మహిళా ఫైటర్‌ పైలట్‌ల చేతికి మిగ్‌ 29

21 Mar, 2021 00:41 IST|Sakshi
భారత వాయు సేనలోని తొలి ముగ్గురు మహిళా ఫైటర్‌ పైలట్‌లు భావనాకాంత్, అవనీ చతుర్వేది, మోహనాసింగ్‌ 

మహిళ చేతికి మిగ్‌ 29 

పురుషులు ఏదైనా టాస్క్‌ పూర్తి చేస్తే టార్గెట్‌ చుట్టుపక్కలవి కూడా అన్యాయంగా ధ్వంసం అయిపోతాయి. కొల్లాటరల్‌ డ్యామేజ్‌! మహిళలు అలాక్కాదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి క్షణాల్లో పక్కకు వచ్చేస్తారు. ఇది నిరూపణ అయిన సంగతే. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో తాజాగా ఒక అజ్ఞాత మహిళా ఫైటర్‌ పైలట్‌ కు మిగ్‌– 29 యుద్ధ విమానాన్ని నడపడంలో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఎంత ఎగువకు లేచి, ఎంత వాలున మలుపు తీసుకుని, ఎంత దిగువకు చేరి ఆపరేషన్‌ ‘పూర్తి’ చేయాలో కూడా ఆ మహిళా పైలట్‌ నేర్చుకుంటారు. బైసన్, సుఖోయ్, రఫెల్‌ అయ్యాయి. ఇప్పుడు ఎయిర్‌ ఫోర్స్‌ తన మహిళా ఫైటర్‌ పైలట్‌ల చేతికి మిగ్‌ 29ను అందించబోతోందన్న మాట! అసలు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఎంతమంది మహిళా ఫైటర్‌ పైలట్‌లు ఉన్నారు? ఎన్ని రకాల యుద్ధ విమానాలు ఉన్నాయి? యుద్ధం వస్తే కనుక కొల్లాటరల్‌ డ్యామేజ్‌ని తగ్గించడం కోసం మొదట గగనతలంలోకి ఎగరబోతున్నది మహిళా ఫైటర్‌ లేనా? 

భారత వాయుసేనలోని యుద్ధ విమానాల మహిళా పైలట్‌లు ఇప్పటికే మిగ్‌–21 బైసన్, సుఖోయ్‌–30, రఫేల్‌ వంటి ఫైటర్‌ జెట్‌లను నడుపుతున్నారు. క్షణాల్లో నిటారుగా లేచి, కనురెప్పపాటులో ఏటవాలుగా తిరిగి, చప్పున సమాంతర రేఖగా మారి, భూ ఉపరితలానికి దాదాపుగా దగ్గరగా దిగి, శత్రుస్థావరాలను ఒక్క ఉదుటన పేల్చేసి, రయ్యిన పైకి లేచి వచ్చే విన్యాసాలలో నైపుణ్యాన్ని సాధించినవారే వారంతా! ఇప్పుడిక మిగ్‌–29 వంతు. భూగోళమే దద్దరిల్లేలా పిడుగుపాటు వేగంతో కదలే ఈ యుద్ధ విమానాన్ని నడపడంలో తొలిసారి ఒక మహిళా ఫైటర్‌ పైలట్‌కు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐ.ఎ.ఎఫ్‌) శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే వాయుసేనలో ఉన్న ఫైటర్‌ పైలట్‌లలో ఆమె ఒకరైనప్పటికీ, ఆమె ఎవరన్నదీ ప్రస్తుతానికైతే గోప్యమైన సంగతే. బహుశా శిక్షణ పూర్తయ్యాకో, శిక్షణాసమయంలోనో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆమె పేరును బయటపెట్టవచ్చు. 


