వెలుగుదారులు.. అసామాన్యులు

9 Feb, 2022 19:51 IST|Sakshi
సోలార్‌ కారు

సోలార్‌ పవర్‌.. సౌరశక్తి. ఎంత కావాలంటే అంత. పూర్తిగా ఉచితం. చిన్న పెట్టుబడితో పర్యావరణానికి మేలు చేసే ఎంతో శక్తిని ఉచితంగా పొందవచ్చు. దీనికంతటికీ మూలం సౌర వ్యవస్థ. సూర్యుడి బాహ్య వాతావరణ పొరలో 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంది. అంటే భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటా వాట్ల శక్తి గల సూర్యకిరణాలు వెలువడతాయి. వీటిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. ఇలా ప్రకృతి ఉచితంగా అందించే సౌర శక్తిని ఫొటో వోల్టాయిక్‌ ఘటాల ద్వారా విద్యుత్తుగా మార్చుతారు. 

చాలా కాలం క్రితమే సోలార్‌ విద్యుత్‌ను గుర్తించినా.. అమల్లో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. సులభంగా దొరుకుతుంది కదా.. అని బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడ్డాం. హైడ్రో పవర్‌ అంటే జలవిద్యుత్‌ ఉన్నా.. దానిపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి. అందుకే సోలార్‌ విద్యుత్‌పై దృష్టి పెట్టింది లోకం. అందుకే ఇప్పుడు కొత్త నినాదం ఊపందుకుంది. ఒకే సూర్యుడు – ఒకే ప్రపంచం – ఒకే గ్రిడ్‌. అంటే వీలైనంత సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. అన్ని దేశాల విద్యుత్‌ వ్యవస్థలను అనుసంధానం చేయగలిగితే.. పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లమవుతాం. ఎండకాసే దేశాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌.. చీకట్లు నిండిన చోట వెలుగులు నింపుతాయి.

ప్రపంచవ్యాప్తంగా సోలార్, పవన విద్యుత్‌ ఉత్పత్తిలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఇండియా డాటా పోర్టల్‌ ప్రకారం గత ఏడున్నరేళ్లలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఏకంగా 2.6 గిగా వాట్ల నుంచి 46 గిగావాట్ల సామర్థ్యం స్థాయికి చేరింది. ఇక పవన విద్యుత్‌ ఉత్పత్తి 5.5 గిగా వాట్లకు చేరింది. ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ఏకంగా 26 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. రైతుల సాగు కోసం వినియోగించే సోలార్‌ పంప్‌లు 20 రెట్లు పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లలో మూడు మన దేశంలో ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద ప్లాంట్, మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌లో భాడ్లా అనే గ్రామంలో నిర్మించిన ప్లాంట్‌. దీన్ని 2,700 మెగావాట్ల సామర్థ్యంతో 14 వేల ఎకరాలలో నిర్మించారు. ఇక కర్ణాటకలో 13 వేల ఎకరాలలో 2,050 మెగవాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్‌కు నాలుగో స్థానం దక్కింది. ఏపీలోని అనంతపురం జిల్లా నంబులపులకుంటలోనూ భారీ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మించారు. దీని సామర్థ్యం 1200 మెగావాట్లు. ఇటీవల స్మార్ట్‌ సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్‌  ఎన్విరాన్‌ మెంట్‌ విభాగంలో కైలాసగిరి రిజర్వాయర్‌లో నిర్మించిన ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ప్లాంట్‌ 3వ ర్యాంక్‌ను సాధించింది. 6 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ వినియోగంలోకి రావడంతో తిరుపతి కార్పొరేషన్‌ కు భారీగా బిల్లు తగ్గింది. ఏకంగా రూ.1.75 కోట్ల మేర సోలార్‌ విద్యుత్‌ను వినియోగిస్తుండడంతో మరిన్ని సోలార్‌ ప్లాంట్లకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

సూర్యశక్తిని ఒడిసి పట్టుకుంటున్నది  ప్రభుత్వాలే కాదు.. సంస్థలతో పాటు వ్యక్తులు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు.

పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి, ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తీసుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్‌  ప్రిన్స్‌ విలియం ఈ ‘ఎర్త్‌ షాట్‌ ప్రైజ్‌’ను నెలకొల్పారు. గతేడాది ప్రారంభించిన ఈ ప్రైజ్‌ ఫైనలిస్టుల జాబితాలో మన దేశానికి చెందిన వాళ్లు ఇద్దరున్నారు.

