ప్రాణమిచ్చారు...  బడ్జెట్‌ను ఇవ్వలేమా!

30 Jan, 2021 09:08 IST|Sakshi
జెండర్‌ బడ్జెట్‌తోనే మహిళాభ్యున్నతి, మహిళల శ్రమకు గుర్తింపు 

చంకలో బిడ్డ. తలపై తట్ట. ఎండలో నడక. తల్లి కష్టపడుతోంది. అలసి ఒగురుస్తోంది. బిడ్డనో, తట్టనో.. ఒక భారం అందుకోమెందుకు? ఎవరైనా వచ్చి చెప్పాలి! ఆలోచన ఇవ్వాలి!!

పళ్లెం నిండా పరమాన్నాలు. పక్కనే పండ్లూ ఫలహారాలు.ఎదురుగా ఆకలిగొన్నమ్మ.పేగుల అరుపులపై కొంగు కప్పుకున్నమ్మ. ‘నువ్వు కూర్చోలేదేమిటి!’ అని అడగమెందుకని!‘పిల్లని తినమని అనవేమిరా..’ అని.. ఇంట్లో పెద్దవాళ్లొచ్చి చెప్పాలి. ఆలోచన కలిగించాలి!బడ్జెట్‌ కూడా ఏళ్లుగా తట్టనీ అందు కోలేదు..

‘నువ్వు కూడా వచ్చి తినూ..’ అనలేదు. స్త్రీ అనే ప్రాణి ఉందనే ఆలోచనే బడ్టెట్‌లో లేదు! అప్పుడొచ్చి ఆర్థికవేత్తలెవరో ఇచ్చిన ఆలోచనే..‘జెండర్‌ రెస్పాన్సివ్‌ బడ్జెటింగ్‌’.అంటే.. మహిళల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ వెయ్యడం. 

ఈసారి బడ్జెట్‌ మహిళల్ని ఎంతవరకు దృష్టిలో పెట్టుకోబోతోంది?! ఫిబ్రవరి 1 న బడ్జెట్‌. ఇప్పటికే రెడీ అయిపోయి ఉంటుంది. అందులో మహిళలకు ఎంతిచ్చారో, ఏమిచ్చారో రెండు రోజుల్లో తెలుస్తుంది! ఎప్పట్లా అయితే ఈసారి బడ్జెట్‌ ఉండేందుకు లేదు. ఉండటం అన్యాయం అవుతుంది. మహిళలకు మరింతగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ప్రణాళికలూ, ప్రభుత్వ విధానాలూ కాపాడలేని విధంగా మహిళలు ఈ ఏడాది కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడారు. తమ ప్రాణాలను పణం గా పెట్టారు. ఆ ‘రుణం’ తీర్చుకునే విధంగా బడ్జెట్‌ ఉండాలి. దేశ జనాభాలో మహిళ లు 48 మంది ఉన్నా, ‘జాతీయ స్థూల ఉత్పత్తి’ శ్రమలో మహిళల రెక్కల కష్టం 17 శాతం వరకు ఉన్నా..  గత 2020–21 బడ్జెట్‌లో మహిళల కోసం కేటాయించింది 5 శాతం కన్నా తక్కువే! ఇంట్లో మహిళల శ్రమ, చాకిరి ఎలాగూ ‘ఎకానమీ’ లెక్కల్లోకి రావు.

ఆ పదిహేడు శాతానికైనా తిరుగు ప్రతిఫలం ఉండాలి. అది ఈ బడ్జెట్‌లో ఉండబోతోందా? ఉండబోవడం కాదు. ‘ఉండాలి’ అనే నిబంధన ఉంది. ‘జెండర్‌–రెస్పాన్సివ్‌ బడ్జెటింగ్‌ (జి.ఆర్‌.బి) ఆ నిబంధన. 2001 నుంచి ఆలోచించి, 2006లో ఈ జి.ఆర్‌.బి.ని బడ్జెట్‌లో తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ‘బడ్జెట్‌ ఎలాగైనా ఉండొచ్చు. మహిళలకు ప్రాధాన్యం లేకుండా మాత్రం ఉండకూడదు’ అని నాడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేసిన సిఫారసును ఆర్థికశాఖ పరిగణనలోకి తీసుకోవలసిందే. స్త్రీ పురుష అసమానతలు, మహిళలపై హింస, లైంగిక వేధింపులు, వేతనాల్లోని వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వం అనుసరించ వలసిన విధానాలలో ఒకటిగా ‘జెండర్‌–రెస్పాన్సివ్‌ బడ్జెటింగ్‌’ ఒక శక్తిమంతమైన సాధనం అయింది.  

బడ్జెట్‌ను ఎలా రూపొందిస్తారో తెలిసిందే. వచ్చేదింత, పోయేదింత అనే అంచనాలు ఉంటాయి. జెండర్‌ బడ్జెట్‌ అందుకు భిన్నమైనది. ఇందులో పార్ట్‌–ఎ, పార్ట్‌–బి అని ఉంటాయి. పార్ట్‌ ఎ లో ప్రత్యేకంగా మహిళలు, బాలికల అభివృద్ధి కోసమే దోహదపడే పథకాలకు, కార్యక్రమాలకు ప్రాధాన్యాలు ఉంటాయి. పార్ట్‌ బి లో మహిళలు, బాలికల సంక్షేమం కోసం ప్రత్యేకించిన కేటాయింపులు ఉంటాయి. పార్ట్‌ బికి ఎక్కువ వాటా ఉంటుంది. గత ఏడాది బడ్జెట్‌లో పార్ట్‌ ఎ, పార్ట్‌ బి కి కలిపి 1,43,461 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పెట్టి, అందులో పార్ట్‌ ఎ కి 28, 568 కోట్లు, పార్ట్‌ బి కి 1,14, 893 కోట్ల రూపాయలు కేటాయించారు. జెండర్‌ బడ్జెట్‌ ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారత. లైంగిక సమానత్వ సాధన. ఇవన్నీ కూడా విద్య, ఉపాధి, ఆరోగ్యంతో సమకూరుతాయి కనుక కరోనా పెంచిన అంతరాన్ని సరి చేసేందుకు కూడా ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ మూడింటికి ఎక్కువ నిధులు కేటాయించి ఉంటే సబబుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా.. జెండర్‌ బడ్జెట్‌ను ఒక ప్రభుత్వ విధానంగా కాక, ప్రభుత్వ నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించే వినూత్న ప్రణాళికలతో రూపొందించవలసిన అవసరం ఉందన్నది ఆర్థికవేత్తల సూచన. చూడాలి, ఈ ఏడాదిని మనం ‘జెండర్‌ బడ్జెట్‌’ కన్నా ఎక్కువదైన ‘ఉమన్‌ బడ్టెట్‌’గా చూడబోతున్నామేమో. అదే నిజమైతే అది వండర్‌ బడ్జెట్టే అవుతుంది.

మరిన్ని వార్తలు