూ నా మనుమళ్లు, మనుమరాళ్ల వంటి వాళ్లే’’ అంటున్న ఈశ్వరమ్మ భరతమాతకు ప్రతిరూపంగా కనిపించారు.

– వాకా మంజులారెడ్డి
 

మరిన్ని వార్తలు