అందులో ఒకరు తిరువణ్ణామళైలోని 9వ తరగతి విద్యార్థిని వినీష. చిన్నప్పటి నుంచే తనకు పర్యావరణమంటే ఎంతో ప్రేమ. దీనికి తోడు సైన్సుపై ఆసక్తి. ఈ రెండింటి కలబోతగానే సోలార్‌ ఐరన్‌ కార్ట్‌ను తయారు చేసిందీ టాలెంటెడ్‌ గర్ల్‌. ఓ రోజు స్కూల్‌ నుంచి తిరిగి వస్తూ ఇంటి దగ్గర ఇస్త్రీ బండి వ్యాపారిని చూసింది వినీష. బాగా మండించిన బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో వేసి దుస్తులు ఇస్త్రీ చేస్తున్న పద్ధతిని గమనించింది. ఇంటికొచ్చాక బొగ్గు మండించడం వల్ల కలిగే నష్టాలను ఇంటర్నెట్‌లో వెతికింది. బొగ్గును ఉత్పత్తి చేయాలంటే చెట్లను నరకాలి. కట్టెలను కాల్చాలి. ఆ పొగతోపాటు కార్బన్‌  మోనాక్సైడ్‌ అనే విషవాయువు వెలువడుతుంది. ఇవన్నీ తెలుసుకున్నాక.. వినీషలో కొత్త ఆలోచన మొదలయింది. ఆ తపన నుంచి వచ్చిన ఆవిష్కరణే ‘సోలార్‌ ఐరన్‌  కార్ట్‌’. ఈ మొబైల్‌ ఇస్త్రీ బండి సోలార్‌ విద్యుత్‌ను ఉపయోగించుకుని పని చేస్తుంది. ఈ ప్రయత్నానికి ఎర్త్‌ షాట్‌ ప్రైజ్‌ దిగి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 750 ఎంట్రీల్లో తుది అంచెకు చేరుకున్న 15లో మరొకటి ఢిల్లీకి చెందిన ‘విద్యుత్‌ మోహన్‌’ ప్రాజెక్టు. విద్యుత్‌ మోహన్‌ .. గత కొన్నాళ్లుగా దేశ రాజధాని ఎదుర్కొంటున్న వాయు కాలుష్యాన్ని గమనిస్తున్నాడు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఓ వైపు ఉత్తరాది పొలాల్లోని మంటల నుంచి వచ్చే పొగ.. దానికి ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం.. అన్నీ కలగలసి ఊపిరాడకుండా చేస్తున్నాయి. టకా అంటే డబ్బు, చార్‌ అంటే బొగ్గు లేదా కార్బన్‌ .. కాలుష్యం నుంచి డబ్బు అన్న కాన్సెప్ట్‌లో టకాచార్‌ అనే ఓ సంస్థను ప్రారంభించాడు మోహన్‌ . దీని ప్రధాన ఉద్దేశం కార్బన్‌  ఉద్గారాలను తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టును నడుపుతున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తయ్యే చెత్త, చెదారం, పంట కోసిన తర్వాత ఉండే మొదళ్లు, ఇతర వ్యర్థాలను సాధారణంగా చాలా మంది రైతులు తగులబెడతారు. అలా తగులబెట్టే బదులు ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ ఓ యంత్రంలో వేయడం ద్వారా బయోచార్‌గా మారుతాయి. బయోచార్‌ను భూసారాన్ని పెంచే ఎరువుగా రైతులు తిరిగి వాడుకోవచ్చు. తద్వారా పంట వ్యర్థాలు మళ్లీ భూమిలోకి చేరడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. (క్లిక్: రోజుకు ఎన్ని వేల లీటర్ల గాలిని పీల్చుకొని వదులుతామో తెలుసా?)

ముంబైకి చెందిన మధురిత గుప్తాది మరో విజయగాథ. ముంబైలో వెటర్నరీ డాక్టర్‌ అయిన మధురిత గుప్తా ఓ వైల్డ్‌ లైఫ్‌ సంస్థలో వ్యవస్థాపక సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్స్‌ను తగులబెట్టడం లేదా భూమిలో పారేయడాన్ని గమనించారు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని నివారించాలన్న ఆలోచన కలిగింది. శానిటరీ ప్యాడ్స్‌ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతోంది. ఐఐటీలో చదివి ఇంజినీర్‌గా పని చేస్తోన్న తన తమ్ముడు రూపన్‌ తో కలిసి సోలార్‌ లజ్జా అనే యంత్రాన్ని రూపొందించారు మధురిత. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్‌ను ఈ మెషీన్‌ లో వేయడం వల్ల క్షణాల్లో వాటిని బూడిదగా మార్చవచ్చు. ఇతర మెషిన్‌ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్‌ . సోలార్‌ శక్తితో నడుస్తుంది. 

ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్‌ పై ఉన్న సోలర్‌ ప్యానల్స్‌ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్‌ ను రీచార్జ్‌ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్‌కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపోన్స్‌, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్‌  బూడిద చేస్తుంది. ప్రకృతికి మంచి చేసే మెషిన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్‌ లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్‌  హెల్త్‌కేర్‌ ఇన్నోవేషన్‌ లో ‘ఇన్‌ స్ప్రెన్యూర్‌ 3.0’, యూనైటెడ్‌ నేషన్స్‌ అందించే టాప్‌టెన్‌  ఇన్నోవేషన్స్‌ విమెన్‌  అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్‌ ఇన్నోవేషన్‌  సొసైటీ అందించే టాప్‌ టెన్‌ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్‌ లజ్జా చోటు దక్కించుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హరియాణా, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చారు. ఇప్పుడు జర్మనీ, స్వీడన్, స్పెయిన్‌ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. (క్లిక్: ఆర్‌ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్‌ 500 ఎం.జీ దాటితే!)

