ఐదేళ్ల చిన్నారి.. రీడింగ్‌ రికార్డు

14 Apr, 2021 14:37 IST|Sakshi
కియరా కౌర్‌

నేటి సాంకేతిక యుగంలో నెలల వయసున్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆన్‌లైన్‌లో బిజీగా గడిపేస్తున్నారు. వీడియో గేమ్స్‌లో మునిగి తేలుతోన్న పిల్లలకు స్కూల్‌ బుక్స్‌ చదివే తీరిక కూడా ఉండడంలేదు. అటువంటిది ఐదేళ్ల చిన్నారి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండో అమెరికన్‌ చిన్నారి కియరా కౌర్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో 36 పుస్తకాలను రెండుగంటల్లోపే చదివి అతిచిన్న వయసులో..  లండన్‌ వరల్డ్‌ రికార్డ్, ఆసియా వరల్డ్‌ రికార్డుల జాబితాలో తన పేరును చేర్చింది.

చెన్నైకు చెందిన డాక్టర్‌ రవీంద్రనాథ్‌ దంపతుల కుమార్తె కియరా.  ప్రస్తుతం అబుదాబిలో ఉంటోన్న కియరాకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. కార్‌లో వెళ్తున్నా, రెస్ట్‌రూంలోకి వెళ్లినా కియరా చేతిలో బుక్‌ తప్పనిసరిగా ఉండేంత ఇష్టం తనకి. లాక్‌డౌన్‌ సమయం లో స్కూళ్లు మూతపడినప్పుడు కియరా మొత్తం సమయాన్ని బుక్స్‌ చదవడానికి కేటాయించి, వందల పుస్తకాలను చదివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 105 నిమిషాల్లో ఏకధాటి గా 36 పుస్తకాలను చదివి.. లండన్‌ వరల్డ్‌ రికార్డ్, ఆసియా వరల్డ్‌ రికార్డులలో స్థానం సంపాదించడంతో.. వరల్డ్‌ బుక్స్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కియరా ను ‘బాల మేధావి’గా అభివర్ణించింది. ఇంత చిన్నవయసు లో కియరా పుస్తకాల పురుగుగా మారడం విశేషమని కితాబునిచ్చింది.

కియరా మాట్లాడుతూ... పుస్తకాలు చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. బుక్‌ను పట్టుకుని చదువుతుంటే ఆ ఫీల్‌ వేరుగా ఉంటుంది. ఇంటర్నెట్‌ లేకపోతే ఆన్‌లైన్‌లో బుక్స్‌ చదవలేము, వీడియోలు కూడ చూడలేము. అందుకే మన చేతిలో పుస్తకం ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇబ్బంది లేకుండా చదవొచ్చు. రంగురంగుల బొమ్మలు, పెద్ద పెద్ద అక్షరాల్లో టెక్ట్స్‌ ఉన్న పుస్తకాలు చదవడమంటే నాకెంతో ఇష్టం. నాకు ఇష్టమైన పుస్తకాల జాబితాలో సిండ్రెల్లా, అలీస్‌ ఇన్‌ వండర్‌లాండ్, లిటిల్‌ రెడ్‌ రైడింగ్‌ హుడ్‌ వంటివి అనేకం ఉన్నాయి. పుస్తకాలు చదవడమేగాక భవిష్యత్తులో మంచి డాక్టర్‌ని కూడా అవుతాను’’ అని కియరా చెప్పింది. 

‘‘కియరాకు వాళ్ల తాతయ్య వాట్సాప్‌ కాల్‌లో చెప్పే కథలంటే ఎంతో ఇష్టం. గంటల తరబడి ఆయన చెప్పే కథలు వింటూ ఆమె సమయం గడిపేది. ఆయన ప్రేరణతోనే కియరా ఇలా పుస్తకాలు చదవగలుగుతోంది’’ అని కియరా తల్లి చెప్పారు. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో కియరా రెండు వందలకు పైగా పుస్తకాలను చదివింది. పుస్తకాలు అయిపోవడంతో కొత్త పుస్తకాలకోసం ఎదురుచూసేది. కొన్ని సందర్భాల్లో చదివిన పుస్తకాలనే మళ్లీమళ్లీ చదువుతూ ఉండేది. ఉద్యోగ రీత్యా మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ షాపింగ్‌ చేసిన ప్రతిసారి తనకోసం కొన్ని కొత్త పుస్తకాలను కొని తెచ్చిస్తాము’’ అని ఆమె తెలిపారు. విద్యార్థులు ఈ చిన్నారిని చూసైనా కాస్త పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశిద్దాం. 

ఇక్కడ చదవండి:
ఒంటరి తల్లులకు భరోసా ఏదీ?

పిల్లలు అకస్మాత్తుగా ఎందుకు స్పృహ తప్పుతుంటారు?

మరిన్ని వార్తలు