ఎంపవర్‌మెంట్‌: డైనమిక్‌ సిస్టర్స్‌

27 Sep, 2022 00:54 IST|Sakshi

అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్‌ అండ్‌ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. భరించలేని వెన్నునొప్పితో బాధ పడిన షాలిని తన పరిశోధనలో భాగంగా తెలుసుకున్న విషయం... హెంప్‌ మొక్కకు వెన్నునొప్పిని తగ్గించే శక్తి ఉంది అని. అది ప్రయోగాత్మకంగా నిరూపణ కావడంతో హెంప్‌ ఉత్పత్తుల విలువను ప్రపంచానికి పరిచయం చేయడానికి సోదరి జయంతి భట్టాచార్యతో కలిసి ‘ఇండియా హెంప్‌ అండ్‌ కంపెనీ’కి శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది.

షాలిని భట్టాచార్య నిలకడగా ఒకచోట ఉండే రకం కాదు. స్పెయిన్‌లో ఉంటున్న శాలినికి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం అంటేనే ఎక్కువ ఇష్టం. అలాంటి షాలినికి కష్టం వచ్చిపడింది.
భరించలేని వెన్నునొప్పి! బయట అడుగు వేయలేని పరిస్థితి. చిన్న బ్యాగ్‌ను ఇటు నుంచి అటు పెట్టాలన్నా వీలయ్యేది కాదు. హాస్పిటల్స్‌ చుట్టూ తిరగడం మొదలైంది. ఏదో కాస్త తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉంటున్న సోదరి జయంతితో కలిసి తన సమస్యకు పరిష్కారాన్ని వెదకడానికి పరిశోధన మొదలుపెట్టింది. ఈ పరిశోధన క్రమంలో వారికి ఎప్పుడో విన్న హెంప్‌ (ఒక రకమైన కనబిస్‌ మొక్క) గుర్తుకు వచ్చింది.

వేసవి సెలవులు వస్తే చాలు...కొండకోనల్లో తిరగడం తమ అలవాటు. అలా వెళ్లినప్పుడు అక్కడి మొక్కల గురించి స్థానికుల నుంచి ఆసక్తికరమైన వివరాలు తెలుసుకునేవారు. ఒకసారి హిమాలయాలో విస్తారంగా పెరిగే, విస్తృత ఔషధగుణాలు ఉన్న హెంప్‌ గురించి విని ఉన్నారు.
ఆ జ్ఞాపకంతో హెంప్‌ గురించి లోతైన పరిశోధన ప్రారంభించారు. వెన్నునొప్పిని తగ్గించే సామర్థ్యం ఈ మొక్కకు ఉన్నట్లు ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు.

ఆ సమయంలోనే వారికి ఒక ఆలోచన వచ్చింది... అజ్ఞాతంగా ఉన్న హెంప్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి దాని ఔషధశక్తి ఏమిటో తెలియజేయాలని. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం ఇండియా హెంప్‌ అండ్‌ కంపెనీ. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ హెంప్‌ ట్రేల్‌ మిక్స్, హెంప్‌ హార్ట్, ప్రొటీన్‌ పౌడర్, హెంప్‌ ఆయిల్‌... మొదలైన న్యూట్రీషన్‌–ప్యాక్‌డ్‌ హెంప్‌ ప్రాడక్స్‌ను తీసుకువచ్చింది.

‘షార్క్‌ ఇండియా రియల్టీ షో’ నుంచి ఆహ్వానం అందడాన్ని ఔత్సాహిక వ్యాపారవేత్తలు గొప్పగా భావిస్తారు. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఒక విశాలవేదికగా షార్క్‌ ఇండియా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫండింగ్‌ విషయంలో మేలు జరుగుతుంది. ‘ఇండియా హెంప్‌ అండ్‌ కంపెనీ’ కో–ఫౌండర్‌గా జయంతి భట్టాచార్యకు షార్క్‌ ఇండియా నుంచి ఆహ్వానం లభించింది. అడ్వర్‌టైజింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న జయంతికి తమ ఉత్పత్తుల గురించి ఎలా ప్రచారం చేసుకోవాలో అనేది తెలియని విషయమేమీ కాదు. ఆమె ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది. రకరకాల దేశాల నుంచి ఇన్వెస్టర్‌లు ముందుకు వచ్చారు. అయితే సరిౖయెన డీల్‌ కుదరకపోవడంతో వాటిని ఆమోదించలేదు. ఫండింగ్‌ మాట ఎలా ఉన్నా ‘షో’కు వచ్చిన ప్రముఖుల సూచనలతో బ్రాండింగ్‌ స్ట్రాటజీని మార్చుకున్నారు.

ఆ తరువాత సరిౖయెన ఇన్వెస్టర్లు వచ్చారు. కంపెనీ విజయపథంలో దూసుకెళుతుంది. నిజానికి హెంప్‌ ఉత్పత్తులను మార్కెట్‌ లో సక్సెస్‌ చేయడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. మన దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం హెంప్‌ సాగు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట అనుమానం మిగిలే ఉంది. దీన్ని తీసివేయడానికి ప్రచార రూపంలో గట్టి ప్రయత్నాలు ప్రారంభించి విజయం సాధించారు ఈ డైనమిక్‌ సిస్టర్స్‌. ‘ప్లానెట్‌ ఫ్రెండ్లీ ప్లాంట్‌ అయిన హెంప్‌పై మాకు ఉన్న నమ్మకం వృథాపోలేదు. మా వ్యాపారం విజయవంతమైంది అనేదానికంటే, ఇండియా హెంప్‌ అండ్‌ కంపెనీ ద్వారా హెంప్‌లోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలుసుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది షాలిని.

మరిన్ని వార్తలు