మిగ్‌–29 : భారత వాయుసేన బాహుబలి

తొంభై ఏళ్ల నుంచీ భారత వాయుసేన ఉన్నప్పటికీ ఇటీవల ఐదేళ్ల క్రితం మాత్రమే ఐ.ఎ.ఎఫ్‌ తొలిసారి మహిళల్ని ఫైటర్‌ పైలట్‌లుగా తీసుకుంది! భారత రక్షణ దళంలో అదొక చరిత్రాత్మక పరిణామం. అమ్మాయిలేంటీ, శత్రువు వెన్ను విరిచేందుకు గాలిలోకి యుద్ధ విమానాలను తిప్పడం ఏంటి అని అప్పుడే పురుష ప్రపంచం నొసలు విరిచింది. ఐ.ఎ.ఎఫ్‌ ఆ విరుపుల్ని పట్టించుకోలేదు. పైగా.. ఫైటర్‌ జెట్‌కి ఏం తెలుసు.. తనను నడుపుతోంది పురుష పైలటో, మహిళా పైలటో అని నవ్వేసి, స్త్రీ పురుషుల మధ్య జెండర్‌ యుద్ధవాతావరణాన్ని తేలికపరిచింది. ఐ.ఎ.ఎఫ్‌.లోని ఫైటర్‌ జట్‌లు ఒక్కోటీ ఒక్కో రకంగా ఉంటాయి. వాటిని ఒక్కో విధమైన ప్రత్యేక నైపుణ్యంతో నడపవలసి ఉంటుంది. వాటన్నింటిలో ఆరితేరిన మహిళా పైలట్‌లకు నేర్చుకోడానికి ఇప్పుడు మిగిలింది మిగ్‌–29 మాత్రమే. అందులోనూ శిక్షణ పొందితే భారత వాయుసేనకు ఇక కొండంత ధైర్యం. ఏ అమ్మాయి ఏ జెట్‌నైనా ‘డీల్‌’ చేయగలదు. ఎలాంటి అనూహ్య పరిస్థితిలోనైనా జెట్‌ను బయటికి తీయగలదు. చైనా, పాకిస్తాన్‌లను విశ్వసించలేని ప్రస్తుత తరుణంలో మహిళా పైలట్‌లకు ఇది అత్యవసర శిక్షణ. గత ఏడాది ఫ్లయిట్‌ లెఫ్ట్‌నెంట్‌ శివాంగి సింగ్‌కు ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న రఫేల్‌ యుద్ధ విమానాన్ని అప్పగించింది ఐ.ఎ.ఎఫ్‌.! హర్యానాలోని అంబాలాలో ఉన్న వైమానిక స్థావరం నుంచి రఫేల్‌ను నడపడంతో శివాంగి శిక్షణ పొందుతున్నారు. 

భారత వాయుసేన 2015 నుంచీ తీసుకుంటూ వచ్చిన పది మంది మహిళా ఫైటర్‌ పైలట్‌లలో శివాంగి ఒకరు. ఈ పదిమందికి కూడా మిగ్‌–21తో శిక్షణ ప్రారంభం అయింది. తర్వాత మిగతా యుద్ధ విమానాల శిక్షణ. ప్రస్తుతం ఒక మహిళాపైలట్‌ చేతికి అందబోతున్నదని రూఢీగా తెలుస్తోన్న మిగ్‌–29 గత పదేళ్లలోనూ అనేకమైన మార్పులతో వృద్ధి చెందుతూ వస్తోంది. ఏవియానిక్స్, వెపన్స్, రాడార్, ‘హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్‌ప్లే’ (హెచ్‌.ఎం.డి.) వంటివన్నీ అధునాతనం అయ్యాయి. ఉదా : హెచ్‌.ఎం.డి.! మొదట్లో ఈ హెల్మెట్‌.. పైలట్‌ కళ్లకు గ్రాఫిక్స్‌గా హెచ్చరికల సమాచారం అందించేది. ఇప్పుడిది ఇమేజెస్‌గా డిస్‌ప్లే అవుతోంది. ఈ కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోవడం, ఆపరేట్‌ చెయ్యడం, ప్రమాదాలను తప్పించుకోవడం, ఎదురు దాడుల నుంచి కాపాడుకోవడం.. ఇవన్నీ శిక్షణలో ప్రాథమికమైనవిగా ఉంటాయి.

ప్రస్తుతం ఉన్న పదిమంది మహిళా ఫైటర్‌ పైలట్‌లతో పాటు 18 మంది మహిళా నేవిగేటర్‌లు (భూమి పై నుంచి విమాన మార్గాన్ని, విమాన కదలికల్ని నియంత్రించేవారు) భారత వాయు సేనలో ఉన్నారు. వీళ్లు కాక 1875 మంది మహిళా ఆఫీసర్‌లు ఐ.ఎ.ఎఫ్‌.లో అత్యన్నతస్థాయి విధుల్ని నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాలను.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌.. కలిపి చూస్తే మహిళా ఆఫీసర్‌ల సంఖ్య గత ఏడాది సెప్టెంబరు నాటికి 9,118. రక్షణ దళాలలోకి మరింత మంది మహిళల్ని తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఈ మధ్యే పార్లమెంటులో వెల్లడించింది. ‘‘ఇది మహిళల అవసరం కాదు. మన రక్షణ వ్యవస్థ అవసరం. మూడు రక్షణ దళాలూ మహిళల శక్తి సామర్థ్యాలతో బలోపేతం కావలసి ఉంది’’ అని ఇటీవలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రిటైర్డ్‌ వింVŠ  కమాండర్‌ అనుపమా జోషి అన్నారు. 1990ల ఆరంభంలో ఐ.ఎ.ఎఫ్‌.లోకి వచ్చిన తొలి మహిళా ఆఫీసర్‌ల బ్యాచ్‌కి చెందినవారు అనుపమ. 