గుజరాత్‌ వడోదర జిల్లాకు చెందిన నీల్‌ షా వయస్సులో చిన్నోడయినా.. సమాజానికి పెద్ద పరిష్కారం చూపించే పనిలో పడ్డాడు. ఇంటర్‌ చదువుతున్న నీల్‌ది ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం. అయితే మాత్రం ఆవిష్కరణలపై ఆసక్తి తగ్గించుకోలేదు నీల్‌షా. ఓ సారి స్కూల్లో ప్రాజెక్ట్‌ కింద అసైన్‌ మెంట్‌ ఇచ్చారు. అందులో భాగంగా సోలార్‌ సైకిల్‌ రూపొందించాడు. రూ. 300లతో పాత సైకిల్‌ కొనుగోలు చేసిన నీల్‌షా.. దానికి రెండు సోలార్‌ ప్యానెళ్లను అమర్చాడు. ఒక సారి చార్జింగ్‌ చేస్తే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఈ సైకిల్‌. 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ సైకిల్‌.. పల్లెల్లో పేద వర్గాలకు ఎంతో ఉపయోగకరం. తమిళనాడులోని మధురైకి చెందిన ధనుష్‌ కూడా ఇలాంటి సైకిల్‌నే తయారు చేశాడు, కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చదివిన ధనుష్‌.. తాను తయారు చేసిన సైకిల్‌ ఒక్కసారి చార్జింగ్‌ పెడితే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చూపించాడు. కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు రుపాయి కన్నా తక్కువే.


కేరళ పోలీసులకు వినూత్న ఆలోచన వచ్చింది. రోడ్లపై గంటల కొద్దీ నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్‌ పోలీసులకు సోలార్‌ గొడుగులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ గొడుగు రెండు రకాలుగా పని చేస్తుంది. మండుటెండల్లో డ్యూటీ చేసే పోలీసులకు నీడ ఇస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేలా అందులోనే ఫ్యాన్‌ ఉంటుంది. అంటే గొడుగుపైన సోలార్‌ ప్యానెల్, గొడుగు కింద బ్యాటరీ. ఇదే టెంట్‌లో కింద లైటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. రాత్రి పూట కూడా పోలీసులకు ఇది ఉపయోగపడుతుంది. ఎర్నాకుళం జిల్లాలో మొదలైన ఈ ప్రాజెక్టును మరిన్ని జిల్లాలకు విస్తరించారు కేరళ పోలీసులు. (క్లిక్: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే!)

ఇప్పుడంటే ఎలక్ట్రిక్‌ కార్ల గురించి మాట్లాడుతున్నారు కానీ.. అయిదేళ్ల కిందటే సోలార్‌ కార్‌ను తయారు చేశారు కర్ణాటకలోకి మణిపాల్‌ యూనివర్సిటీ విద్యార్థులు. పూర్తిగా సౌర విద్యుత్‌తో నడిచే ప్రోటో టైప్‌ సోలార్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ను రూపొందించారు. సోలార్‌ మొబిల్‌ పేరిట రూపొందించిన ఈ కారుకు టాటా పవర్‌ తమ వంతుగా సహకారం అందించింది. అనుదీప్‌ రెడ్డి, జీత్‌ బెనర్జీ, వరుణ్‌ గుప్తా, శివభూషణ్‌ రెడ్డి, సులేఖ్‌ శర్మలు కలిసి రూపొందించిన ఈ కారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి చార్జింగ్‌ పూర్తయితే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే సమయంలో చార్జింగ్‌ చేసుకోగలదు. సూర్యరశ్మితో నడిచే కార్లను అభివృద్ధి చేసేందుకు విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్ల కోసారి వరల్డ్‌ సోలార్‌ చాలెంజ్‌ పేరుతో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్‌ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్‌ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలో డార్విన్‌ నుంచి అడిలైడ్‌ వరకు 3021 కిలోమీటర్ల పాటు ఈ పోటీ జరుగుతుంది. (చదవండి: ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?)

ఇవే కాదు.. సౌరశక్తితో మరెన్నో వినూత్న ఆవిష్కరణలు మన చుట్టున్నవాళ్లు చేస్తున్నారు. భవిష్యత్తులో మనకెన్నో పర్యావరణ అనుకూల పరిష్కారాలు చూపించనున్నారు. 

- శ్రీనాథ్‌ గొల్లపల్లి
సీనియర్‌ అవుట్‌పుట్‌ ఎడిటర్, సాక్షి టీవీ
g.srinath@sakshi.com

మరిన్ని వార్తలు