ఆర్మీలోని వైమానిక విభాగం (ఏవియేషన్‌ వింగ్‌)లోకి కూడా త్వరలోనే మహిళా ఫ్లయింగ్‌ ఆఫీసర్లు రాబోతున్నారు! ఆర్మీ ఏవియేషన్‌ వింగ్‌ లో ప్రస్తుతం ఉన్న మహిళా అధికారులు గ్రౌండ్‌కు మాత్రమే పరిమితమై ఉన్నారు. ఆర్మీ ఏవియేషన్‌ హెలికాప్టర్లను కూడా ఆపరేట్‌ చేస్తుంటుంది. వాటిని నడిపేందుకు ఈ జూలైలో తొలి బ్యాచ్‌ మహిళా అధికారులకు పైలట్‌లుగా శిక్షణ ప్రారంభిస్తున్నారు. 2022 జూలై నాటికి వారి శిక్షణ పూర్తవుతుంది. నేవీ మరికాస్త ముందుంది. గత సెప్టెంబరులో శిక్షణ పూర్తి చేసుకున్న ఇద్దరు మహిళల్ని తొలిసారి యుద్ధ నౌకల్లోని హెలికాప్టర్‌లకు ఫైటర్‌ పైలట్‌గా తీసుకుని చరిత్ర సృష్టించింది. లక్ష్యాన్ని గురి చూసి ఛేదించగల శక్తి పురుషుల కన్నా మహిళలకే ఎక్కువని అనేక శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైన సంగతే. పురుషులూ ఛేదిస్తారు కానీ.. లక్ష్యానికి ఆనుకుని ఉన్న జనావాసాలు కూడా ధ్వంసం అవుతాయి. పౌరులూ మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ నష్టాన్నే ‘కొల్లాటరల్‌ డ్యామేజ్‌’ అంటారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే కనుక కొల్లాటరల్‌ డ్యామేజ్‌ని నివారించేందుకు లేదా తగ్గించేందుకు మొదట మహిళా ఫైటర్‌ పైలట్‌లనే గగనతలంలోకి భారత వాయు సేన పంపే అవకాశాలైతే లేకపోలేదు. 

వాయుసేనకు మహిళాశక్తి
భారత సరిహద్దుల్లో చైనా, పాక్‌ల అతిక్రమణలు ఎప్పటికైనా యుద్ధానికి దారి తీసేవే. గత ఏడాది జూలైలో చైనా మన సరిహద్దుల్లోకి చొచ్చుకుని వచ్చిన సమయంలోనే ఫ్రాన్స్‌కు మనం ఆర్డరు పెట్టిన 36 రఫేల్‌ యుద్ధ విమానాలలో తొలి విడతగా ఐదు విమానాలు భారత్‌తో దిగాయి. వైమానిక దాడుల అవసరమే కనుక కలిగితే చైనా పాక్‌ల కంటే కూడా శక్తిమంతమైన యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయన్న సంగతి ప్రపంచానికి తెలియని వాస్తవమేమీ కాదు. భారత వాయు సేనలో ఇప్పటికే ఉన్న ‘తేజస్‌’లు దేశవాళీ ఫైటర్‌ జెట్‌లు కాగా, సుఖోయ్‌లు రష్యాలో తయారై వచ్చినవి. మిరాజ్‌ 2000 లు ఫ్రాన్స్‌ తయారీ. మిగ్‌–21లు (బైసన్‌ అని కూడా అంటారు) మిగ్‌–29లు కూడా రష్యా నుంచి తెప్పించుకున్నవే. సెపెక్యాట్‌ జాగ్వార్‌లది బ్రిటన్, ఫ్రాన్స్‌ల ఉమ్మడి టెక్నాలజీ. వీటన్నిటిలోనూ మన మహిళా ఫైటర్‌ పైలట్‌లు శిక్షణ పొందినవారే. ఇప్పుడు మిగ్‌–29 శిక్షణకు తొలిసారి ఒక మహిళా ఫైటర్‌ పైలట్‌ను భారత వాయు సేన పంపబోతోంది.

మరిన్ని వార్తలు